లీట‌రుకు రూ.4 బాదేయ‌నున్న మోడీ సాబ్‌?

Update: 2018-05-18 04:58 GMT
అంతేమ‌రి.. నాలుగు రోజుల పాటు బాద‌కుండా వ‌దిలిపెట్టినంత‌నే సంతోష‌ప‌డిపోతే ఇలానే ఉంటుంది మ‌రి. ప్ర‌జ‌లెంత అల్ప‌జీవుల‌న్న విష‌యం పాల‌కుల‌కు తెలిసినంత బాగా మ‌రెవ‌రికీ తెలీదేమో. దేశంలో ఎక్క‌డ ఎన్నిక‌లు జ‌రుగుతున్నా.. పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌ల పెంపు నిర్ణ‌యాన్ని ప‌క్క‌న పెట్ట‌టం.. ఆ చిన్న‌పాటి మార్పుకు తెగ ఇదైపోవ‌టం.. ఎంత గొప్ప పాల‌న అంటూ ఫీల‌య్యే ప్ర‌జ‌ల కార‌ణంగా ప్ర‌భుత్వాలు తాత్కాలిక ఉప‌శ‌మ‌నాన్ని ఇచ్చి.. త‌ర్వాత బాదేయ‌టం మామూలే. తాజాగా అలాంటిదే మ‌రోసారి చోటు చేసుకుంది.

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఏకంగా మూడు వారాల పాటు (ఒక‌ట్రెండు రోజు త‌క్కువ‌నే చెప్పాలి) పెట్రోల్.. డీజిల్ మీద పైసా పెంచ‌కుండా దేశ ప్ర‌జ‌ల‌కు క‌ర్ణాట‌క గిఫ్ట్ ఇచ్చేశారు ప్ర‌ధాని మోడీ. ఈ చిన్న బ‌హుమ‌తికే తెగ ఖుషీ అయిపోయారు ప్ర‌జ‌లంతా. ఎన్నిక‌ల ఆట మొద‌లైన‌ప్పుడ‌ల్లా ఇలాంటి తాయిలాలు విసిరి.. అందుకు డ‌బుల్ ప్ర‌యోజ‌నం పొందే తీరును మోడీ అండ్ కో కూడా ఫాలో అయ్యింది.

మ‌రి.. మూడు వారాలు ధ‌ర‌లు పెంచ‌కుంటే మీద ప‌డే భారాన్ని మోడీ మోయ‌రు క‌దా. అందులోకి గుజరాతీ అయిన మోడీ సాబ్ కు లెక్క‌ల్లో పెండింగ్ ఉంటే అస్స‌లు న‌చ్చ‌దు. అందుకే.. క‌ర్ణాట‌క ఎన్నిక‌లు అలా ముగిసాయో లేదో.. పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌ల్ని పెంచేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. అది కూడా.. నాలుగైదు పైస‌లు కాకుండా.. ప‌దిహేను పైస‌లు..ఇర‌వై పైస‌లు లెక్క‌న పెంచేస్తున్నారు. ఎన్నిపైస‌లు క‌లిపితే రూపాయి అనుకున్నారేమో కానీ.. భారీగా బాదేయ‌టానికి సిద్ధ‌మ‌వుతున్న‌ట్లుగా మార్కెట్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.

అంత‌ర్జాతీయంగా బ్రెంట్ ముడిచ‌మురు బ్యారెల్ 80 డాల‌ర్ల‌ను ట‌చ్ చేస్తున్న వేళ‌.. అందుకు త‌గ్గ‌ట్లే  ధ‌ర‌ల్ని పెంచేందుకు మోడీ స‌ర్కారు స‌మాయుత్త‌మ‌వుతోంది. ఇటీవ‌ల కాలంలో పెరిగిన ముడిచ‌మురు పుణ్య‌మా అని పెరిగిన ఆర్థిక లోటును త‌గ్గించుకోవ‌టానికి ఆ భారాన్ని ప్ర‌జ‌ల అకౌంట్లోకి బ‌దిలీ చేసే దిశ‌గా మోడీ స‌ర్కారు ఆలోచిస్తున్న‌ట్లు చెబుతున్నారు. తాము ఎన్నిక‌ల్లో విజ‌యం సాధిస్తే.. లీట‌రు పెట్రోల్‌.. డీజిల్ రూ.50 కంటే త‌క్కువ ఉంటుంద‌న్న మాట‌లు పోయి.. ఇప్పుడు లీట‌రు పెట్రోల్.. డీజిల్ 70ప్ల‌స్ కు చేరుకున్న ప‌రిస్థితి. తాజాగా పెంచాల‌నుకుంటున్న రూ.4 భారం మీద ప‌డితే.. పెట్రోల్ లీట‌రు రూ.80ను దాటేయం ఖాయం. దీంతో.. పెట్రోల్ ఆల్ టైం హ‌య‌స్ట్ మోడీ హ‌యాంలోనే అనే కొత్త రికార్డు  రావ‌టం ఖాయం. డీజిల్ ది కూడా అదే ప‌రిస్థితి అవుతుంది.

ఇంత‌కీ లీట‌రుపై నాలుగు రూపాయిల చొప్పున భారాన్ని పెంచాల‌ని ఎందుకు భావిస్తున్న‌ట్లు? అన్న ప్ర‌శ్న‌కు ఆస‌క్తిక‌ర స‌మాధానాన్ని చెబుతున్నారు. అంత‌ర్జాతీయంగా చ‌మురు ధ‌ర‌లు భారీగా పెరిగిపోయాయ‌ని.. డాల‌రుతో రూపాయిలు విలువ ప‌డిపోయిందంటున్నారు. ఈ నేప‌థ్యంలో చ‌మురు కంపెనీల‌కు న‌ష్టాలు వ‌చ్చినా.. మోడీ సార్ గారి ఎన్నిక‌ల అబ్లిగేష‌న్ ను దృష్టిలో ఉంచుకొని ధ‌ర‌ల్ని పెంచ‌కుండా న‌ష్టాలు వ‌స్తున్నా కిమ్మ‌న‌కుండా ఉండిపోయాయి.

ఏదో నాలుగైదు రోజులంటే భ‌రించే కంపెనీలు.. ఏకంగా 19 రోజులు ధ‌ర‌లు పెంచ‌కుండా పంటి బిగువునా కామ్ గా ఉన్నాయి. క‌ర్ణాట‌క‌లో కోరుకున్న‌ది జ‌రిగిన త‌ర్వాత‌.. ధ‌ర‌ల ప‌గ్గాల‌కు క‌ళ్లాలు వ‌దిలేశారు. లోటును పైసా.. పైసాతో పూడ్చుకునే క‌న్నా.. రూపాయితో క‌వ‌ర్ చేసుకోవాల‌న్న నిర్ణ‌యానికి మోడీ మాష్టారు వ‌చ్చిన‌ట్లుగా చెబుతున్నారు.  ఒక‌వేళ అదే నిజ‌మైతే.. లీట‌రు పెట్రోల్‌.. డీజిల్ పై రూ.4 చొప్పున ఒక్క‌సారిగా పెంచేయ‌నున్న‌ట్లుగా తెలుస్తోంది.

పెరిగిన ముడిచ‌మురు ధ‌ర కార‌ణంగా చోటు చేసుకున్న లోటును వెంట‌నే త‌గ్గించుకోవ‌టానికి చ‌మురు సంస్థ‌లు పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌ను ఒక్క‌సారిగా రూ.4 పెంచి.. ఆ త‌ర్వాత నుంచి రోజువారీగా బాదే బాదుడును య‌థాత‌థంగా అమ‌లు చేయాల‌ని భావిస్తున్నార‌ట‌. అదే జ‌రిగితే.. ప్ర‌జ‌ల మీద భారం భారీగా ప‌డ‌టం ఖాయం. చూస్తుంటే.. లీట‌రు పెట్రోల్ ను రూ.100 మార్క్ కు ట‌చ్ చేసే వ‌ర‌కూ మోడీ మాస్టారు నిద్ర‌పోయేట‌ట్లు క‌నిపించ‌టం లేద‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News