ఏపీకి షాక్‌.. పోల‌వ‌రం బిల్లుల‌ను తిప్పిపంపిన కేంద్రం

Update: 2021-10-05 09:30 GMT
పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం.. ఏపీకి షాక్‌ల మీద షాక్‌లిస్తూనే ఉంది. నిధుల విడుద‌ల‌పై కేంద్ర ఆర్థిక శాఖ‌ అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తూనే ఉంది. తాజాగా రూ.805 కోట్ల బిల్లుల‌ను వెన‌క్కి పంపి ఏపీ ప్ర‌భుత్వానికి షాకిచ్చింది. నిధులు రాబ‌ట్టుకునే విష‌యంలో కేంద్రంతో ఏపీ ప్రభుత్వం స‌ఖ్య‌త‌గా ఉంటున్న‌ప్ప‌టికీ తిర‌స్కారం త‌ప్ప‌ట్లేద‌ని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ పోల‌వరం నిధుల విడుద‌ల‌పై కేంద్రం కొర్రీల‌పై కొర్రీలే వేస్తోంద‌నే విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

తాజాగా ప్రాజెక్టులో తాగునీటి విభాగం కింద రూ.4,068.43 కోట్లు ఇవ్వ‌బోమంటూ కేంద్ర ఆర్థిక శాఖ అభ్యంత‌రాలు వ్య‌క్తం చేసింది. ఏపీ అభ్య‌ర్థ‌న మేర‌కు కేంద్ర జ‌ల‌శ‌క్తి పంపిన ప్ర‌తిపాద‌న‌ల‌నూ తిర‌స్క‌రించింది. ఈ ప్రాజెక్టుకు ఇక కేవ‌లం రూ.7,053 కోట్లు మాత్ర‌మే ఇస్తామ‌ని గ‌తేడాది కేంద్ర ఆర్థిక శాఖ బాంబు పేల్చిన సంగ‌తి తెలిసిందే. ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకునేందుకు ఏడాదిగా రాష్ట్రం చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్న ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అడుగ‌డుగునా ఆర్థిక‌ప‌ర‌మైన ఇబ్బందులు ఎదర‌వుతున్నాయి. ఏపీ ప్ర‌భుత్వం ప‌నులు చేస్తున్నా కేంద్రం మాత్రం ఆ బిల్లుల‌ను ఏదో ఓ కార‌ణంతో తిప్పి పంపుతోంది. ఆయా విభాగాల కింద కొత్త‌గా స‌మ‌ర్పిస్తున్న బిల్లులకు కేంద్రం నిధులివ్వ‌డం లేదు. ఈ ర‌కంగా ఇంత‌వ‌ర‌కూ రూ.805.68 కోట్ల బిల్లుల‌ను తిర‌స్క‌రించింది. అందులో కుడి ఎడ‌మ కాలువ‌ల బిల్లులు రూ.284.63 కోట్లు భూసేక‌ర‌ణ బిల్లులు రూ.285 కోట్లు కాగా. . మిగ‌తావి పాల‌నాప‌ర‌మైన ఖ‌ర్చులు.

ఈ ప్రాజెక్టు ప‌నుల‌పై గ‌తంలో కేంద్ర అటవీ ప‌ర్యావ‌ర‌ణ శాఖ నిషేధం విధించిన‌ప్ప‌టికీ.. ఎప్ప‌టిక‌ప్పుడూ స్టే ఎత్తివేయిస్తూ ప‌నులు చేస్తున్నారు. ప్రాజెక్టు ప‌నుల‌కు 2021 జులై 2 వ‌ర‌కు మాత్ర‌మే అనుమ‌తి ఉంది. ఇంకా పొడిగింపు రాలేదు. మ‌రోవైపు రూ.47,725.74 కోట్ల పెట్టుబ‌డికి కేంద్రం నుంచి అనుమ‌తి రావాల్సి ఉంది. అయితే ఈ విష‌యంలో కేంద్రం తాత్సారం చేస్తోంది. దీంతో ఆర్థిక శాఖ తాజాగా లేవ‌నెత్తిన అభ్యంత‌రాల‌కు స‌మాధానం ఇచ్చేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం సిద్ధ‌మవుతోంది. తాగు.. సాగు నీటి విభాగాలంటూ విభజించి కోత పెట్ట‌వ‌ద్ద‌ని ఆ నిధులు ఇవ్వాల్సిందేన‌ని ఏపీ కోర‌నుంది. రూ.7.053 కోట్లు మాత్ర‌మే ఇస్తామ‌ని చెప్పిన కేంద్రం.. ప్రాజెక్టు ప్ర‌ధాన డ్యాం పున‌రావాసం భూసేక‌ర‌ణ కుడి ఎడ‌మ కాలువ‌ల విభాగాల వారీగా ఎంతెంత నిధులు అవ‌స‌ర‌మో లెక్కించింది. ఇక ఇవ్వ‌బోయే రూ.7,053 కోట్ల నిధుల్లో ఏ విభాగంలో ఇప్ప‌టికే ఎంత ఇచ్చామో.. ఇంకా ఎంత ఇవ్వాలో కేంద్ర ఆర్థిక శాఖ రాష్ట్రానికి రాసిన లేఖ‌లో పేర్కొంది. అందులో నుంచి ఇవ్వ‌బోయే నిధులు ఉంటాయ‌ని కేంద్రం స్ప‌ష్టం చేసింది.

మ‌రోవైపు డీపీఆర్ 2లోని రూ.47,725 కోట్ల‌కు ఇంకా కేంద్రం నుంచి ఆమోదం ల‌భించ‌ని నేప‌థ్యంలో ఈ లోపు విభాగాల వారీగా విధించిన ప‌రిమితిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌ద్ద‌ని రాష్ట్రం కోరింది. కానీ ఈ డిమాండ్‌ను కేంద్ర జ‌ల‌న‌వ‌రుల శాఖ తిర‌స్క‌రించింది. విభాగాల ప‌రిమితి దాటి నిధులు ఇవ్వ‌బోమ‌ని స్ప‌ష్టం చేసింది. ఈ నేప‌థ్యంలోనే ఇప్పుడు రూ.805 కోట్ల బిల్లుల‌ను తిర‌స్క‌రించింది.




Tags:    

Similar News