అమెరికా నుంచి ఫోన్ చేసి.. ఢిల్లీలో ఆత్మ‌హ‌త్య‌ను ఆపిన‌ ఫేస్ బుక్ ప్ర‌తినిధి!

Update: 2021-06-06 06:30 GMT
జూన్ 3వ తేదీ.. స‌మ‌యం అర్ధ‌రాత్రి 12 గంట‌లు.. ఢిల్లీలోని ద్వార‌క ప్రాంతం.. 39 సంవ‌త్స‌రాల వ్య‌క్తి దారుణ నిర్ణ‌యం తీసుకున్నాడు.. ఆత్మ‌హ‌త్య‌కు సిద్ధ‌మ‌య్యాడు.. క‌త్తితో చేతి మ‌ణిక‌ట్టు వ‌ద్ద ప్ర‌ధాన న‌రాన్ని తెంపేశాడు.. ర‌క్తం ధార‌గా కారిపోతోంది. ఇదంతా అమెరికాలోని ఫేస్ బుక్ ప్ర‌తినిధులు గుర్తించారు. అదెలా అంటే.. ఇత‌డు ఫేస్ బుక్ లైవ్ స్ట్రీమింగ్ ఆన్ చేసి ప్రాణాలు తీసుకుంటున్నాడు!

అది గుర్తించిన ఫేస్ బుక్ ప్ర‌తినిధులు వెంట‌నే స్పందించారు. క్ష‌ణ‌కాలం కూడా వృథా చేయ‌కుండా లొకేష‌న్ ట్రేస్ అవుట్ చేశారు. అది భార‌తదేశంలోని ఢిల్లీ ప్రాంతాన్ని సూచిస్తోంది. వెంట‌నే ఢిల్లీ పోలీసుల‌కు కాల్ క‌లిపారు. న‌గ‌రంలో ఓ చోట దారుణం జ‌రుగుతోందంటూ స‌మాచారం అందించారు. స‌ద‌రు వ్య‌క్తి పేరు, ఫేస్ బుక్ ఖాతాలోని వివ‌రాల‌తోపాటు ఫోన్ నంబ‌ర్ కూడా చెప్పారు.

వెంట‌నే అల‌ర్ట్ అయిన పోలీసులు ఆ నంబ‌ర్ కు ఫోన్ చేశారు. కానీ.. స్విచ్ఛాఫ్ వ‌చ్చింది. దీంతో.. ఆ నంబ‌ర్ ఆధారంగా అత‌డి అడ్ర‌స్ క‌నుక్కున్నారు. అది ఢిల్లీలోని ద్వారకా ప్రాంతం అని నిర్ధారించుకొని హుటాహుటిన ప‌రుగులు తీశారు. ఆ ఇంటిని గుర్తించి లోనికి వెళ్లి చూడ‌గా.. ర‌క్త‌పు మ‌డుగులో ప‌డిఉన్నాడు బాధితుడు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. వెంట‌నే స‌మీపంలోని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. స‌మ‌యానికి తీసుకురావ‌డంతో అత‌ని ప్రాణాలు నిలిచాయి.

ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డానికి గ‌ల కార‌ణాలు ఆరాతీస్తే.. అత‌డి భార్య చ‌నిపోయింది. దీంతో మాన‌సికంగా తీవ్రంగా కుంగిపోయాడు. ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్న‌ప్ప‌టికీ.. భార్య ఎడ‌బాటును భ‌రించ‌లేక చ‌నిపోవాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. ఫేస్ బుక్ లైవ్ ఆన్ చేయ‌డం వ‌ల్ల‌నే అత‌ని ప్రాణాలు నిలిచాయి. అమెరికా నుంచి ప్ర‌తినిధులు గుర్తించి, వెంట‌నే స్పందించ‌డం ప‌ట్ల వారిపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది.
Tags:    

Similar News