రాజీవ్‌ గాంధీని అంతమాట అంటారా?..తప్పుకదూ!

Update: 2019-05-09 07:57 GMT
ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల నోటికి బాగా పనిచెప్పినట్టే కనిపిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఈ ఐదేళ్లలో చేసింది చెప్పాల్సింది పోయి చీటికిమాటికీ ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. రాఫెల్ డీల్‌ విషయంలో మోదీకి చేయాల్సినంత నష్టం చేస్తున్న రాహుల్‌ ను మోదీ మాత్రం విడిచిపెడతారా? ఇటలీ అంటూ ఒకప్పటి రాగం అందుకుని ఎల్‌ టీటీఈ ఆత్మాహుతి దాడిలో అసువులు బాసిన ఆయన తండ్రి రాజీవ్ గాంధీని కూడా తన ప్రచారంలోకి లాక్కొచ్చారు. రాజీవ్ గాంధీ తన జీవితాన్ని నంబర్ వన్ అవినీతిపరుడిగా ముగించారంటూ తీవ్రస్థాయిలో ఆరోపించారు.

దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీని అంతమాట అంటారా? అంటూ కాంగ్రెస్ నేతలు అంతెత్తున విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేతలు అలా రియాక్టవడంలో ఎంతమాత్రమూ తప్పులేదు. అయితే, మోదీ వ్యాఖ్యలను స్వయంగా ఆ పార్టీ సీనియర్ నేత ఖండించడమే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను చర్చకు కారణమైంది. రాజీవ్‌ ను మోదీ అంత మాట అనడం ఏమీ బాగోలేదని - అలా అనడం తప్పంటూ కర్ణాటకకు బీజేపీ సీనియర్ నేత శ్రీనివాస ప్రసాద్ హితవు పలికారు. మోదీ అంటే తనకు గౌరవమేనంటూనే రాజీవ్ గాంధీకి మద్దతుగా మాట్లాడారు.

రాజీవ్ గాంధీ అవినీతి ఆరోపణలతో చనిపోలేదని - శ్రీలంకను గడగడలాడించిన ‘తమిళ పులి’ ప్రభాకరన్ సారథ్యంలోని అప్పటి ఎల్‌ టీటీఈ సంస్థ ఆయనను పొట్టనపెట్టుకుందని అన్నారు. మోదీ చేసిన ఆరోపణలను ఎవరూ నమ్మరని - చివరికి బీజేపీ వాడినైనా తాను కూడా విశ్వసించనని తేల్చి చెప్పారు. అంతేకాదు- రాజీవ్ చాలా మంచివాడని - చిన్న వయసులోనే పెద్ద పెద్ద బాధ్యతలను నిర్వర్తిస్తున్నారంటూ అప్పట్లో బీజేపీ అగ్రనేత - రాజకీయ ఉద్దండుడైన అటల్ బిహారీ వాజ్‌పేయి కూడా కొనియాడారంటూ శ్రీనివాస ప్రసాద్ గుర్తు చేశారు. కాంగ్రెస్ నుంచి కౌంటర్లు వస్తాయనుకుంటే సొంత పార్టీ నుంచే విమర్శలు రావడంతో బీజేపీ నేతలకు ఎలా రియాక్టవాలో అర్థం కావడం లేదట.
Tags:    

Similar News