నమ్మరు కానీ ఈసారి మోడీ బాగా తగ్గించారు

Update: 2016-07-16 05:07 GMT
సార్వత్రిక ఎన్నికలకు ముందు సోషల్ మీడియాలో భారీగా జరిగిన ప్రచారాల్లో ఒకటి పెట్రోల్ ఛార్జీల తగ్గింది. యూపీఏ హయాంలో చోటు చేసుకున్న అవినీతి పుణ్యమా అని పెట్రోల్.. డీజిల్ ధరలు ఇంత భారీగా ఉన్నాయని.. ప్రధానిగా మోడీ పదవీ బాధ్యతలు చేపడితే.. ధరలు భారీగా తగ్గటం ఖాయమంటూ రకరకాల విశ్లేషణలతో కూడిన ఊరింపు ప్రచారం జరిగింది.

నల్లధనం వెనక్కి వస్తుందని.. అలా తెచ్చే సత్తా మోడీ సొంతమన్న మాట వినిపించింది. అందరి ఆశలు..ఆకాంక్షలకు తగ్గట్లే మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. పవర్ లోకి వచ్చి పాతిక నెలలు అవుతున్నా.. ఒక్కరూపాయి నల్లధనం దేశానికి తిరిగి రాలేదు సరికదా.. ప్రపంచ వ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గితే.. పెట్రోల్ లీటరు ధరలో వచ్చిన మార్పు ఎంతన్నది అందరికి తెలిసిందే. బ్యారెల్ ముడిచమురు 110 అమెరికా డాలర్లకు పైనే ఉన్న వేళ లీటరు పెట్రోల్ గరిష్ఠంగా రూ.85 వరకూ అమ్మారు. దేశంలో అవినీతి పూర్తిగా తగ్గిపోయి.. అంతర్జాతీయంగా బ్యారెల్ ముడి చమురు ధర 40 డాలర్ల దిగువనే ఉన్న వేళ లీటరు పెట్రోల్ ను రూ.70కి అమ్ముతున్న పరిస్థితి. బ్యారెల్ మీద దాదాపు 70 డాలర్ల తేడా వస్తే.. సగటు జీవి చెల్లించే లీటరు పెట్రోల్ విషయం కలిగిన ఊరడింపు కేవలం 10 – 15 రూపాయిలు మాత్రమేనని మర్చిపోకూడదు.

ఈ తగ్గింపుకూడా అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాల కారణంగా తగ్గటమే తప్పించి మరెలాంటి ప్రత్యేక తగ్గింపు లేదని చెప్పాలి. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రూడాయిల్ ధర భారీగా తగ్గినప్పటికి లీటరు మీద రూపాయి.. అర్థరూపాయి తగ్గింపు తప్పించి గట్టిగా ఐదారు రూపాయిలు తగ్గించిన పాపాన పోలేదు. భారీగా ధర పడిపోయినప్పుడు ఆచితూచి ధరల్ని తగ్గించే సర్కారు.. అంతర్జాతీయంగా ఏ మాత్రం ధర పెరిగినా ఎలాంటి మొహమాటం లేకుండా ఆ పెరిగిన మొత్తాన్ని వాయించేయటం మోడీ హయాంలో అలవాటుగా మారింది.

ఇదొక్కటే కాదు.. ధరలు తగ్గకుండా ఉండేలా ప్రత్యేక పన్నులు వేయటం.. సుంకం పెంచటం లాంటి నిర్ణయాలతో పెట్రోల్.. డీజిల్ ధరలు తగ్గింది లేదు. ప్రతి పదిహేను రోజులకు ఒకసారి పెట్రోల్.. డీజిల్ ధరల్ని పరిశీలించి.. నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. తాజాగా అలాంటి సమీక్షే జరిపిన కేంద్రం.. లీటరు పెట్రోల్ మీద రూ.2.25.. డీజిల్ మీద 64 పైసలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆసక్తికర అంశం ఏమిటంటే.. గడిచిన ఆర్నెల్ల వ్యవధిలో ఇంత భారీగా తగ్గించటం ఇదే తొలిసారి.

ఇంత మొత్తంలో ధర తగ్గటానికి కారణాల్ని వెతికితే.. అంతర్జాతీయంగా క్రూడాయిల్ కు తగ్గిన డిమాండ్.. ధర పడిపోవటం.. డాలర్ తో రూపాయి మారకంలో చోటు చేసుకున్న పరిణామాలు తప్పించి.. దేశ ప్రజల పట్ల మోడీ సర్కారు ఎలాంటి సాఫ్ట్ కార్నర్ తో నిర్ణయం తీసుకున్నదేమీ లేదని చెప్పక తప్పదు. చివరకు పరిస్థితి ఎలా తయారైందంటే.. లీటరు పెట్రోల్ మీద రెండు రూపాయిలు తగ్గింపు అంటే.. అదో పెద్ద విషయంగా మారిన దుస్థితి. మోడీ లాంటి నేత తన సహజసిద్ధమైన మార్వాడీ తత్వాన్ని విడిచిపెట్టకుండా ఆర్థిక వ్యవహారాల్లో గీసి.. గీసి వ్యవహరిస్తుంటే ఇంతకు మించి ఎవరైనా ఏమని అనుకోగలరు?
Tags:    

Similar News