యుద్ధ ప్రాతిప‌దిక‌న ఆ దేశం ఆవుల్ని కొనేస్తోంది

Update: 2017-06-13 16:14 GMT
ఏదైనా అత్య‌వ‌స‌ర ప‌రిస్థితులు ఏర్ప‌డితే యుద్ధ సామాగ్రి కొన‌ట‌మో. ముడిచ‌మురు కొన‌ట‌మో చేస్తారు. కానీ.. ఖ‌తార్ మాత్రం అందుకు భిన్న‌మైన మార్గాన్ని ఎంచుకుంది. త‌న‌పై సౌదీ త‌దిత‌ర దేశాలు విసిరిన బ్యాన్ స‌వాలుకు అంతే ధీటుగా స‌మాధానం చెప్పేందుకు సిద్ధ‌మ‌వుతోంది.

త‌మ మీద విధించిన బ్యాన్ నేప‌థ్యంలో దేశంలో ఎదుర‌య్యే ప‌రిస్థితుల్ని ఎదుర్కొనేందుకు ఇప్పుడా బుడ్డ సంప‌న్న దేశం నాలుగు వేల ఆవుల్ని కొనేసింది. అలా కొన‌ట‌మే కాదు.. అందు కోసం యుద్ధ ప్రాతిప‌దిక‌న 60 విమానాల్లో త‌మ దేశానికి త‌ర‌లించనుంది.

ఉగ్ర‌వాదుల‌కు ఆర్థిక సాయం చేస్తున్నార‌ని.. ఉగ్ర‌వాదుల‌కు ఊతం ఇస్తున్నారంటూ ఖ‌తార్ పై సౌదీ అండ్ కో దేశాలు బ్యాన్ విధించ‌టం తెలిసిందే. దీంతో.. ఆ దేశం తీవ్ర ఇబ్బందుల్లో ఎదుర్కొంది. ఖ‌తార్ గురించి మాట్లాడుకునేట‌ప్పుడు ఆ దేశం గురించి కాసింత తెలుసుకుంటే.. చాలా త‌క్కువ దేశాల‌కు మాత్ర‌మే ఉండే విచిత్ర‌మైన ప‌రిస్థితి ఏమిటో అర్థ‌మ‌వుతుంది.

ఖ‌తార్‌ కు మూడు వైపుల స‌ముద్రం ఉండ‌గా.. ఒక్క వైపు సౌదీ అరేబియాతో భూ స‌రిహ‌ద్దులు మాత్ర‌మే ఉన్నాయి. అంటే.. ఆ దేశానికి భూ మార్గం నుంచి ఏదైనా రావాల‌న్నా.. బ‌య‌ట‌కు పోవాల‌న్నా సౌదీ మీద‌నే జ‌ర‌గాలి. తాజాగా బ్యాన్ విధించిన నేప‌థ్యంలో సౌదీ నుంచి రాక‌పోక‌లు పూర్తిగా నిలిచిపోయాయి.

దీంతో.. ఆ దేశంలో తీవ్ర ఆహార కొర‌త‌తో పాటు.. మ‌రిన్ని ఇబ్బందులు ఎదురయ్యే ప‌రిస్థితి. ప్ర‌పంచంలోనే అత్యంత ధ‌న‌వంత‌మైన దేశంలో తిండి కోసం క‌ష్టం వ‌స్తే త‌ట్టుకోగ‌ల‌రా? అందుకే ఆ దేశం త‌న‌దైన శైలిలో స్పందించింది. త‌మ మీద విధించిన బ్యాన్ ను స‌మర్థ‌వంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా.. ముందు పాల దిగుబ‌డిని భారీగా పెంచాల‌ని నిర్ణ‌యించింది. ఇక‌.. కూర‌గాయ‌లు..  నిత్య‌వ‌స‌ర వ‌స్త‌వుల్ని ఇరాన్ నుంచి తీసుకొస్తోంది.

ఇందులో భాగంగా యుద్ధ ప్రాతిప‌క‌దిక‌న 4 వేల ఆవుల్ని కొనేసి విమానాల్లో దేశానికి తీసుకెళ్లే ప్లాన్ చేసింది. ఇదిలా ఉంటే.. మ‌రోవైపు ఇరాన్ నుంచి ప్ర‌తి రోజు విమానాల్లో నిత్య‌వ‌స‌ర వ‌స్తువుల్ని తీసుకొస్తున్నారు. ఇక‌.. పాల ఉత్ప‌త్తుల్ని పెంచ‌టం కోసం భారీ ఎత్తున ఆవుల్ని దేశానికి తీసుకురావాల‌ని డిసైడ్ చేశారు. ఇందుకు ఆస్ట్రేలియా అనువని తేల్చారు. అయితే.. స‌ముద్ర మార్గంలో  వీటిని తేవ‌టం చాలా స‌మ‌యం ప‌ట్టే  అవ‌కాశం ఉండ‌టంతో.. వాటిని విమానాల్లో తీసుకురావాల‌ని  ఖ‌తార్ కు చెందిన పారిశ్రామిక‌వేత్త మౌతాజ్ అల్ ఖ‌య్య‌త్ నిర్ణ‌యించారు. ..

భారీ ఎత్తున కొనుగోలు చేసిన ఆవుల‌తో సెప్టెంబ‌రు నాటికి దేశంలో పాల దిగుబ‌డిని పెంచాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. ఇక‌.. ఆవులు దేశానికి చేరుకొని అవి ఉత్ప‌త్తిని మొద‌లు పెట్టేందుకు ఈ నెలాఖ‌రును గ‌డువుగా పెట్టుకున్నారు. స‌వాలు ఎదురైన వెంట‌నే బెదిరిపోకుండా.. దాన్ని ఎలాగైనా ఎదుర్కోవాల‌న్న ఖ‌తార్ దేశ ధీమాను చూస్తే ముచ్చ‌టేయాల్సిందే. డ‌బ్బులు చేతిలో ఉన్నోడి ధీమానే వేరు మ‌రి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News