మ‌ళ్లీ మోడీ సార్ బాదేశాడు

Update: 2018-05-14 06:44 GMT
అనుకున్న‌దే జ‌రిగింది. దాదాపు 19 రోజులుగా పెర‌గ‌కుండా ఉన్న పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌లు సోమ‌వారం నుంచి పెర‌గ‌టం మొద‌లెట్టాయి. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల నేప‌థ్యంలో రోజువారీగా పెంచే పెట్రోల్‌..డీజిల్ ధ‌ర‌ల్ని పెంచ‌కుండా కేంద్రం నిర్ణ‌యం తీసుకుంద‌న్న వాద‌న వినిపించింది. తాజా ప‌రిణామం చూస్తే అది నిజ‌మ‌నిపించ‌క మాన‌దు.

క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కీల‌క‌మైన పోలింగ్ పూర్తి అయిన రెండు రోజుల‌కే పెట్రో బాదుడుకు తెర తీయ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.  ఓట‌ర్ల మ‌న‌సుల్ని దోచేందుకు ప్ర‌ధాని మోడీ తీరు ఎలా ఉంటుంద‌న్న‌ది తాజాగా జ‌రిగిన క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌లు ఒక ఉదాహ‌ర‌ణ‌గా చెప్పాలి. ప్ర‌ధాని స్థానంలో ఉన్న మోడీ.. వెనుకా ముందు చూసుకోకుండా రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌పై విరుచుకుప‌డిన తీరుచూస్తే.. ఎన్నిక‌ల్లో గెలుపు కోసం మోడీ ఎంత‌టి నిర్ణ‌యానికైనా వెనుకాడ‌న్న విష‌యం మ‌రోసారి రుజువైంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

గ‌డిచిన కొన్ని రోజులుగా పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌ల్ని రోజువారీగా పెంచేలా నిర్ణ‌యం తీసుకున్నారు. ఇటీవ‌ల అంత‌ర్జాతీయంగా చోటు చేసుకున్న మార్పుల కార‌ణంగా ముడి చ‌మురు ధ‌ర‌లు పెరుగుతున్న నేప‌థ్యంలో.. దేశంలో పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌ల్ని పెంచేస్తున్నారు. అయితే.. గ‌త ప్ర‌భుత్వాలు ప్ర‌తి ప‌దిహేను రోజుల‌కోమారు ధ‌ర‌ల్ని పెంచ‌టంతో పెంచిన ధ‌ర‌ల తీరు అంద‌రికి తెలిసేది. కానీ.. ఇప్పుడు అందుకు భిన్నంగా రోజుకు ప‌ది పైస‌లు.. ప‌దిహేను పైస‌లు చొప్పున పెంచ‌టం.. నెల తిరిగేస‌రికి లీట‌రు మీద రెండు నుంచి నాలుగు రూపాయిల వ‌ర‌కూ పెరిగిపోతోంది. దెబ్బ క‌నిపించ‌కుండా ప‌డుతున్న దెబ్బ‌లతో సామాన్యులు.. మ‌ధ్య త‌ర‌గ‌తి జీవులు విల‌విల‌లాడుతున్నారు.

గ‌డిచిన రెండు వారాల‌కు పైనే పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌లు పెంచ‌ని నేప‌థ్యంలో ఈ రోజు ఉద‌యం పెట్రోల్ లీట‌రుపై 17పైస‌లు.. డీజిల్ మీద 21 పైస‌లు పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో.. పెట్రో ధ‌ర‌లు రికార్డు స్థాయికి తాకిన‌ట్లైంది.

తాజా పెంపుతో ఢిల్లీలో పెట్రోల్ ధ‌ర‌లు నాలుగు సంవ‌త్స‌రాల ఎనిమిది నెల‌ల గ‌రిష్ఠాన్ని న‌మోదు చేస్తే.. డీజిల్ ధ‌ర‌లు అయితే ఏకంగా ఆల్ టైం హైను ట‌చ్ చేసిన‌ట్లైంది. ఇక‌.. దేశంలోని వివిధ న‌గరాల్లో పెరిగిన డీజిల్ ధ‌ర‌లు చూస్తే.. ఢిల్లీలో లీట‌రుకు 21 పైస‌లు.. కోల్ క‌తాలో లీట‌రుకు 5పైస‌లు.. ముంబ‌యిలో 23 పైస‌లు చెన్నైలో 23 పైస‌లుగా ఉంది. సోమ‌వారం ఉద‌యం 6 గంట‌ల నుంచి అమ‌ల్లోకి వ‌చ్చిన ఈ ధ‌ర‌లు  చూస్తే.. రానున్న రోజుల్లో మోడీ సార్ బాదుడు మ‌రింత ఎక్కువ‌గా ఉండే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.
Tags:    

Similar News