మోడీషాల ఎత్తు.. ఖాయంగా ఏపీలో కొత్త పొత్తు !

Update: 2022-08-07 03:47 GMT
సార్వత్రిక ఎన్నికలకు మరో రెండేళ్ల వరకు గడువు ఉన్న వేళలో.. పొత్తుల గురించి ఎత్తులు వేస్తారా? అన్న సందేహం కలగొచ్చు. విత్తనం వేసిన వెంటనే మొక్క రాదు. మొక్క వచ్చినంతనే పండ్లు కాయవు. అంటే.. ప్రతి దానికో లెక్క ఉంటుందన్న మాట. ఆ మాటకు వస్తే.. రాజకీయాల్లో ఏదైనా పరిణామం చోటు చేసుకుంటే.. దాని వెనుక లెక్కలు వేరుగా ఉంటాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకుందన్న మాట వినిపిస్తోంది.

మరో రెండేళ్లలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన కొత్త పొత్తునకు ఎత్తు వేసే దిశగా ప్రధాని మోడీ పావులు కదుపుతున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీ బీజేపీని ఎంత బలోపేతం చేసినా.. దానికి సంబంధించిన సొంత బలం అట్టే రాదన్న కచ్ఛిత సమాచారంతో మోడీషాలు ఉన్నట్లు చెబుతారు. అందుకే.. బీజేపీని బలపరిచేందుకు వీలుగా మిత్రపక్షాల్ని సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు. ఏపీ అసెంబ్లీలో ఉన్న 175 సీట్లకు ఒక్క సీటు కూడా కోల్పోకుండా మొత్తం తమ పార్టీనే గెలవాలన్న లక్ష్యం పెట్టుకుంటున్నజగన్ తో చేతులు కలపటం సాధ్యం కాదన్న విషయం మోడీషాలకు తెలుసు.

 అలా అని.. ఉత్తినే ఊరుకోవటం కుదరదు. 2024లో జగన్ కు రాష్ట్రాన్ని అప్పగించే కన్నా.. తమ అధీనంలోకి అంతో ఇంతో తెచ్చుకోవాలన్న ఆలోచనలో ఉన్న కమలనాథులకు చంద్రబాబుతో పొత్తుకు మించిన సరైన వ్యూహం మరొకటి ఉండదు. దీనికి తోడు టీడీపీ భవిష్యత్తును పరిగణలోకి తీసుకున్నా.. పొత్తుతో ప్రయోజనమే అన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో.. చంద్రబాబు కూడా తనకు మోడీ అండ కావాలని విపరీతంగా తపిస్తున్న సంగతి తెలిసిందే.

గత సార్వత్రిక ఎన్నికల్లో మోడీ బాధితుడిగా మారిన ఆయనకు.. ఆయన శక్తి సామర్థ్యాలు తెలిసిందే. తనకున్న వనరులతో సొంతంగా అధికారంలోకి వచ్చే విషయం మీద చంద్రబాబుకు సందేహాలు ఉన్నట్లుగా ఆయన సన్నిహితులు చెబుతుంటారు. గత ఎన్నికల్లో మాదిరి ఓవర్ కాన్ఫిడెన్స్ అస్సలు ఉండకూడదని.. జగన్ ను ఏ మాత్రం తక్కువగా అంచనా వేయకూడదన్న భావనతో ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే.. అధికారంలోకి వచ్చే ఏ చిన్న ఛాన్సును మిస్ కాకూడదని బలంగా భావిస్తున్న వేళ.. మోడీతో జత కడితే.. పవన్ ఆటోమేటిక్ గా కలిసి వస్తారని.. అదే జరిగితే.. తమకు తిరుగేలేదన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతారు. ఇదంతా చూస్తే.. ఉభయ తారకంగా ఉన్న నేపథ్యంలో.. కొత్త పొత్తు పొడటం ఖాయమంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.
Tags:    

Similar News