యూరీకి ప్రతీకారం ఎలా ఉండబోతోంది?

Update: 2016-09-19 09:46 GMT
ప్రధాని మోడీ పుట్టిన రోజు గిఫ్ట్ అన్న చందంగా పాక్ ప్రేరేపిత తీవ్రవాదులు జమ్ముకశ్మీర్ లోని యూరి సైనిక శిబిరంపై దాడి చేయటం తెలిసిందే. ఈ దారుణ ఘటనలో 17 మంది భారత సైనికులు ప్రాణాలు విడిచారు. దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైన ఈ ఘటనను కేంద్రం సీరియస్ తీసుకున్నట్లుగా పలు మీడియా కథనాలు వెలువడుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో జరిగిన ఈ పాశవిక దాడిలో తీవ్రంగా గాయపడిన వారిలో తాజాగా మరో ముగ్గురు మరణించారు. దీంతో.. యూరీ ఘటనలో మరణించిన వారి సంఖ్య 20కు చేరుకుంది.

మరోవైపు.. పాక్ దుర్మార్గానికి దెబ్బకు దెబ్బ అన్న రీతిలో ప్రతీకారం తీర్చుకువాలన్న కసి భారతసైనిక వర్గాల్లో కనిపిస్తోందన్న మాట వినిపిస్తోంది. తమకు పరిమితమైన అనుమతి ఇచ్చినా పాక్ ను ఒక చూపు చూసి వస్తామని సైనిక వర్గాలు ఉన్నతస్థాయి వర్గాల మీద ఒత్తిడి తెస్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే.. ఇలాంటి ప్రతీకార దాడులు పూర్తిస్థాయి యుద్ధంగా మారే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే.. దాయాది మీద తీసుకునే చర్యలపై చర్చించేందుకు మోడీ నేతృత్వంలో కీలక సమావేశం షురూ అయ్యింది.  

యూరీ ఘటనను కేంద్రం.. ఆర్మీ వర్గాలు తీవ్రంగా పరిగణించటమే కాదు.. పాక్ కు గట్టిగా బుద్ధి చెప్పేలా చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే.. ఆ దాడి ఎలా ఉండాలన్న అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు చెబుతున్నారు. పాక్ కు గట్టిగా బుద్ధి చెప్పేలా సరిహద్దులు దాటి ప్రతిదాడులు జరిపేందుకు అనుమతి ఇవ్వాలని కొందరు కోరుతుంటే.. మరికొందరు మాత్రం భారత్ సరిహద్దలు వెంట వైమానిక దాడులు చేయాలన్న ఆలోచనను వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. 778 కిలోమీటర్ల వాస్తవాధీన రేఖలో నిత్యం ఎక్కడో అక్కడ పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడటం.. కాల్పులకు తెగబడుతున్న నేపథ్యంలో.. ఆ దేశానికి బుద్ధి వచ్చేలా ఏదో ఒకటి చేయాలన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. భారత వైమానిక దళాన్ని ఫుల్ అలెర్ట్ గా ఉండాలన్న ఆదేశాలు అందినట్లుగా చెబుతున్నారు. ఎలాంటి పరిస్థితులకైనా సిద్ధమన్నట్లుగా వైమానికదళం సిద్ధంగా ఉండాలని  చెప్పినట్లుగా తెలుస్తోంది. మరోవైపు.. సరిహద్దులు దాటకుండానే పాక్ కు బుద్ధి చెప్పాలన్న వాదనను కూడా తెరపైకి తీసుకొచ్చినట్లుగా చెబుతున్నారు. అదే సమయంలో అంతర్జాతీయ వేదికల మీద పాక్ దుర్మార్గాన్ని ఎండగట్టటాన్ని తీవ్రతరం చేయాలన్న మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. గత ప్రభుత్వాల కంటే తమ ప్రభుత్వం పాక్ వైఖరిని తీవ్రంగా ఖండించే కన్నా.. చేతల్లో చేసి చూపిస్తే ఎలా ఉంటుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. గతంలో దేశానికి ప్రధానిగా వ్యవహరించిన వారి కంటే భిన్నంగా పాక్ పై ప్రధాని మోడీ తీరు ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News