కరోనా గట్టిదే...మన పోరాటం ఇంకా గట్టిది

Update: 2020-03-15 16:32 GMT
కరోనా వైరస్ (కోవిడ్ 19)పై పోరాడేందుకు ఉమ్మడి వ్యూహం రూపొందించేందుకు సార్క్ కూటమి దేశాధినేతలు ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కరోనా నియంత్రణపై సభ్య దేశాలతో చర్చించారు. ఉమ్మడిగా పోరాడుదామని పిలుపునిచ్చారు. దక్షిణాసియాలో కరోనా కేసుల సంఖ్య 150 కంటే తక్కువే అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాలన్నారు. నియంత్రణ చర్యలు చేపట్టాలని - అలాంటి సమయంలో కరోనాపై పెద్దగా ఆందోళన అవసరం లేదన్నారు.

జనవరి నుండి విదేశాల నుండి భారత్‌ కు వచ్చిన వారిని స్క్రీనింగ్ చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం ప్రయాణాలపై ఆంక్షలు విధించామని - వివిధ దేశాల్లోని 1,400 మంది భారతీయులను వెనక్కి తీసుకు వచ్చి వారిని ఐజోలేషన్‌ లో ఉంచి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. భారతీయులనే కాకుండా సరిహద్దు దేశాల పౌరులను కూడా తాము తీసుకు వచ్చామన్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే చాలునని చెప్పారు.

ఇండియాలో పెద్ద ఎత్తున కరోనాపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. డయాగ్నస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేశామని - ఎంట్రీ పాయింట్ల వద్ద స్క్రీనింగ్ - క్వారంటైన్ - క్లియరింగ్ కేసుల్లో రోగుల డిశ్చార్జ్ వంటి వివిధ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కరోనాను నివారించేందుకు అత్యవసర నిధిని ఏర్పాటు చేయాలని, ఇందుకు భారత్ 10 మిలియన్ల అమెరికా డాలర్లను నిధిని సమకూర్చేందుకు ముందుకు వస్తున్నట్లు తెలిపారు.

ఏ దేశంలో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటే ఆ దేశానికి సాయం చేసేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. కరోనా నిర్మూలనకు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ సైన్సెస్ పని చేస్తోందని చెప్పారు. ఇతర దేశాలు - సంస్థలు కూడా సాయం చేయాలన్నారు. ఉమ్మడిగా కరోనాపై పోరాడి ప్రపంచ దేశాలకు మోడల్‌గా నిలుద్దామన్నారు. దేనికైనా సిద్ధంగా ఉండాలని, కానీ భయపడవద్దని ఇదే మంత్రమన్నారు.

అంతకుముందు - కరోనాపై పోరాడేందుకు సార్క్ దేశాలు ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించాలని మోడీ చేసిన ప్రతిపాదనపై పాకిస్తాన్ సానుకూలంగా స్పందించింది. వివిధ దేశాధినేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలన్న మోడీ ప్రతిపాదనకు ఓకే చెప్పింది. కాన్ఫరెన్స్‌ లో పాల్గొనేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. మోడీ ప్రతిపాదనను కూటమిలోని అన్ని దేశాలు స్వాగతించాయి. దీంతో ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సార్క్‌ లో భారత్ - పాకిస్తాన్ - ఆప్ఘనిస్తాన్ - బంగ్లాదేశ్ - భూటాన్ - మాల్దీవులు - శ్రీలంక - నేపాల్ సభ్యదేశాలు.


Tags:    

Similar News