వ్యాక్సిన్ రేసులో ఫైజర్ దూసుకెళ్లిపోతుందా? ప్రపంచానికి గుడ్ న్యూస్?

Update: 2020-11-09 18:21 GMT
అంతలో ఆశ.. కాసేపటికే నిరాశ.. ఇలా తీవ్రమైన అనిశ్చితి కరోనా వ్యాక్సిన్ విషయంలో చోటు చేసుకుంటోంది. వచ్చేస్తుంది.. వచ్చేస్తుందని చెబుతున్నా.. ఏడాది చివర్లోకి వస్తున్నా.. వ్యాక్సిన్ జాడ కనిపించని పరిస్థితి. వచ్చే ఏడాదిలో ఎప్పుడు వస్తుందో కూడా అంచనా వేయలేకపోతున్నట్లుగా కొందరు చేస్తున్న వ్యాఖ్యలు.. కరోనా టీకాపై కొత్త సందిగ్థత వ్యక్తమయ్యేలా చేస్తోంది.

ఇలాంటి వేళ.. ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పేసింది ఫైజర్. దాదాపు వందకు పైగా సంస్థలు కరోనా వైరస్ మీద పరిశోధనలు చేస్తున్నప్పటికీ.. కొన్ని సంస్థలు చేస్తున్న రీసెర్చ్ మాత్రమే ముందుకు వెళుతోంది. ఇలాంటి వేళ దిగ్గజ కంపెనీ ఫైజర్.. బయోఎన్ టెక్ సంస్థలు కలిసి ఉమ్మడిగా డెవలప్ చేస్తున్న వ్యాక్సిన్ 90 శాతం ప్రభావవంతంగా పని చేస్తున్నట్లుగా చెబుతున్నారు.

సురక్షితమైన.. సమర్థత కలిగిన వ్యాక్సిన్ అందించే విషయంలో కీలకదశకు తాము చేరుకున్నట్లుగా వెల్లడించారు. తాజా ఫలితాలు వ్యాక్సిన్ తయారీ అనుమతికి దోహదం చేస్తుందని పేర్కొంది. తాము వేసిన అంచనాలు నిజమైన పక్షంలో త్వరలోనే అమెరికాలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వీలుందని చెబుతున్నారు. తాము తయారు చేసిన వ్యాక్సిన్ కు సంబంధించిన సమాచారాన్ని అమెరికా నియంత్రణ సంస్థలకు ఫైజర్ ఇవ్వనుందని చెబుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా చుక్కలు చూపిస్తుంటే.. ఈ తీవ్రత అమెరికాలో ఎక్కువగా ఉంది. తాజా సెకండ్ వేవ్ ధాటికి అగ్రరాజ్యం వణికిపోతోంది. రోజుకు 1.3లక్షల మంది కరోనా బారిన పడుతున్న వేళ.. వ్యాక్సిన్ విషయంలో ఫైజర్ నుంచి వచ్చిన ప్రకటన కొత్త ఉత్సాహాన్ని ఇవ్వటమే కాదు.. అమెరికన్లకు ఇదో శుభవార్తగా అభివర్ణిస్తున్నారు. తొలిదశలో వచ్చిన వ్యాక్సిన్ సమర్థత 60-70 శాతం మాత్రమే ఉంటుందని అంచనా వేశామని.. తాజా ఫలితాలు 90 శాతానికి పైగా సమర్థతతో ఉండటం అసాధారణ అంశంగా చెబుతున్నారు.

తాజా ఫలితాల్ని సమీక్షించగా.. మహమ్మారికి చెక్ పెట్టే సామర్థ్యాన్ని సొంతం చేసుకున్నట్లుగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. తాజా ఫలితం సైన్స్ సాధించిన అద్భుత విజయంగా అభవర్ణిస్తున్నారు. ఇదంతా బాగానే ఉన్నా.. ఫైజర్ చెప్పినట్లుగా 90 శాతానికి పైగా ఫలితాలతో రూపొందించిన వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చి..ఈ ఉత్పాతం నుంచి ప్రపంచాన్ని కాపాడినట్లే.. ఇప్పుడు పొగిడే పొగడ్తలకు అర్హత ఉంటుందన్నది మర్చిపోకూడదు.
Tags:    

Similar News