పదవులు కాదు ప్రజల సంక్షేమం ముఖ్యం : ప్రధాని మోదీ

Update: 2021-10-02 12:30 GMT
ప్రపంచం దృష్టిలో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి కావడం చాలా పెద్ద విషయం కావచ్చు. కానీ తన దృష్టిలో ప్రజా సేవ కోసం ఏదైనా చేయడానికి మార్గాలను అన్వేషించడమే కీలకం అని మోదీ పేర్కొన్నారు. ప్రజలకు ఉపయోగపడే మార్గాలను అన్వేషించడం.. వారికి అవసరమైన కార్యక్రమాలు చేపట్టడం తనకు ముఖ్యమని , దీంతోపాటు ప్రతి యువకుడు అవకాశాలు పొందడం ముఖ్యమని , అయితే యువత వేరే వారిపై ఆధారపడకుండా . స్వయం శక్తితో తమ లక్ష్యాలను చేరే విధంగా సిద్ధం చేయడమే తమ లక్ష్యమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రెండు దశాబ్దాల ప్రజా ప్రస్థానం పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ తాజాగా ఓపెన్ మ్యాగజైన్‌ కు ఇచ్చిన ఇంటర్వూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ప్రధాని మోదీ 2001 అక్టోబర్ 7న గుజరాత్‌ ముఖ్యమంత్రి గా పదవీ బాధ్యతలు చేపట్టి 2014 వరకు కొనసాగారు. వరుసగా, మూడు సార్లు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన అనంతరం 2014లో ప్రధానమంత్రిగా భాద్యతలు చేపట్టి రెండోసారి కూడా మోదీ కొనసాగుతున్నారు. అయితే, 20 ఏళ్ల ప్రజా ప్రస్థానం గురించి మోడీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విస్తృతమైన ఇంటర్వ్యూలో ప్రధానమంత్రి గాంధీనగర్ నుంచి న్యూఢిల్లీకి తన ప్రయాణం, పరిపాలన సవాళ్లు, ప్రపంచం మొత్తం భారత్ వైపు దృష్టిసారించేలా చేయడంలో అతని పాత్ర, తదితర అంశాలపై ప్రధాని మోడీ మాట్లాడారు.

తనకు మొదట నుంచి రాజకీయ రంగంతో సంబంధం లేదని.. మోదీ పేర్కొన్నారు. తన ప్రపంచం మొత్తం భిన్నంగా ఉండేదని, చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక చింతనతో ఉండేవాడినని మోదీ తెలిపారు. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద ప్రతిపాదించిన ‘జన్ సేవా హి ప్రభు సేవా’ తన మార్గమని మోదీ స్పష్టంచేశారు. ఎల్లప్పుడూ తనకు అవే ప్రేరణ, మార్గదర్శకాలని మోదీ పేర్కొన్నారు. తాను ఏమి చేసినా అవే కారణమని, తిరుగులేని విధంగా తన జీవితాన్ని మలుపు తిప్పాయని పేర్కొన్నారు. రాజకీయాల విషయానికొస్తే తనకు రిమోట్ కనెక్షన్ కూడా లేదని,. చాలా కాలం తరువాత మారిన పరిస్థితులు, కొంతమంది స్నేహితుల ఒత్తిడి మేరకు తాను రాజకీయాల్లో చేరానంటూ పేర్కొన్నారు. అక్కడ కూడ తాను ప్రధానంగా సంస్థాగతంగా పని చేసేందుకు ఇష్టపడ్డానని తెలిపారు.

సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం, పరిపాలనకు నాయకత్వం వహించే విధంగా పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. 2001లో అదే జరిగిందని, ప్రతికూల పరిస్థితులు తనను ఉన్నతమైన ఆలోచనలకు పునాది వేశాయని తెలిపారు. ప్రజల ఇబ్బందులను దగ్గరగా చూశానని, ఇప్పటివరకు ఇంత ఎదిగినా తన జీవితంలో కొత్త మలుపు అంటే ఏమిటో ఆలోచించే సమయం కూడా లేకుండా పోయిందన్నారు. భారతదేశంలోని 130 కోట్ల మంది ప్రజలకు ఉన్నటువంటి సామర్థ్యాలు తనకు ఉన్నాయని భావిస్తున్నానని మోదీ పేర్కొన్నారు. తాను సాధించినది, ఎవరైనా సాధించగలరని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. తాను చేయగలిగింది.. ఎవరైనా చేయవచ్చని.. అదే మన సంకల్పమని పేర్కొన్నారు. దేశంలోని 130 కోట్ల మంది సమర్థులైనవారేనని మోదీ అభిప్రాయపడ్డారు. విపత్కర పరిస్థితుల్లో మానవజాతికి మన దేశం అందించగల సహకారం చాలా గొప్పదని మోదీ వ్యాఖ్యానించారు. తాను ఎక్కడ నుంచి ప్రారంభమై, ఎక్కడికి చేరుకున్నాను.. ఏం చేశాను.. వ్యక్తిగత అనుభవాలు ఏమిటి అన్న విషయాలను పెద్దగా పట్టించుకోనని,. చివరి నిమిషం వరకూ ప్రజా సేవ చేయడమే తన అభిమతమని వెల్లడించారు.

డిసెంబ‌ర్ చివ‌రి క‌ల్లా యావ‌త్ దేశాన్ని వ్యాక్సినేట్ చేయనున్నట్లు ప్రధాని మోదీ వివరించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఒక‌వేళ మ‌న దేశం వ్యాక్సిన్ త‌యారు చేయ‌కుంటే, అప్పుడు ప‌రిస్థితి ఎలా ఉండేదో అంచనా వేయాలన్నారు. ఇప్పటికీ, కోవిడ్ వ్యాక్సిన్ అంద‌ని దేశాలు ఉన్నాయ‌ని.. వాటి పరిస్థితి తలుచుకుంటే బాధేస్తుందన్నారు. మనం ముందుగానే వ్యాక్సిన్‌ను తయారు చేసుకున్నామని.. అదే మన ఘనతని ప్రధాని అభిప్రాయపడ్డారు. భార‌త్ ఆత్మనిర్భర్ కావ‌డం వ‌ల్లే వ్యాక్సినేష‌న్‌లో స‌క్సెస్ సాధించిన‌ట్లు ప్రధాని అభిప్రాయపడ్డారు. భారత్ పరిశోధనలకు పెద్ద పీట వేస్తుందని.. అన్ని రంగాలకు సమాన అవకాశాలను కల్పిస్తుందని మోదీ పేర్కొన్నారు. జై జ‌వాన్‌, జై కిసాన్‌, జై విజ్ఞాన్‌, జై అనుసంధాన్ మంత్రాన్ని జపిస్తూ తన పాలనలో మార్పులు తీసుకొచ్చినట్లు మోదీ పేర్కొన్నారు.

ప్రధాని మోదీ రైతు ఉద్యమం కూడా తొలిసారిగా స్పందించారు. రైతు అనుకూల సంస్కరణలను వ్యతిరేకిస్తున్నవారిని చూస్తే.. వారి మేధో సంపత్తికి ఏమైందోనని జాలేస్తుందన్నారు. వారు అనవసరమైన విషయాలను ఆలోచిస్తున్నారంటూ చురకలంటించారు. చిన్న రైతులను అన్ని విధాలుగా శక్తివంతం చేయడానికి తాము కట్టుబడి ఉన్నట్లు మోదీ పేర్కొన్నారు. వ్యవసాయ చట్టాల గురించి ఆందోళనకారులతో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. ఇదే విషయాన్ని మొదటి రోజు నుంచి చెతుతున్నట్లు మోదీ తెలిపారు.ప్రజా సంక్షేమానికి తీసుకొస్తున్న పథకాలు, ఇప్పటికే అమలు చేస్తున్న ప్రభుత్వ పాలనను తెలుపుతున్నాయన్నారు. దీంతోపాటు భద్రతా దళాలకు ఆయుధ సంపత్తిని సమకూర్చడం వంటివి ప్రభుత్వం తీసుకొచ్చిన కీలక మార్పు అని.. దేశ భద్రత మరింత ముఖ్యమని మోదీ స్పష్టంచేశారు. కొత్త పార్లమెంటు గురంచి పలు రాజకీయ పార్టీలు తమను అనవసంరగా ఎగతాళి చేస్తున్నాయంటూ విమర్శించారు.




Tags:    

Similar News