కౌగిలింత‌తో మోడీ మ‌ళ్లీ అదే పని చేశాడు

Update: 2018-02-28 13:51 GMT

ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యహూ గతవారం భారత పర్యటనకు  వచ్చిన నేపథ్యంలో నెతన్యహూను ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ కౌగిలించుకోవ‌డం...ఈ సందర్భంలో ప్రధాని మోడీ మీద కాంగ్రెస్ ఓ ఫన్నీ వీడియోను తయారు చేసి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయ‌డం..ఆ వీడియోకు హగ్‌ ప్లోమసీ అనే టాగ్‌ ను కూడా యాడ్ చేయ‌డం..దీనిపై అధికార బీజేపీ మండిప‌డ‌టం..గుర్తుండే ఉంటుంది. తాజాగా ప్ర‌ధాని నరేంద్ర మోడీ మ‌రోమ‌రు త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారు. ఇంకా చెప్పాలంటే త‌న విమ‌ర్శ‌కుల‌కు అవ‌కాశం ఇచ్చారు. మ‌రోమారు  ప్రొటోకాల్‌ ను పక్కనపెట్టి ఓ ప్ర‌ముఖుడిని కౌగిలించుకోవ‌డం ద్వారా ఆ ప‌నిచేశారు. ఇంత‌కీ ఆ కౌగిలించుకోబ‌డిన ప్ర‌ముఖుడు ఎవ‌రంటే...జోర్డాన్ రాజు అబ్దుల్లా బిన్ అల్ హుస్సేన్‌.

అబ్దుల్లా మూడు రోజుల పాటు ఇండియాలో పర్యటించనున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌కు స్వాగతం పలకడానికి స్వయంగా ఎయిర్‌ పోర్ట్‌కు వెళ్లారు. ఆయనను ఆలింగనం చేసుకొని వెల్‌ కమ్ చెప్పారు. ఇదేదో అంచ‌నాకాదు విదేశాంగ శాఖ కూడా మోడీ ప్రొటోకాల్‌ ను పక్కన పెట్టి జోర్డాన్ రాజుకు స్వాగతం పలికారని ట్వీట్ చేసింది. 2006లో తొలిసారి ఇండియాకు వచ్చిన అబ్దుల్లా.. ఇప్పుడు రెండోసారి భారత పర్యటనకు వచ్చారు. గురువారం ప్రధాని మోడీ తో అబ్దుల్లా సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య కొన్ని ఒప్పందాలు కుదరనున్నాయి. రాష్ట్రపతి రామ్‌ నాథ్ కోవింద్.. అబ్దుల్లా గౌరవార్థం విందు ఏర్పాటు చేయనున్నారు. జోర్డాన్‌ తో భారత్‌ కు బలమైన బంధం ఉంది. 2016-17 సంవత్సరం.. రెండు దేశాల మధ్య 135 కోట్ల డాలర్ల వాణిజ్యం జరిగింది. ఈ నెల మొదట్లో మోడీ కూడా జోర్డాన్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.

కాగా, ప్ర‌ధాని మోడీ కౌగిలింత‌ల వీడియోను రూపొందించి...దానికి‘హగ్ హైలైట్స్’ అంటూ విడుదల చేసిన కాంగ్రెస్ ఈ వీడియోలో వివిధ దేశాలకు చెందిన నాయకులను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న విధానాన్ని చూపించింది. టర్కీ ప్రధానితో ‘అద్భుత కౌగిలింత’ అని, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తో ‘మరింత వికృతం’ అని, హాలెండ్ మాజీ అధ్యక్షుడితో ‘టైటానిక్ కౌగిలింత’ అని, మెక్సికో అధ్యక్షుడితో ‘నన్ను ప్రేమించనీ’ అన్నట్టు ఉందని, జపాన్ ప్రధాని అబెను కౌగిలించుకుంటూ ‘నిన్ను ఎన్నటికి వెళ్లనివ్వను’ అన్నట్టు ఉందని ఆ వీడియోలో పేర్కొంది. గ‌త నెల‌లో విడుద‌ల చేసిన ఈ వీడియో ఆధారంగా కాంగ్రెస్ విరుచుకుప‌డిన‌ప్ప‌టికీ...మోడీ  త‌న ట్రెండ్ మార్చుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News