పురందేశ్వ‌రిని మోడీ న‌మ్ముతున్న‌ట్లేగా?

Update: 2019-02-10 10:55 GMT
దగ్గుబాటి వెంకటేశ్వరరావు, దగ్గుబాటి పురందేశ్వరి..తెలుగు రాష్ట్రాల్లో  పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో భార్యాభర్తలిద్దరూ ఎన్నో పదవులు పొందారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ కనుమరగవడంతో...పురందేశ్వరి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కొంతకాలంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాత్రం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మళ్లీ యాక్టివ్‌ అయ్యేందుకు తన వారుసుడు హితేశ్ చెంచురామ్‌ ను.. రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. త్వరలో కుమారుడితో కలిసి వెంకటేశ్వరరావు వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.

అయితే, హితేశ్ చెంచురామ్‌ తో కలిసి వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించిన దగ్గుబాటి వెంకటేశ్వరావు.. పురందేశ్వరి మాత్రం బీజేపీలో కొనసాగుతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజంగా ఇలా జ‌రిగే అవ‌కాశం ఉందా? ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి బీజేపీలో నిజంగా కొన‌సాగుతారా? అస‌లు బీజేపీ పెద్ద‌లు ఆమెకు పార్టీలో అవ‌కాశం ఇప్పించ‌గ‌ల‌రా? అనే సందేహాల‌కు తాజాగా స‌మాధానం దొరికింది. తాజాగా గుంటూరులోని ప్రజాచైతన్య సభలో పురందేశ్వ‌రికి స‌ముచితం స్థానం క‌ల్పించారు. ప్ర‌ధాని కుడిప‌క్క‌న ఆమె ఆసీనులు అయ్యారు. మ‌రోవైపు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ కూర్చున్నారు. చిన్న‌మ్మ రాజ‌కీయ ప‌య‌నంపై బీజేపీ పెద్ద‌లకు న‌మ్మ‌కం కుదిరినందుకే ఈ అవ‌కాశం క‌ల్పించినట్లు స‌మాచారం.

ద‌గ్గుబాటి వైసీపీలో చేరుతున్న‌ప్ప‌టికీ, బీజేపీ జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా, మేనిఫెస్టో కన్వీనర్‌ గా పురందేశ్వరి ఉన్నత పదవుల్లో బీజేపీ ఆమెను కొన‌సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇదిలాఉండ‌గా, పురందేశ్వ‌రి ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడుతూ అన్ని రంగాల్లోనూ ఆంధ్రప్రదేశ్ ముందు ఉండేందుకు కేంద్రం స‌హ‌క‌రిస్తుందన్నారు.  కేంద్ర ప్రభుత్వ పథకమైన హృదయ్ ద్వారా అమరావతి నగరం దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు.

Tags:    

Similar News