`వందే భార‌త్‌`పై కేసీఆర్ మ‌న‌సులో మాట‌.. ప్ర‌స్తుతం ఇదే ట్రెండ్‌!!

Update: 2023-04-09 05:00 GMT
తాజాగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ హైద‌రాబాద్ వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న సికింద్రాబాదు-తిరుప‌తి మ‌ధ్య వందే భార‌త్ రైలును ప్రారంభించారు. అయితే. ఈ కార్య‌క్ర‌మానికి సీఎం కేసీఆర్ రాలేదు. దీంతో `వందే భార‌త్‌`పై కేసీఆర్ మ‌నసులో ఏముంది? అనే విష‌యం ఆసక్తిగా మారింది. ప్ర‌ధాని మోడీపై కోపంతోనే కాకుండా.. వందే భార‌త్ ప్రారంభానికి పెద్ద‌గా ఆయ‌న ఇంపార్టెన్స్ ఇవ్వ‌లేద‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో  కేసీఆర్ కు సంబంధించిన‌ పాత వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. ఈ వీడియో  పెద్ద ఎత్తున ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. మ‌రి కేసీఆర్ ఏమ‌న్నారు? ఆయ‌న మ‌న‌సులో ఏముంది? అంటే..

దేశంలో రైల్వే వ్యవస్థ ఎలా ఉంది..? అనే విష‌యంపై అసెంబ్లీ వేదికగా కేసీఆర్.. కొన్నాళ్ల కింద‌ట చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా వందేభారత్ గురించి కూడా మాట్లాడారు. ‘అధ్యక్షా.. చెప్పుకుంటే సిగ్గుపోతది.. ఒకటే ఒక వందేభారత్ రైలు పెట్టారు(మోడీ).. అంతకుముందు శతాబ్ది, రాజధాని అని చాలా ఎక్స్‌ప్రెస్‌లు వచ్చాయి. ఎప్పుడూ, ఎక్కడా ప్రధాన మంత్రులు రైళ్లను ప్రారంభించ లేదు.. ఏదైనా ఒకట్రెండు సందర్భాల్లో తప్ప.. పనిగట్టుకుని వచ్చి మాత్రం చేయరు. ఒక్క వందేభారత్‌ రైలు అని పెడితే.. దానికి బర్రె గుద్దినప్పుడల్లా పచ్చడి, పచ్చడి అవుతోంది. అదేం ఖర్మో తెలియట్లేదు`` అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

``బర్రెలకు-వందే భార‌త్‌కు మ‌ధ్య సంబంధం ఏమో కూడా  అర్థం కావట్లేదు. ఇలా ఎందుకు జరుగుతోందో కూడా ఎవరికీ తెలియదు. ఆ గొప్పతనానికి ఎన్నిసార్లు ప్రధాని వందేభారత్ రైళ్లను ప్రారంభిస్తారు..?. నేను లెక్క కడుతూనే ఉన్నా ఇప్పటికే 14 సార్లు మోడీ ప్రారంభించారు. ఇంతకన్నా ఘోరం, అన్యాయం ఎక్కడైనా ఉంటుందా..?. ఉండేది ఒకే ఒక్క రైలు పెద్ద గొప్పగా ఏమీ లేదు..  ఇందులో కొత్త కథేం లేదు. దీనికే 14 సార్లు చేసి..  మళ్లీ హైదరాబాద్‌కు వచ్చి ప్రారంభిస్తాం అంటున్నారు`` అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్ర‌స్తుతం వందే భార‌త్ ప్రారంభించిన వేళ‌.. కేసీఆర్ చేసిన ప్ర‌సంగం.. న‌వ్వులు పూయిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News