పొరుగుదేశాల్లో వివక్షకు గురయ్యే హిందువులకు భారత పౌరసత్వం

Update: 2019-12-06 16:37 GMT
పాకిస్తాన్ - బంగ్లాదేశ్ - అఫ్ఘానిస్తాన్‌ దేశాల్లో వివక్షకు గురైన హిందువులు భారత్‌పై నమ్మకంతో ఇక్కడకు వస్తే వారికి భారత పౌరసత్వం కల్పిస్తామని..  ఈ మేరకు పౌరసత్వ బిల్లులో సవరణ తీసుకొస్తున్నామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. తమతమ దేశాల్లో వివక్షకు గురవుతున్న హిందువులకు భారత పౌరసత్వం భరోసా ఇస్తుందన్నారాయన.

హిందుస్తాన్‌ టైమ్స్ లీడర్‌ షిప్ సమ్మిట్‌ లో పాల్గొన్న ప్రధాని మోదీ.. వచ్చవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న ఈ బిల్లుపై మాట్లాడారు. పొరుగు దేశాల్లో మతపరమైన వివక్షను ఎదుర్కొని భరతమాతపై నమ్మకం ఉంచి ఇక్కడకు చేరుకున్నవారికి పౌరసత్వం ఇస్తామని.. అలాంటివారు ఎవరున్నా సరే భారత పౌరసత్వం కల్పించి వారికి అద్భుతమైన భవిష్యత్తును అందిస్తామని చెప్పారాయన. అయోధ్య తీర్పుతో దేశవ్యాప్తంగా అలజడిలు ఆందోళనలు - అల్లర్లు జరుగుతాయని అంతా భావించారని కానీ భారతదేశ ప్రజలు అవన్నీ తప్పని రుజువు చేశారని మోడీ చెప్పారు.

మరోవైపు జమ్మూ కశ్మీర్‌‌ లో ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని కూడా ప్రధాని సమర్థించుకున్నారు. రాజకీయంగా ఇది కష్టమైన నిర్ణయమే అయినా కశ్మీర్ ప్రజల భవిష్యత్తు మెరుగుపర్చడానికి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు చేయడంతోనే జమ్మూ కశ్మీర్ ఇప్పుడు ప్రగతి బాట పట్టబోతోందని చెప్పారు. ప్రజల జీవితాలపై ప్రభుత్వం అజమాయిషీ ఉండటాన్ని తానెప్పుడూ సమర్థించలేదని మోడీ చెప్పారు. అందుకే మినిమమ్ గవర్నమెంట్ మ్యాక్సిమమ్ గవర్నెన్స్‌ అనేదానికే ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు. బ్యాంకుల విలీనంపై కూడా ప్రధాని మోడీ మాట్లాడారు. బ్యాంకర్లు ఎలాంటి భయం లేకుండా తమ పని తాము చేసుకోవచ్చని భరోసా ఇచ్చారు.

   

Tags:    

Similar News