ఢిల్లీ పెద్దలు ఫిడేల్ వాయిస్తున్నారా..!

Update: 2017-01-26 04:32 GMT

నీరో చ‌క్ర‌వ‌ర్తి ఫిడేల్ వాయించుకున్న సంఘటన అందరికీ తెలిసిందే. రోమ్ నగరం తగలబడిపోతుంటే ఆ పెద్దయన చేసిన పని అది! అలాంటి నీరో చక్రవర్తులు ఇప్పుడు మన హస్తినలో కూడా ఉన్నారా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తుంది ఏపీ యువత! ఎందుకంటే... తమిళనాడు లో యువత చట్టబద్దం కాని విషయంపై పోరాడిన కూడా వెంటనే ఆర్డినెన్స్ ఇచ్చేసిన కేంద్ర పెద్దలు... ఆంధ్రా యువత ఆక్రంద‌న‌తో ఉంటే ఎందుకు స్పందించలేకపోతున్నారు. కనీసం ప్రధాని నుంచి ఒక ట్వీట్ కి కూడా ఏపీ వాసులు నోచుకోలేదా? దానికి కారణం తమిళనాట బీజేపీకి కలిసొచ్చేలా ఉన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఏపీలో కలిసిరాని పరిస్థితులేనా!?

ఏపీలో యువత తమ నిరసనను వ్యక్తపరిచే కనీస హక్కును కూడా కలిగిలేదనే బాద తాజాగా వ్యక్తమవుతుంది. మాకు బాదకలిగింది.. అది చెప్పుకునే అవకాశం ఇవ్వండి అని రాష్ట్ర పెద్దలను అడిగినా... వారి దయాదాక్షిణ్యాలు లేకుండా సెక్షన్ ల మీద సెక్షన్లు పెట్టి అవరొధాలు కలిగిస్తున్నారు. విద్యార్థులను ముందస్తుగా అరెస్టులు చేస్తున్నారు. ఇలా ఉంది ఏపీలో యువతపై నియంత మార్కు పరిస్థితి! అయినా... ఢిల్లీ పెద్దలు స్పందించరు. చాలా మంది అనుమానిస్తున్నట్లు... ఆంధ్రా కూడా భారతదేశంలో భాగమే కదా! అనే అనుమానాలు ఏపీ యువత తాజాగా వ్యక్తపరుస్తుంది. ఏపీ యువత చేసిన నేరమేమిటి అని ఆవేదన చెందుతుంది.

ఏపీలో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది.. ఏపీ ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తుంది అనే విమర్శలు ఒకవైపు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంలో ప్రధాని ఒక ట్వీట్ చేశారు! అది ఏపీ యువతకు సంబందించింది అనుకునేరు...! ఎన్నిక‌ల గొప్ప‌త‌నం గురించీ, ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌జ‌ల‌కున్న అధికారం గురించి!! అవును... "ఎలక్షన్స్‌ ఆర్‌ సెలబ్రేషన్స్‌ ఆఫ్‌ డెమోక్రసీ.. దె కమ్యూనికేట్‌ ద విల్‌ ఆఫ్ ది పీపుల్‌, విచ్‌ ఈజ్‌ సుప్రీమ్‌ ఇన్‌ డెమోక్రసీ" అనేది ప్రధాని తాజా ట్వీట్. "ఎన్నిక‌లు అంటే ప్ర‌జాస్వామ్యం ఒక పండుగ అనీ.. ప్ర‌జ‌ల మ‌నోభావాల‌కు ప్ర‌తిబింబం" అని పెద్దాయన చెబుతున్నారు. ఈ ట్వీట్ కి వెంటనే ఆంధ్రా నుంచి కొన్ని కామెంట్స్ వ‌చ్చాయి. "రాష్ట్రంలో జ‌రుగుతున్నది క‌నిపిస్తోందా" అంటూ సూటి ప్ర‌శ్న‌లు కూడా ప‌డ్డాయి!

కేవలం రాజకీయంగా ఏపీలో బీజేపీకి హోప్స్ లేకపోవడమే ఆంధ్రుల పట్ల హస్తిన పెద్దల నిర్లక్ష్యానికి, చిన్నచూపుకి కారణమా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు! ఏపీకి ఏమి చేసినా అవి టీడీపీ ఖాతాలోకే వెళ్లిపోతున్నాయనేది కొందరి బీజేపీ పెద్దల సందేహం కావచ్చు. ఈ కష్టమేదో, ఈ ప్రయత్నమేదో తమిళనాడులో చేస్తే... ప్రస్తుతం అక్కడున్న రాజకీయ పరిస్థితులకు బీజేపీ తమ జెండా పాతెయ్యొచ్చని భావన అయ్యి ఉండొచ్చు! సరే రాజకీయ పార్టీలకు ఆ రకమైన కాలిక్యులేషన్స్ ఉండొచ్చు కానీ... అధికారంలోకి వచ్చి, దేశాన్ని పరిపాలించే బాధ్యత ప్రజలంతా కలిసి అప్పగించినా కూడా అదే మార్కు ఆలోచనలు చేయడం ఎంతవరకూ సరైంది! హస్తిన పెద్దల చూపు ఏపీ యువతవైపు ఒక్కసారైనా పడాలి... 24 గంటల్లో కనీసం 2.4 నిమిషాలైనా ప్రధాని ఏపీ యువత ఆవేదనను వినాలని ఏపీ యువత భావిస్తున్నారు.. చూస్తారని ఆశిస్తున్నారు!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News