మోడీ స‌ర్కారు ప్ర‌క‌ట‌న‌ల ఖ‌ర్చు లెక్క చెప్పిన మాయా!

Update: 2019-03-16 10:52 GMT
రాష్ట్రాల మీద పెత్త‌నం చేసే కేంద్రం పెద్ద‌న్న‌లా వ్య‌వ‌హ‌రిస్తుంద‌న్న‌ది తెలిసిందే. మ‌రి.. పెద్ద‌న్న హోదాలో ఉన్న‌ప్పుడు నిధులు కేటాయించే విష‌యంలో కాస్త పెద్ద మ‌న‌సుతో వ్య‌వ‌హ‌రించ‌టం అవ‌స‌రం. ప‌న్నుల రూపంలో రాష్ట్రాల నుంచి వ‌సూలు చేసే మొత్తాన్ని.. దేశం మొత్తానికి పంచ‌టం.. కేంద్ర పాల‌న కోసం ఖ‌ర్చు చేయ‌టం తెలిసిందే. ఇప్పుడు అమ‌ల‌వుతున్న తీరు ఏ మాత్రం స‌రిగా లేదంటూ కేసీఆర్ లాంటి ముఖ్య‌మంత్రులు కేంద్రం తీరుపై నిప్పులు చెర‌గ‌టం మామూలే.

ఇదిలా ఉంటే.. తాజాగా మోడీ స‌ర్కారు ఖ‌ర్చు చేసిన ప్ర‌క‌ట‌న‌ల లెక్క‌ను విప్పి చెప్పారు బీఎస్పీ అధినేత్రి మాయావ‌తి. ప్ర‌కృతి విప‌త్తుల కోసం.. అనుకోని ఉత్పాతాలు సంభ‌వించిన‌ప్పుడు సాయం కోసం కేంద్రం వైపు చూసే రాష్ట్రాల‌కు పైస‌లు ఇచ్చే విష‌యంలో పినాసిత‌నంతో వ్య‌వ‌హ‌రిస్తుంద‌న్న పేరున్న మోడీ స‌ర్కారు.. త‌న ఇమేజ్ ను పెంచుకోవ‌టానికి చేసిన ఖ‌ర్చు భారీగా ఉండ‌టం గ‌మ‌నార్హం.

తాజాగా బీఎస్పీ అధినేత్రి మాయావ‌తి మాట్లాడుతూ..  ప్ర‌క‌ట‌న‌ల కోసం వేలాది కోట్ల ప్ర‌జాధ‌నాన్ని మోడీ ఖ‌ర్చు చేసిన‌ట్లుగా మండిప‌డ్డారు. శంకుస్థాప‌న‌ల‌తో బిజీబిజీగా క‌నిపించే ప్ర‌ధాని మోడీ ప్ర‌క‌ట‌న‌ల కోసం ఏకంగా రూ.3044 కోట్ల‌ను ఖ‌ర్చు చేసిన‌ట్లు ఆమె చెప్పారు.

యూపీలాంటి వెనుక‌బ‌డి రాష్ట్రంలోని ప్ర‌తి గ్రామంలోనూ ఇదే మొత్తంతో వైద్య‌.. విద్య స‌దుపాయాల్ని అదించేందుకు ఖ‌ర్చు చేయొచ్చ‌న్నారు. అయితే.. ఇవేమీ బీజేపీ స‌ర్కారుకు ప‌ట్ట‌వ‌ని.. ప్ర‌జాధ‌నాన్ని ప్ర‌క‌ట‌న‌ల కోసం ఖ‌ర్చు చేయ‌ట‌మే మోడీ స‌ర్కారు మొగ్గు చూపింద‌న్నారు. మోడీ స‌ర్కారుకు కావాల్సింది ప్ర‌చార‌మే త‌ప్పించి ప్రజా సంక్షేమం కాద‌ని మండిప‌డ్డారు.

త‌న వైఫ‌ల్యాల్ని క‌ప్పిపుచ్చుకోవ‌టానికి కేంద్రం ప్ర‌య‌త్నిస్తుంద‌ని.. కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ ప్ర‌జాస‌మ‌స్య‌ల మీద చ‌ర్చ జ‌ర‌గ‌కుండా ప్ర‌జ‌ల దృష్టిని మ‌ర‌ల్చ‌టానికి ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు ఆరోపించారు. బీజేపీని ఓడించేందుకు వీలుగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో బ‌లమైన ఎస్పీతో బీఎస్పీ పొత్తు పెట్టుకొని ఎన్నిక‌ల బ‌రిలో నిలిచింది. దేశంలో అత్య‌ధిక ఎంపీ స్థానాలున్న యూపీలో మ్యాగ్జిమ‌మ్ సీట్ల‌ను త‌మ కూట‌మి సొంతం చేసుకోవాల‌న్న ఆలోచ‌న‌లో ఎస్పీ.. బీఎస్పీ ఉన్నాయి. మ‌రి.. వారి వ్యూహం ఎంత‌వ‌ర‌కు వ‌ర్క్ వుట్ అవుతుందో చూడాలి.

తాజాగా మాయా చెప్పిన మోడీ స‌ర్కారు ప్ర‌క‌ట‌న‌ల ఖ‌ర్చు చూస్తే.. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి కోసం కేంద్రం ఇచ్చింది రూ.2500 కోట్లే. ఒక రాష్ట్ర రాజ‌ధాని కోసం కేంద్రం కేటాయించిన మొత్తం కంటే కూడా త‌న ఇమేజ్ ను పెంచుకోవ‌టానికి ప్ర‌క‌ట‌న‌ల కోసం పెట్టిన ఖ‌ర్చు అధికంగా ఉండ‌టం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News