పెట్రో మంట‌లు చ‌ల్లార్చండి మోడీ ! దేశం కోసం !

Update: 2022-04-01 02:30 GMT
పెట్రో ధ‌ర‌లు ఓ వైపు పెరిగిపోతున్నాయి. క‌రెంట్ ఛార్జీలు పెరిగిపోతున్నాయి. ఒక్క ఏపీలోనే విద్యుత్ ఛార్జీల వ‌డ్డ‌న అన్నీ క‌లుపుకు నాలుగు వేల కోట్ల‌కు పైగా ఉంది. (ట్రూ అప్ పేరిట 2900 కోట్లు..ఛార్జీల పేరిట 1400 కోట్లు). ఇదే స‌మ‌యంలో టోల్ ఛార్జీలు కూడా  పెర‌గ‌నున్నాయి అని తెలుస్తోంది.

రాష్ట్ర ప‌రిధిలో ఉన్న మేర‌కు టోల్ ఛార్జీలు కూడా పెంచాల‌ని గౌర‌వ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ యోచిస్తున్నారు. అంటే మోడీ మ‌రియు జ‌గ‌న్ ఒకే విధంగా ఆలోచిస్తున్నార‌న్న‌ది తేలిపోయింది. ఇంటి ప‌న్నులు వ‌సూలు పేరిట ఓ రెండు వేల కోట్లు, చెత్త ప‌న్ను వ‌సూలు పేరిట ఎలా చూసుకున్నా ఓ రెండు వేల కోట్లు వ‌సూలు రంగం సిద్ధ అయింది ఏపీలో ! వీటికి తోడు మోడీ ఛార్జీల వ‌డ్డ‌న ఉండనే ఉంది.

ఇలాంటి స‌మ‌యంలో జ‌గ‌న్ స‌ర్కారు కానీ జ‌న‌తా స‌ర్కారు కానీ ప్ర‌జ‌లకు చేస్తున్న‌దేంటి అన్న ప్ర‌శ్న ఒక‌టి విప‌క్షం నుంచి వ‌స్తున్న‌ది. పెట్రో ధ‌ర‌లు ప‌క్క రాష్ట్రంతో పోలిస్తే ఏపీలో ఎక్కువ.అదేవిధంగా వంట నూనెల ధ‌ర‌లు కూడా ప‌క్క రాష్ట్రంలో క‌న్నా ఏపీలోనే ఎక్కువ. ధ‌ర‌ల నియంత్ర‌ణ‌కు రాష్ట్రాలు మ‌రియు కేంద్రం ఉమ్మ‌డి ప్ర‌ణాళికతో ఎందుకు ముందుకు వెళ్ల‌డం లేద‌న్న వాద‌న ఒక‌టి బ‌లీయంగా విన‌వ‌స్తోంది ప్ర‌జ‌ల నుంచి..!

- సీతాదేవి పుట్టిన దేశం నేపాల్లో లీటర్ పెట్రోల్ రూ.97/-
- రావణుడి శ్రీలంకలో రూ.72/-
- రాముడు పుట్టిన భారతదేశంలో మాత్రం రూ.116/-  

వాస్త‌వానికి మోడీ ప్ర‌భుత్వం కానీ జ‌గ‌న్ స‌ర్కారు కానీ తాము అధికారంలోకి వ‌చ్చాక ధ‌రల నియంత్ర‌ణ‌కే తొలి ప్రాధాన్యం అని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థ‌ల‌ను కాపాడుతాం అని చెప్పారు. అంతేకాకుండా ఓఎన్జీసీ లాంటి సంస్థ‌ల‌కు మ‌రింత ప్ర‌గ‌తి అందిస్తాం అని చెప్పారు. కానీ ఇప్పుడు ఇవేవీ కాకుండా కొత్త పంథాలో ప్ర‌భుత్వ సంస్థ‌ల ప్ర‌యివేటీక‌ర‌ణ‌కు మోడీ ప్రాధాన్యం ఇస్తున్నారు. అదేవిధంగా స్థానికంగా ల‌భ్య‌మ‌య్యే చ‌మురు నిక్షేపాల‌ను ప్ర‌యివేటుప‌రం చేస్తున్నారు.

ఇందులో భాగంగా ఓఎన్జీసీ లో వాటాలు అమ్ముకునేందుకు కూడా మోడీ ప్ర‌య‌త్నిస్తున్నారు.ఇక జ‌గ‌న్ కూడా కొన్ని విష‌యాల్లో అస్స‌లు కేంద్రాన్ని ప్ర‌శ్నించ‌లేక‌పోతున్నారు. ఆరోజు విద్యుత్ ఛార్జీల పెంపు విష‌య‌మై చంద్ర‌బాబును విప‌రీతంగా విమ‌ర్శించిన జ‌గ‌న్ ఇప్పుడు మాత్రం వేర్వేరు మార్గాల‌లో వ‌డ్డ‌న‌ను షురూ చేస్తున్నారు. ఏ విధంగా చూసుకున్నా అటు కేంద్రం ఇటు రాష్ట్రం ధ‌ర‌ల నియంత్ర‌ణ‌కు తీసుకున్న చ‌ర్య‌లు శూన్యం.

ఓ విధంగా ఆర్థిక ప్ర‌గ‌తి కాస్తో కూస్తో ఆశించిన స్థితిలో ఉన్న రోజుల్లోనే ప‌న్నుల వ‌డ్డ‌న పేరిట ప్ర‌జ‌ల‌ను అదే ప‌నిగా ఇబ్బంది పెట్ట‌డం అన్న‌ది భావ్యం కాద‌ని,ఇప్పుడిప్పుడే క‌రోనా నుంచి కోలుకుంటున్న వ్య‌వస్థ‌ల‌కు ఇదొక ఆశాభంగం అని అంటున్నాయి విప‌క్షాలు. పెట్రోలు, గ్యాస్, డీజిల్, క‌రెంట్ ఛార్జీల పెంపుద‌ల‌తో ఒకే సారి ఇరు ప్ర‌భుత్వాలూ చేస్తున్న దాడి నుంచి త‌ప్పుకోవ‌డం సాధ్యం కాని ప‌ని అయినా కూడా ఒక్క అడుగు వెన‌క్కు వేసేందుకు ఇరు ప్ర‌భుత్వాలూ ఆలోచించడం లేదు అని గగ్గోలు పెడుతున్నాయి.
Tags:    

Similar News