మోడీ @ స్పీక‌ర్ మోడ్‌ - ఫ్లైట్ మోడ్‌

Update: 2018-05-08 04:21 GMT
పంజాబ్ - పుదుచ్చేరి - పరివార్ పీపీపీ అంటూ కాంగ్రెస్‌ పై విమర్శలు గుప్పించిన ప్రధాని మోడీపై రాహుల్‌ గాంధీ తన ఎదురుదాడిని కొనసాగించారు. మోడీని మొబైల్ ఫోన్‌ తో పోలుస్తూ.. ఆయన ఎల్లప్పుడూ స్పీకర్ - ఏరోప్లేన్ మోడ్‌ లో తప్ప వర్కింగ్ మోడ్‌ లో ఉండరని వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో ముమ్మర ప్రచారం కొనసాగిస్తున్న రాహుల్.. మాట్లాడేందుకు ఇతర అంశాలు లేకపోవడం వల్లే ప్రధాని మోడీ తనపై వ్యక్తిగత దాడికి దిగుతున్నారని ఆరోపించారు. జేడీఎస్‌ ను జనతాదళ్ సంఘ్ పరివార్ (జేడీఎస్)గా ఆయన అభివర్ణించారు. అలాగే పెట్రోల్‌ ధరల పెంపునకు నిరసనగా ఎద్దుల బండ్లో ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. ``స్కూటర్లు - ట్రక్కులు - బస్సులు నడిపేవారి జేబుల నుంచి డబ్బులు తీసుకుని మీ ధనవంతులైన (మోడీనుద్దేశించి) మిత్రులకు ఇవ్వాలని చూస్తున్నారా?`` అంటూ ప్రశ్నించారు.

ప్రధాని మోడీ ఎప్పుడూ 'ఎయిర్‌ ప్లేన్‌ - స్పీకర్‌ మోడ్‌'లోనే ఉంటారన్న కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఆ పార్టీ అధికార ప్రతినిథి సంబిత్ పాత్ర‌ స్పందిస్తూ... కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేశం కరెప్షన్‌ (అవినీతి) మోడ్‌ లో ఉండేదని విమర్శించారు. ఇదిలాఉండ‌గా...నైపుణ్యాభివృద్ధి - నవకల్పనలకు ప్రాధాన్యమివ్వడం ద్వారా నవభారతాన్ని నిర్మిద్దామని ప్రధాని నరేంద్రమోడీ బీజేవైఎం కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అత్యాధునికత సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. విపక్షాలు ఆధార్‌ కార్డు అనుసంధానం - ఈవీఎంల వాడకాన్ని వ్యతిరేకించడాన్ని తప్పుపట్టారు. సోమవారం ఆయన నమో యాప్ ద్వారా కర్ణాటక బీజేవైఎం కార్యకర్తలతో సంభాషించారు. కర్ణాటకలో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందంటూ వస్తున్న కథనాలపై మోడీ అసంతృప్తి వ్యక్తంచేశారు. ఇటీవల ప్రచారంలో 45 డిగ్రీల ఎండ కాస్తున్నా బీజేపీ కార్యకర్తల్లో ఉరిమే ఉత్సాహాన్ని చూశాను. హంగ్ ఏర్పడకుండా ప్రతి కార్యకర్త కృషిచేసి బీజేపీని అధికారంలోకి తేవాలి. అన్నివర్గాల ప్రజలు ఎన్నికల్లో భాగస్వాములయ్యేలా మీరు కృషిచేయాలి అని పిలుపునిచ్చారు.
Tags:    

Similar News