అసెంబ్లీ దగ్గర కిందపడిపోయిన రోజా

Update: 2015-12-19 06:20 GMT
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద అనుచిత వ్యాఖ్యలు చేసి ఏడాది పాటు సస్పెండ్ అయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా శనివారం హడావుడి చేశారు. ఏడాది పాటు సస్పెండ్ అయిన నేపథ్యంలో అసెంబ్లీలోకి అడుగు పెట్టే వీల్లేదు. అయితే.. ఆమె అలాంటివేమీ పట్టించుకోకుండా అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. తన వాహనంలో లోపలికి వచ్చే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంలో రోజా వాహనాన్ని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు.

తాను అసెంబ్లీకి వెళ్లటం లేదని.. తాను.. అసెంబ్లీ ఆవరణలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వెళుతున్నట్లుగా చెప్పారు. ఈ సందర్భంగా భద్రతా సిబ్బంది అభ్యంతరాల్ని ఆమె ససేమిరా అంటూ మార్షల్స్ తో ఆమె వాగ్వాదానికి దిగారు. దీంతో జోక్యం చేసుకున్న పోలీసులు ఆమెను అసెంబ్లీ ప్రాంగణం నుంచి బయటకు పంపేందుకు ప్రయత్నించారు.

ఈ సందర్భంగా చిన్నపాటి తోపులాట చోటు చేసుకోవటం.. ఆ హడావుడిలో రోజా కిందపడటం జరిగిపోయాయి. దీంతో.. రోజాకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెలరేగిపోయారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మార్షల్స్ కలుగజేసుకొని ఆమెను పోలీసు వాహనంలో తరలించేందుకు ప్రయత్నించారు. అందుకు నిరాకరించిన రోజా.. తన వాహనంలోనే వస్తానని చెప్పారు. దీనికి పోలీసులు ఒప్పుకోలేదు. నిబంధనల ప్రకారం.. సస్పెండ్ అయిన సభ్యులు అసెంబ్లీలోకి అనుమతించేది లేదన్న విషయాన్ని రోజాకు స్పష్టం చేసిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని సైఫాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

శుక్రవారం తన మాటలతో రచ్చ రచ్చ చేసిన రోజా.. శనివారం తన చేతలతో పోలీసులకు చుక్కలు చూపించినట్లుగా చెబుతున్నారు. రోజా దూకుడుతనంతో వ్యవహరిస్తున్న నేపథ్యంలో పోలీసులు ఏ మాత్రం సంయమనం లోపించినా..  అది తమ నెత్తికి చుట్టుకోవటం ఖాయమన్న భయంతో పోలీసులు ఆచితూచి వ్యవహరించటం కనిపించింది.
Tags:    

Similar News