తమిళులకు భారీ షాకిచ్చిన పళనిస్వామి

Update: 2017-03-05 15:48 GMT
చిన్నమ్మ పుణ్యమా అని ముఖ్యమంత్రి అయిన.. ఆమె లేటెస్ట్ విధేయుడు పళనిస్వామి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. విశ్వాసపరీక్షలో విజయం సాధించిన నాటి నుంచి సంక్షేమ కార్యక్రమాలు.. మంత్రులకు తాయిలాల మీద తాయిలాలు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ.. వాటిని పట్టించుకోకుండా వివిధ పథకాల్ని ప్రవేశ పెట్టటం ద్వారా.. వ్యక్తిగత ఇమేజ్ ను పెంచుకునే ప్రయత్నంలో ఫుల్ బిజీగా ఉన్నవిషయం తెలిసిందే.

పేరుకు సీఎమ్మె కానీ..ప్రజల మనసుల్లో మాత్రం ఆయనంటే విపరీతమైన ఆగ్రహం ఉందన్న వాదనను పలువురు వినిపిస్తున్నారు. దీనికి తగ్గట్లే.. అన్నాడీఎంకే చిన్నమ్మ వర్గానికి చెందిన ఎమ్మెల్యేల్ని ప్రజలు అడ్డుకోవటం.. నిరసన వ్యక్తం లాంటివి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఎవరూ ఊహించని రీతిలో తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం తమిళులకు భారీ షాక్ గా మారింది.

సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకూ అందరి మీదా నేరుగా ప్రభావం చూపించే పెట్రోల్.. డీజిల్ ధరల్ని విపరీతంగా పెంచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పెట్రోల్.. డీజిల్ ధరల్ని కేంద్రం పెంచుతుంది కానీ.. రాష్ట్రం పెంచదు కదా? అయినా.. ధరలు పెరిగేది నెల చివర్లోనూ.. పదిహేనో తారీఖున కదా?..కానీ అటూఇటూ కాకుండా నాలుగో తారీఖున ధరలు పెంచటం ఏమిటన్నసందేహం కలగొచ్చు. అయితే.. ఇక్కడ పాయింట్ ఏమిటంటే.. కేంద్రంతో సంబంధం లేకుండా ఆయా రాష్ట్రప్రభుత్వాలు తమ ఆర్థిక అవసరాలకు అనుగుణంగా వ్యాట్ ను పెంచేసే వీలు ఉంటుంది.

తాజాగా అలాంటి నిర్ణయాన్నే తీసుకున్నారు పళని స్వామి. లీటర్ పెట్రోల్ పై రూ.3.78.. డీజిల్ పై రూ.1.70 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకూ సంక్షేమ తాయిలాలు ప్రకటించిన పళని.. అందుకు భిన్నంగా ప్రజల్లో తీవ్ర  వ్యతిరేకత వచ్చేలా పెట్రోల్.. డీజిల్ ఛార్జీల పెంపుతో ప్రజలపై భారం మోపారు.  ఇప్పటివరకూ తమిళనాడు రాష్ట్రంలో పెట్రోల్ మీద ఉన్న 27 శాతం వ్యాట్ ను తాజాగా 34 శాతానికి పెంచారు. అదే సమయంలో డీజిల్ పై ఉన్న 21.4 శాతం వ్యాట్ ను 25 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పెంపు పుణ్యమా అని.. రవాణా ఖర్చులు పెరిగి ప్రతి రంగంపై దీని ప్రభావం పడనుంది. పళనిస్వామి నిర్ణయం తమిళుల్లో తీవ్రవ్యతిరేకతవ్యక్తమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పక్క రాష్ట్రం వ్యాట్ మోత మోగించిన తీరులో.. ఆదాయాన్ని పెంచుకునే పనిలో భాగంగా పళనిస్వామిని చంద్రుళ్లు ఇద్దరూ స్ఫూర్తిగా తీసుకోకుండా ఉంటే మంచిది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News