క్యాలెండర్లో ఎన్ని పండగలు ఉన్నా.. దీపావళి జోష్ వేరే. టపాసుల మోతలతో కాలుష్యం విరుచుకుపడుతుందని సోకాల్డ్ పర్యావరణవేత్తలు ఎన్ని మాటలు చెప్పినా.. మిగిలిన వాటితో కానీ పొల్యుషన్ ఒక్క దీపావళి టపాసులతోనే అవుతుందా? అంటూ ప్రశ్నించే వారికి సమాధానం చెప్పని పరిస్థితి.
నాలుగున్నరేళ్ల క్రితం ఇదే మోడీ తాను ప్రధాని అయితే.. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. లీటరు పెట్రోల్ రూ.50కు దించుతానని చెప్పటం.. అందుకు సంబంధించి భారీ ఎత్తున సోషల్ మీడియా పోస్టులు వెల్లువెత్తటం తెలిసిందే. మోడీ మాటల మీద బోలెడన్ని ఆశలు పెట్టుకున్న దేశ ప్రజల్ని పట్టించుకోని ప్రధాని పుణ్యమా అని ప్రస్తుతం లీటరు పెట్రోల్ రూ.90 వరకు టచ్ అయిన పరిస్థితి. కొన్ని నగరాల్లో తొంభై మార్క్ ను దాటి పోయింది కూడా. ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ మార్కెట్లోనూ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ 80 డాలర్లకు చేరుకున్న క్రమంలో.. రానున్న రోజుల్లో పెట్రోల్ వాత భారీగాఉంటుందని చెబుతున్నారు.
చమురు ధరలు తక్కువగా ఉన్నప్పుడు పన్నుపోటు భారీగా పెంచేయటం ద్వారా పెట్రోల్.. డీజిల్ ధరల్ని ఏ మాత్రం తగ్గించని మోడీ సర్కారు.. అంతకంతకూ పెరుగుతున్న ధరల్ని కంట్రోల్ చేసే ఆలోచన లేనట్లుగా వ్యవహరిస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ దీపావళికి ఎట్టి పరిస్థితుల్లోనూ లీటరు పెట్రోల్ వంద మార్క్ దాటుతుందని.. డీజిల్ లీటరు తొంభైకి దగ్గరకు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. తాజాగా పెరుగుతున్న పెట్రోల్.. డీజిల్ ధరలతో ఇప్పటికే ఆటో ఛార్జీలు పెరిగాయి. రానున్న రోజుల్లో స్కూల్ బస్సు ఫీజులు.. ఆర్టీసీ బస్సు ఛార్జీలతో పాటు.. నిత్యవసర వస్తువుల ధరలు కూడా పెరగటం ఖాయమంటున్నారు. నమ్మి ఓట్లు వేసిన దానికి బాగా బుద్ధి చెప్పిన మోడీ పుణ్యమా అని పెట్రోల్ లీటరు వంద అయితే.. పండగవేళ ఆయన్ను గుర్తుకు తెచ్చుకోని భారతీయుడు ఎవరుంటారు చెప్పండి?