హ్యూస్ మరణంపై తుది తీర్పు వచ్చింది!

Update: 2016-11-04 11:14 GMT
దాదాపు రెండేళ్ల క్రితం.. 2014 నవంబర్ లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో జరిగిన ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యూస్ విషాద మరణాన్ని ఎవరూ మరచిపోలేదు. మైదానంలో బంతి తగిలిన అతను ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి ఓడిపోయాడు. అయితే ఆ ఘటనపై న్యాయ విచారణ జరుపుతుండంతో అతని మరణం మళ్లీ వార్తల్లో నిలిచింది. హ్యూస్‌ కు సీన్ అబాట్ బౌన్సర్ విసిరిన ఆ మ్యాచ్‌ కు సంబంధించి ప్రత్యర్థి జట్టు వ్యూహ ప్రతివ్యూహాలు - స్లెడ్జింగ్‌ కు సంబంధించి అతి చిన్న విషయాలపై కూడా అధికారులు విచారణ జరిపిన సంగతి తెలిసిందే. అయితే ఈ విచారణకు సంబందించిన తీర్పును తాజాగా న్యూసౌత్ వేల్స్ కారనర్స్ కోర్టు వెల్లడించింది.

పూర్తి స్థాయి విచారణ అనంతరం హ్యూస్‌ మృతికి ఏ క్రికెటర్ తప్పిదమూ కారణం కాదని న్యూసౌత్ వేల్స్ కారనర్స్ కోర్టు తాజా తీర్పులో స్పష్టం చేసింది. హ్యూస్ మరణానికి ప్రధాన కారణం అతను బంతిని అంచనా వేయడంలో విఫలం కావడమేనని పేర్కొంది. ఇదే సమయంలో ప్రత్యర్థి జట్టు వ్యూహ ప్రతివ్యూహాలు - స్లెడ్జింగ్‌ లు కూడా కారణాలని అప్పట్లో కథనాలు వచ్చిన నేపథ్యంలో కోర్టు ఆ విషయాలపై కూడా స్పందించింది. అలాగే ప్రమాదకరమైన - ఆమోదయోగ్యం కాని బౌలింగ్ ను క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) సమీక్షించి - అందుకు తగిన చట్టాలను రూపొందించాలని కోర్టు అభిప్రాయపడింది.

ఈ విషయాలపై తుది తీర్పు వెల్లడిచిన కోర్టు... "ప్రత్యర్థి జట్టు ద్వేషంతో కూడిన తీరును ఇక్కడ అవలంభించలేదు.. కావాలని అతడిపై ప్రమాదకరమైన బంతులను సంధించమని చెప్పారనడానికి ఆధారాలు లేవు.. హ్యూస్ మృతికి బౌలర్ కాని, మిగిలినవారు కానీ కారణం కాదు.. వేగంగా వస్తోన్న బంతిని అంచనా వేయడంలో హ్యూస్ చేసిన పొరపాటే అతని ప్రాణాలు తీసింది" అని తెలిపింది. దీంతో హ్యూస్ మరణంపై ఉన్న అనుమానాలు వీడినట్లేనని పలువురు అభిప్రాయపడుతున్నారు!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News