విడ్డూరం: వాట్సాప్ గ్రూపు నుంచి తొలగించారని పోలీస్ స్టేషన్ లో కేసు

Update: 2022-09-02 09:39 GMT
వాట్సాప్.. ఇప్పుడు ఇది లేనిదే అస్సలు పూటగడవని పరిస్థితి. అన్ని పనులు, సమాచారాలు అన్ని కూడా దీంతోనే సాగుతున్నాయి. అంతలా ప్రజలకు చేరువైన వాట్సాప్ మనతో ఒక ప్రత్యేకమైన బంధాన్ని పెనవేసుకుంది. ఇది లేకపోతే బతకలేనిదిగా మారింది. ఎందుకంటే మన రోజువారీ పనులు, ఆఫీసు పనులు , వ్యక్తిగత అవసరాలు వాట్సాప్ ద్వారానే తీరిపోతున్నాయి. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లో ఉన్న పాపులర్ యాప్ ఏదయ్యా అంటే అది వాట్సాప్ మాత్రమే.

డిజిటల్ రంగం కొత్త పుంతలు తొక్కడం.. ప్రతీగ్రామంలోనూ వైఫై , ఇంటర్ నెట్ సేవలు సులభంగా అందుబాటులోకి రావడంతో టెక్నాలజీపై చాలా మందికి పట్టు పెరిగింది. దీంతో ఒకరికొకరు సోషల్ మీడియా యాప్ ల ద్వారానే కలుస్తున్నారు. మాట్లాడుతున్నారు. దగ్గరి మిత్రులను, తమ భావాలు కలిసే వారు అందరూ కలిసి సోషల్ మీడియాలో గ్రూపులుగా ఏర్పడి అనుభవాలు పంచుకుంటున్నారు.

మహబూబ్ నగర్ లో కొంత మంది ప్రజాప్రతినిధులు వాట్సాప్ గ్రూప్ గా ఏర్పడ్డారు. ఇప్పుడదే పోలీస్ స్టేషన్ వరకూ తీసుకెళ్లింది. వాట్సాప్ గ్రూప్ లో అడ్మిన్ గా చేరి తర్వాత తమనే గ్రూపు నుంచి తొలగించారంటూ మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల కు చెందిన ఇద్దరు వ్యక్తులు కౌన్సిలర్  లతపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో గురువారం జరిగిన ఈ ఘటన వైరల్ గా మారింది.

జడ్చర్లకు చెందిన చైతన్య, వసీంలు పట్టణంలోని 25వ వార్డు పేరుతో వాట్సాప్ గ్రూప్ ను ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలోనే గ్రూప్ లో తనను కూడా సభ్యురాలిగా చేర్చుకోవాలని కోరుతూ కౌన్సిలర్ లత కోరగా.. అడ్మిన్ గా అవకాశం కల్పించారు.

అయితే కొద్దిరోజుల తర్వాత గ్రూపు నుంచి తమనే తొలగించిందని.. తమ గ్రూపును తమకు ఇప్పించాలంటూ చైతన్య, వసీంలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

దీనిపై సదురు కౌన్సిలర్ లత కూడా స్పందించారు. గ్రూప్ ను క్రమశిక్షణతో ముందుకు తీసుకెళ్లాలనే తాను అడ్మిన్ గా వ్యవహరించానని.. తాజా ఫిర్యాదుతో తాను ఆ గ్రూప్ నుంచి వైదొలుగుతున్నానని.. మరో కొత్త గ్రూపును ఏర్పాటు చేసుకుంటున్నట్లు ఆమె వివరించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News