కేసీఆర్ వ్య‌తిరేకుల‌కు వెంక‌య్య అండ‌!!

Update: 2016-11-28 10:24 GMT
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుపై టీఆర్ ఎస్ శ్రేణుల్లో కొత్త అసంతృప్తి మొద‌లైందని అంటున్నారు. తమ నాయకుడు - తెలంగాణ సీఎం కేసీఆర్ రాజ‌కీయ వ్య‌తిరేకుల‌కు వెంక‌య్య అండ‌గా నిలుస్తున్నార‌ని గులాబీ వ‌ర్గాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా వెంక‌య్య పాల్గొన్న స‌మావేశ‌మే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని చెప్తున్నాయి. వర్గీకరణ కోసం పార్లమెంటులో బిల్లు పెట్టేలా ఒత్తిడి తెచ్చేందుకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నేత మంద‌కృష్ణ మాదిగ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన‌ ధర్మయుద్ధం బహిరంగసభలో కేంద్రమంత్రి వెంక‌య్య‌తో పాటు మ‌రో మంత్రి ద‌త్తాత్రేయ - బీజేపీ రాష్ట్ర నాయ‌కులు పాల్గొన్నారు. అంతేకాకుండా కేసీఆర్ ప్ర‌స్తావ‌న వ‌స్తేనే ఒంటికాలిపై లేచే  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే లక్ష్మణ్ - బీజేపీ ఎల్పీనేత కిషన్‌ రెడ్డి - టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి - కాంగ్రెస్ నేతలు జానారెడ్డి - సర్వేసత్యనారాయణ - టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ - వర్కింగ్ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి - ప్రజాగాయకులు విమలక్క - తదితరులు పాల్గొని ప్రసంగించారు. వీరంతా వ‌ర్గీక‌ర‌ణ విష‌యంలో కేసీఆర్ తీరును త‌ప్పుప‌ట్ట‌డం గ‌మ‌నార్హం.

ఈ స‌భ‌కు ముఖ్య అతిథిగా హాజ‌రైన వెంకయ్యనాయుడు  ప్ర‌సంగిస్తూ రిజర్వేషన్ల ఫలాలు మాదిగలకు అందలేదని, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు మాదిగలు చేస్తున్న పోరాటం న్యాయబద్ధమైనదని - దానిపట్ల ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా సానుకూలంగా ఉన్నారని వెల్లడించారు. వర్గీకరణ కోసం పార్లమెంటులో బిల్లు పెట్టేలా ప్రధానితో చర్చిస్తానని ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇవ్వడమంటే కులాల విభజనకు సమర్ధన కాదని - సామరస్యం పెంచడమేనన్నారు. ఎమ్మార్పీఎస్ ధర్మయుద్ధం మహాసకు పలు రాష్ట్రాల నుంచి కార్యకర్తలు తరలిరావడం వారి ఆకాంక్షకు అద్దం పడుతుందన్నారు. కేంద్రమంత్రిగా ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నానన‌ని, ఎస్సీ వర్గీకరణ డిమాండ్ న్యాయమైన కోరిక అని అన్నారు. టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ - వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌ రెడ్డిలు మాట్లాడుతూ మాదిగ‌ల‌ ధర్మయుద్దం న్యాయమైందని అన్నారు. రిజర్వేష‌న్‌ ఇప్పటికే ఆలస్యమైందని వెంటనే చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. టీడీపీ హయాంలో వర్గీకరణను అమలు చేస్తే దాదాపు 22వేల మందికి లాభం చేకూరిందని, కాని కొంతమంది కోర్టుకు వెళ్లడం ద్వారా చట్టబద్ధత అవసరమైందని గుర్తు చేశారు. మాదిగ ఉపకులాల రిజర్వేషన్ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే విషయంపై ప్రధాని నరేంద్రమోడీతో సీఎం కేసీఆర్ చర్చించాల‌ని డిమాండ్ చేశారు. పీసీసీ ఛీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ప్ర‌సంగిస్తూ ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ విష‌యంలో సీఎం కేసీఆర్ చొర‌వ తీసుకోవాల‌ని కోరారు.

కాగా ఈ స‌మావేశం సాగిన తీరుపై ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి మండిప‌డ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ఎస్సీ వర్గీకరణ కోసం తీర్మానం చేసిన సీఎం కేసీఆర్‌ను విమర్శిస్తే రేవంత్‌ రెడ్డి, మందకృష్ణ నాలుక చీరేస్తామని ఆయ‌న హెచ్చరించారు. ఏపీలో తీర్మానం చేయని చంద్రబాబును పక్కనపెట్టి, తీర్మానం చేసిన కేసీఆర్‌ పై విమర్శలు చేయడం మందకృష్ణ కుటిలనీతికి నిదర్శనమని - ఆయన తీరు మాదిగలకు తీవ్ర నష్టమని మండిపడ్డారు. ఆంధ్రలో మాదిగలు ఏడు శాతం ఉంటే, తెలంగాణలో 12 శాతం ఉన్నారని, ఎస్సీ వర్గీకరణను సక్రమంగా చేపట్టకపోతే మాదిగలకు - మాదిగ ఉపకులాలకు అన్యాయమని పిడ‌మ‌ర్తి ర‌వి చెప్పారు. ఎస్సీ-ఏలో ఒక్కశాతం మాదిగ ఉపకులాలకు - ఎస్సీబీలో 18శాతం మాదిగలకు - ఎస్సీ-సీలో మూడుశాతం మాలలకు - ఎస్సీ-డీలో మాల ఉపకులాలకు ఒక్కశాతం రిజర్వేషన్ ఉండాలని అన్నారు. ధర్మయుద్ధం సభకు కేసీఆర్ రాకుంటే వర్గీకరణకు టీఆర్‌ ఎస్ వ్యతిరేకం అనుకుంటామని మందకృష్ణ అనడం సిగ్గుచేటని పిడ‌మ‌ర్తి ర‌వి మండిప‌డ్డారు. సీఎం కేసీఆర్ పేరు లేకుండా ఆహ్వానపత్రం తయారుచేసి, ఇప్పుడు ఆయన అపాయింట్‌ మెంట్ ఇవ్వడం లేదనడం దారుణమని మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబును సభకు ర‌ప్పిస్తే, తమ సీఎం కేసీఆర్‌ ను కూడా తీసుకొస్తామన్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News