విమర్శలు జైలు కూడు వరకు వెళ్లాయి

Update: 2015-06-26 06:20 GMT
రెండు తెలుగు రాష్ట్రాల అధికారపక్షాల మధ్య నడుస్తున్న మాట యుద్ధం మరింత ముదురుతోంది. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న పరిస్థితి. ఒకరి కంటే మరొకరు తీవ్రస్థాయిలోవిరుచుకుపడాలన్న తపనలో పెద్ద పెద్ద మాటల్ని వెనుకా ముందు చూసుకోకుండా అనేస్తున్న పరిస్థితి.

ఒక ముఖ్యమంత్రిని విమర్శించే విషయంలో ఎలాంటి పరిమితులకు లోబడి ఉండాలన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోయిన వారు.. సంచలనాత్మకంగా తమ విమర్శలు ఉండేలా చూసుకుంటున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ ఏసీబీ ఇచ్చే నోటీసులు ఏపీ సీఎం తీసుకోకుంటే.. మెడ పట్టి జైల్లో పడేస్తామన్న తీవ్ర వ్యాఖ్య చేసిన విషయం తెలిసిందే.

తాజాగా.. ఇదే స్థాయి వ్యాఖ్యను మరో టీఆర్‌ఎస్‌ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు ఉదంతంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు జైలు కూడు తినక తప్పదని విమర్శించారు. చంద్రబాబు.. రేవంత్‌లకు చట్టం చుట్టం కాదన్న ఆయన.. తప్పు చేసిన ప్రతిఒక్కరూ శిక్ష అనుభవించాల్సిందేనని వ్యాఖ్యానించారు.

సెక్షన్‌ 8 గురించి ప్రస్తావిస్తూ.. హైదరాబాద్‌లో అద్దెకు ఉన్న వారు పెత్తనం చెలాయిస్తామంటూ ఎలా ఒప్పుకుంటామని ప్రశ్నించారు. అంటే.. అద్దెకున్న వ్యక్తికి హక్కులు ఉండవనా పోచారం అభిప్రాయం. అద్దె చెల్లించినప్పుడు యజమానికి మాదిరే.. అద్దెకు ఉన్న వ్యక్తికి కూడా చట్టబద్ధత ఉంటుందని.. ఆ విషయంలో కోర్టు సైతం అద్దెకున్న వ్యక్తి హక్కుల్ని పరిరక్షిస్తుందన్న విషయం పోచారం మర్చిపోయినట్లున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News