బాబా గ్యాంగ్‌ కు మోదీ వార్నింగ్ అదిరిందిగా!

Update: 2017-08-27 10:18 GMT
డేరా స‌చ్చ సౌద భ‌క్తులు హ‌రియాణాలో సృష్టించిన మార‌ణ హోమం దేశాన్ని కుదిపేసింది. ఆధ్యాత్మిక గురువుగా త‌న‌ను తాను ప‌రిచ‌యం చేసుకుని 2002లో త‌న ఆశ్ర‌మంలో స‌న్యాసినుల‌పై అత్యాచారానికి ఒడిగ‌ట్టిన కేసులో సౌద అధిప‌తి రాం ర‌హీం సింగ్‌ను సీబీఐ కోర్టు దోషిగా నిర్ధారించ‌డంతో ఆయ‌న భ‌క్తుల ముసుగులో కొంద‌రు అరాచ‌క‌వాదులు రెచ్చిపోయారు. హ‌రియాణా - పంజాబ్‌ ల‌లో మార‌ణ హోమం సృష్టించారు. దీంతో దాదాపు 30 మంది అమాయ‌కులు మృతి చెందారు. అనేక ప్ర‌భుత్వ - ప్రైవేటు ఆస్తులు త‌గ‌ల‌బ‌డిపోయాయి.

ఇక‌, ఈ ఘ‌ట‌న‌పై హైకోర్టు తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ప్ర‌ధానిని కేంద్రంగా చేసుకుని హైకోర్టు చేసిన హాట్ కామెంట్లు మేధావుల‌ను సైతం క‌దిలించాయి. ఆయ‌న హ‌రియాణాకు ప్ర‌ధాని కాదా?  ఈ రాష్ట్రం దేశంలో భాగం కాదా? ఇక్క‌డ ఇంత అరాచ‌కం రాజ్య‌మేలుతుంటే ఏం చేస్తున్నారు? అంటూ నిల‌దీసింది. దీంతో దేశం మొత్తం నివ్వెర‌పోయింది. ఇక‌, దీనిపై కాస్త ఆల‌స్యంగా స్పందించిన ప్ర‌ధాని ఆదివారం నాటి త‌న కార్య‌క్ర‌మం మ‌న్‌ కీ బాత్‌(మ‌న‌సులో మాట‌)ను వేదిక‌గా చేసుకున్నారు. అరాచ‌క శ‌క్తుల‌కు గ‌ట్టి వార్నింగ్ ఇచ్చారు.

విశ్వాసం పేరిట హింసకు దిగుతామంటే ఎంత మాత్రం సహించబోమని ప్ర‌ధాని స్పష్టం చేశారు. వర్గ - రాజకీయ - వ్యక్తిగత విశ్వాసాల ఆధారంగా దాడులకు దిగుతామంటే అంగీకరించబోమన్నారు. 'చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకున్నా.. హింసకు ఎవరు పాల్పడినా.. ఎంతటివారినైనా వదిలిపెట్టబోం' అని మోదీ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. పండుగ సమయంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం ప్రజల్లో ఆందోళన రేకెత్తించిందన్నారు.  ఎవ‌రు ఏ రేంజ్‌లో ఉన్నా  క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌న్నారు. అయితే, గ‌తంలోనూ మోదీ .. గో సంర‌క్ష‌ణ పేరుతో హింస‌కు దిగిన వారిని కూడా ఇలానే హెచ్చ‌రించినా.. ఎక్క‌డాఅలాంటి హ‌త్య‌లు, దారుణాలకు అడ్డుక‌ట్ట ప‌డ‌లేదు.

మ‌రి ఇప్పుడైనా ఆయ‌న హెచ్చ‌రిక‌లు ఎంత వ‌ర‌కు వ‌ర్క‌వుట్ అవుతాయో చూడాలి. ఇక్క‌డే మ‌రో ప్ర‌ధాన విమ‌ర్శ కూడా ప్ర‌ధానిని చుట్టుముట్టింది. చేతులు కాలిపోయాక ఇలాంటి ప్ర‌క‌ట‌న‌లు చేసి ఏం లాభం అని ప‌లువురు ప్ర‌జాస్వామ్య వాదులు ప్ర‌శ్నిస్తున్నారు. హ‌రియాణాలో ప‌రిస్థితులు ఇప్ప‌టికీ చ‌క్క‌బ‌డ‌లేద‌ని వారు అంటున్నారు. కానీ, రేడియో ప్ర‌సంగాల‌తో ప్ర‌ధాని స‌రిపెట్ట‌డం ఏంట‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.
Tags:    

Similar News