హాట్ టాపిక్: విశాఖలో పీకే టీం సర్వే.. ఎందుకంటే?

Update: 2021-10-05 10:30 GMT
దేశంలోని పలు రాజకీయ పార్టీలకు ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేయటం... రాజకీయ అంశాల మీద ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయి? అన్న విషయాల మీద సర్వేలు జరపడం, వ్యూహాలు రచించడంలో పీకే టీం వెరీ పాపులర్.

గతంలో వైసీపీ కోసం పనిచేసిన పీకే (ప్రశాంత్ కిశోర్) టీం మళ్లీ వైసీపీ కోసం రంగంలోకి దిగినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా పీకే టీం విశాఖకు వచ్చినట్లుగా చెబుతున్నారు. గడిచిన రెండు రోజులుగా ఈ టీం విశాఖ ప్రజల నుంచి పలు అంశాల మీద అభిప్రాయాల్ని తెలుసుకుంటున్నట్లు చెబుతున్నారు.

ఈ అంశం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. స్థానిక పరిస్థితుల గురించి సమాచారాన్ని సేకరించడం తో పాటు.. ఇటీవల కాలంలో పలువురికి నామినేటెడ్ పోస్టులు లభించటం.. పదవులు ఆశించిన వారికి రాకపోవటం లాంటివి తెలిసిందే. దీంతో.. అధికార పార్టీ నేతల ఫీడ్ బ్యాక్ తో పాటు.. అధికారుల తీరు మీదా వారు సర్వే జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. పదవులు ఆశించిన దక్కని వారు నిరాశతో ఉన్నట్లు గుర్తించినట్లు చెబుతున్నారు.

దీనికి తోడు ఏళ్ల తరబడి పార్టీకి సేవ చేసిన వారిని కాదని.. ఆర్థికంగా అండగా నిలిచిన వారికే పదవులు లభిస్తున్నాయన్న ఫిర్యాదులు కూడా వారికి చేరినట్లుగా సమాచారం. అధికారులు కొందరు ప్రజాప్రతినిధులకే విలువ ఇస్తున్నారని.. మిగిలిన వారిని పట్టించుకోవటం లేదన్న ఫిర్యాదు వచ్చినట్లు చెబుతున్నారు. మొత్తంగా విశాఖలో పార్టీని మరింత పటిష్టం చేసే క్రమంలో.. రాజకీయ అంశాల మీద పెద్ద ఎత్తున సర్వే చేస్తూ.. ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ ఉదంతం రాజకీయ వర్గాల్లో కొత్త తరహా చర్చకు తెర తీసింది.




Tags:    

Similar News