మ‌న్మోహ‌న్ పై మోడీ భారీ 'బాంబ్‌'!

Update: 2018-07-04 04:59 GMT
ప్ర‌ధాని మోడీ నోట బాంబు లాంటి మాట బ‌య‌ట‌కు వ‌చ్చింది. నాలుగేళ్లుగా దేశ ఆర్ధిక ప‌రిస్థితి మీద పెద‌వి విప్ప‌ని ఆయ‌న‌.. తాజాగా యూపీఏ స‌ర్కారుపై భారీ ఆరోప‌ణే చేశారు. ఆర్థిక నిపుణుడైన వ్య‌క్తి ప్ర‌ధానిగా ఉన్న‌ప్పుడు దేశ ఆర్థిక ప‌రిస్థితి మెరుగ్గా ఉంటుంద‌ని భావిస్తామ‌ని..కానీ తాను ప్ర‌ధాని కుర్చీలో కూర్చునే స‌మ‌యానికి దేశ ఆర్థిక ప‌రిస్థితి దారుణంగా ఉంద‌న్న మాట‌ను చెప్పారు.

అలాంటివేళ‌.. ఉన్న‌ది ఉన్న‌ట్లుగా చెప్పి ఉంటే దేశంలో ప‌రిస్థితులు మ‌రోలా ఉండేవ‌న్న మాట‌ను ఆయ‌న చెప్పారు. ఆర్థిక ప‌రిస్థితిపై రాజ‌కీయాలు చేయ‌టం సుల‌భ‌మ‌ని.. నిజంగా ల‌బ్థి పొందాల‌న్న‌దే ల‌క్ష్య‌మై ఉంటే.. ఆ రోజునే కాంగ్రెస్ పూర్తిస్థాయిలో చిక్కుల్లో ప‌డేద‌న్నారు.

కానీ.. తాము ఆ ప‌ని చేయ‌లేద‌ని.. దేశానికి న‌స్టం జ‌ర‌గ‌నివ్వ‌కూడ‌ద‌ని భావించిన‌ట్లుగా చెప్పారు. తాము అధికారంలోకి వ‌చ్చిన‌ప్పుడు ఆర్థిక వ్య‌వ‌స్థ ఊహించిన దాని కంటే దారుణంగా ఉంద‌న్న మాట‌ను తాజాగా చెప్పారు. ఒక మీడియా సంస్థ‌కు ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో బాంబు లాంటి మాట‌ను ప్ర‌ధాని మోడీ చెప్ప‌టం గ‌మ‌నార్హం.

మోడీ గ్రాఫ్ అంత‌కంత‌కూ ప‌డిపోతుంద‌న్న మాట బ‌లంగా వినిపిస్తున్న వేళ‌.. విపక్షాల‌న్నీ మోడీకి వ్య‌తిరేకంగా జ‌ట్టు క‌డ‌దామ‌న్న ప్ర‌చారం జోరుగా సాగుతున్న‌వేళ‌.. మ‌న్మోహ‌న్ స‌ర్కారుపై మోడీ తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌టం విశేషం.  రాజ‌కీయంగా త‌న‌పై ఎన్ని విమ‌ర్శ‌లు చేసినా భ‌రించామే కానీ దేశానికి న‌ష్టం వాటిల్ల‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ట్లు చెప్పారు.

తాము ప‌వ‌ర్లోకి వ‌చ్చిన‌ప్పుడు దేశ ఆర్థిక ప‌రిస్థితి దారుణంగా ఉంద‌ని..ఆ  స‌మ‌యంలో త‌మ ముందు రెండు మార్గాలున్నాయ‌న్న మోడీ.. ఒక‌టి ఉన్న ప‌రిస్థితి ఉన్న‌ట్లుగా ప్ర‌జ‌ల‌కు శ్వేత‌ప‌త్రం ద్వారా చెప్ప‌టం.. రెండోది దెబ్బ తిన్న భార‌త ఆర్థిక ప‌రిస్థితిని గుట్టుగా బాగుచేయ‌టం. మొద‌టి విధానంలో రాజ‌కీయ ల‌బ్థికి పూర్తి అవ‌కాశం ఉంద‌ని.. రెండో విధానంలో మాత్రం అలాంటిది లేద‌ని.. అయిన‌ప్ప‌టికీ తాము రెండో విధానాన్నే ఎంచుకున్నామ‌న్నారు.

ఆర్థిక వేత్త అయిన ప్ర‌ధాని.. ఆర్థిక నైపుణ్యం ఉన్న ఆర్థిక మంత్రి హ‌యాంలో దేశం సంక్షోభంలో నిల‌బ‌డింది. ఆ గ‌ణాంకాల్ని చూసి తాము నిర్ఘాంత‌పోయిన‌ట్లుగా మోడీ పేర్కొన్నారు. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ఉన్న అంకెల్ని చూసి.. వాటిని స‌రి చేసేందుకు ప్ర‌య‌త్నించామ‌న్నారు. వివిధ రంగాల్లో కాంగ్రెస్ మందుపాత‌ర‌ల్ని ఉంచింద‌ని.. 2014లో ప‌రిశ్ర‌మ‌లు దేశం విడిచి వెళ్లిపోవటానికి రెడీ అయినట్లు చెప్పారు. అలాంటివేళ‌లో తాము దేశ ఆర్థిక ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దిన‌ట్లుగా చెప్పారు.

బ్రిక్స్ కూట‌మిలో ఇండియా కుప్ప‌కూలుతుంద‌ని నిపుణులు అంచ‌నా వేశార‌ని.. అలాంటి ప‌రిస్థితుల్లో దేశ ఆర్థిక ప‌రిస్థితిపై తాము కానీ శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేసి ఉంటే.. ఏం జ‌రిగేదో ఆలోచించాల‌న్న మోడీ.. సంక్షోభం మ‌రింత తీవ్ర‌మ‌య్యేద‌న్నారు. అలాంటి వేళ అధికారాన్ని చేప‌ట్టిన మొద‌టిరోజు నుంచి ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను సంస్క‌రించి.. బ‌లోపేతం చేసి.. దానిలో ప‌రివ‌ర్త‌న వ‌చ్చేలా చేశామ‌న్నారు. ఇప్పుడు భార‌త్ ప్ర‌పంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒక‌టిగా ఆయ‌న అభివ‌ర్ణించారు. విదేశీ పెట్టుబ‌డులు ఇప్పుడే అత్య‌ధిక‌మ‌ని పేర్కొన్నారు. గ‌తంతో పోలిస్తే ఇప్పుడే వ్యాపారాలు చేసుకోవ‌టానికి భార‌త్ సానుకూల దేశంగా అభివ‌ర్ణించారు. తొలిసారి మ‌న్మోహ‌న్ పాల‌న‌లో దేశ ఆర్థిక ప‌రిస్థితి దారుణ స్థితికి చేరుకున్న షాకింగ్ మాట‌ను రివీల్ చేసిన మోడీ మాట‌పై కాంగ్రెస్ వ‌ర్గాలు ఎలా రియాక్ట్ అవుతాయ‌న్న‌ది ప్ర‌శ్న‌గా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News