ప్రేమ‌తోనే క‌శ్మీర్ స‌మ‌స్య ప‌రిష్కారం: మోదీ

Update: 2017-08-15 10:28 GMT
దేశంలో 71 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. దీనిని పుర‌స్క‌రించుకుని ఢిల్లీలోని ఎర్ర‌కోట‌పై ప‌తాకావిష్క‌ర‌ణ చేసిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ.. జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ఆయ‌న మాట్ల‌లో కొన్ని తూటాలు ఎగిరి ప‌డ‌గా.. మ‌రికొన్ని కుసుమాలు విక‌సించాయి. ముఖ్యంగా ఆయ‌న ఇటీవ‌ల దేశాన్ని క‌దిపేస్తున్న అనేక స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించారు. ఉగ్ర‌వాదం, జ‌మ్ముక‌శ్మీర్ వేర్పాటు వాదం - ట్రిపుల్ త‌లాక్‌ - ఐక‌మ‌త్యం - గోవ‌ధ నిషేధం పేరుతో జరుగుతున్న అకృత్యాలు వంటి ప‌లు అంశాల‌ను స్పృశించారు.

ప్ర‌తి విష‌యంపైనా ప్ర‌ధాని చాలా క్లారిటీగా మాట్లాడారు. జ‌మ్ము క‌శ్మీర్ స‌మ‌స్య తూటాల‌తోనూ రాళ్ల‌తోనూ ప‌రిష్కారం కాద‌ని నొక్కి చెప్పిన మోదీ..  ప్రాంతాల మ‌ధ్య‌, ప్ర‌జ‌ల మ‌ధ్య ప్రేమ‌తోనే క‌శ్మీర్ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం క‌నుకొన‌గ‌లం  అని ఉద్ఘాటించారు. అదేస‌మ‌యంలో ఉగ్ర‌వాదాన్ని స‌హించే ప్ర‌స‌క్తే లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఉగ్ర‌మూక‌ల‌ను కూక‌టి వేళ్ల‌తో పెక‌లించే వ‌ర‌కు నిద్ర‌పోమ‌ని శ‌ప‌థం చేశారు.  విధంసం ఏరూపంలో జ‌రిగినా ఖండించాల్సిందేన‌ని చెప్పారు.

ఇదే స‌మ‌యంలో మోదీ.. నాలుగు రోజుల కింద‌ట ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని గోర‌ఖ్‌పూర్ ఆస్ప‌త్రిలో ఆక్సిజ‌న్ అంద‌క మృతి చెందిన చిన్నారుల‌ను సైతం త‌లుచుకున్నారు. అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో పోటెత్తిన వ‌ర‌ద‌ల గురించి, అక్క‌డి బాధితుల స‌మ‌స్య‌ల గురించి కూడా ప్ర‌స్తావించారు.   ప్ర‌కృతి వైప‌రీత్యాలు సంభ‌వించిన‌ప్పుడు దేశ ప్ర‌జ‌లు ఒక‌రికొక‌రు భుజం భుజం రాసుకుంటూ సాయం చేసుకోవాల‌ని మోదీ పిలుపునిచ్చారు.

ఎర్ర‌కోట నుంచి దాదాపు గంట‌కు పైగా మాట్లాడిన ప్ర‌ధాని మోదీ.. వ‌ర్త‌మాన అంశాల‌ను పెద్ద‌గా వివ‌రించారు. ప్ర‌భుత్వం వివిధ వ‌ర్గాల‌కు చేప‌డుతున్న అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను పేర్కొన్నారు. అవినీతి ర‌హిత దేశం దిశ‌గా ప్ర‌తి ఒక్క‌రూ న‌డ‌వాల‌ని, దేశాన్ని ఆవిధంగా న‌డ‌పాల‌ని పిలుపునిచ్చారు. మొత్తానికి ఎర్ర‌కోట నుంచి మోదీ ప్ర‌సంగించ‌డం ఇది నాలుగో సారి అయిన‌ప్ప‌టికీ ప‌లు విభిన్న అంశాల‌ను ఆయ‌న వివ‌రించిన తీరు అంద‌రినీ ఆక‌ట్టు కుంది.

ముఖ్యంగా ముస్లిం మ‌హిళ‌లు ఎదుర్కొంటున్న ట్రిపుల్ త‌లాక్ విష‌యంలో త‌మ ప్ర‌భుత్వం ఇత‌మిత్థంగా ఓ నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి ఉంద‌ని, మ‌హిళ‌ల‌ను న‌డిరోడ్డుకు ఈడ్చిపారేయ‌డాన్ని తాము స‌హించ‌లేమ‌ని అన్నారు. మ‌హిళ‌లు ఎక్క‌డ ఉన్న గౌర‌వంగా ఉండాల‌ని కోరుకుంటున్న‌ట్టు చెప్పారు.  గో సంర‌క్ష‌ణ‌పేరుతో దేశంలో జ‌రుగుతున్న హ‌త్య‌ల‌ను ప్ర‌ధాని తీవ్రంగా ఖండించారు. హింస ఏ రూపంలో ఉన్నా అణిచి వేస్తామ‌ని ఉద్ఘాటించారు. మొత్తానికి మోదీ ప్ర‌సంగం ఆసాంతం ఉగాది ప‌చ్చ‌డిని త‌ల‌పించింది.
Tags:    

Similar News