పెళ్లాంపై కోపంతో ఫ్లైట్ కూల్చేస్తానన్నాడు

Update: 2016-03-08 07:16 GMT
ఆలుమగలన్నాక అలకలు - కోపతాపాలు సాధారణమే. కోపం ఎక్కువైనప్పుడు ఒక్కొక్కరు ఒక్కోలా ప్రవర్తిస్తారు. కానీ, విమానం పైలట్ గా పనిచేస్తున్న ఓ భర్త మాత్రం భార్యపై ఉన్న కోపాన్ని ప్రయాణికులపై చూపించబోయాడు. భార్యపై కోపంతో విమానాన్ని కూల్చేసి, అందులోని ప్రయాణికులందరినీ చంపడంతో పాటు తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు.

ఇటలీకి చెందిన ఒక పైలట్ తాను నడుపుతున్న విమానాన్ని కూల్చేస్తానని బెదిరించిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 200 మంది ప్రయాణికులతో గత ఏడాది జనవరిలో రోమ్ నుంచి జపాన్‌ కు వెళ్లేందుకు సిద్ధమైన సదరు విమాన పైలెట్‌ ను వదిలి వెళ్లిపోతానని భార్య హెచ్చరించడంతో అతను ఈ బెదిరింపునకు దిగాడట. భార్య తనను బెదిరించడంతో ఆయన కూడా ప్రతిగా... ''నన్ను వదిలి వెళ్తే మార్గం మధ్యలో విమానాన్ని కూల్చేసి ప్రయాణికులందరినీ చంపడంతో పాటు నేనూ ఆత్మహత్య చేసుకుంటాను'' అని బెదిరిస్తూ భార్యకు టెక్స్ట్ మెసేజ్ పంపించాడట. వెంటనే ఆమె అధికారులను అప్రమత్తం చేసింది. దీంతో వారు రోమ్‌ లోని ఫియుమిసినో విమానాశ్రయం నుంచి ఆ విమానం బయలుదేరడానికి ముందే పోలీసులు ఆ పైలెట్‌ ను ఆపేసి మరో పైలెట్ ను విమానమెక్కించారు.

కాగా ఈ వివాదాస్పద పైలట్ నిత్యం తనను వేధిస్తున్నాడంటూ గతంలో అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసిందట. ఆ కారణంగా ఆయన సస్పెండ్‌ చేసి మానసిక వైద్య పరీక్షలకు కూడా పంపించారట. కొద్ది నెలల కిందట జర్మనీ పైలట్ ఒకరు  ఎ-320 విమానాన్ని ఉద్దేశ్యపూర్వకంగా ఆల్ఫ్స్ పర్వతాల్లో కూల్చివేసి 149 మందిని హతమార్చిన సంగతి తెలిసిందే. ఇలాంటి మానసిక సమస్యలున్న పైలట్లతో విమానాలు నడిపించకపోవడమే నయం. లేదంటే వందలాదిమంది ప్రయాణికుల ప్రాణాలకు ఎప్పటికైనా ముప్పే.

Tags:    

Similar News