ఇంద్రాణి కేస్ లో ఏమైనా కుట్రలూ ఉన్నాయా

Update: 2015-10-04 04:04 GMT
కన్నకూతురిని చంపిన కేసులో జైలులో ఉన్న మీడియా సెలబ్రిటీ ఇంద్రాణి ముఖర్జీ భద్రతా గార్డుల కళ్లు గప్పి మూర్చరోగానికి వాడే మాత్రలను మోతాదుకు మించి ఎలా స్వీకరించిందనేది ప్రశ్నార్థకమైంది. జైలులో తన బ్యారక్కులో అపస్మారకంగా పడి ఉన్న ఇంద్రాణికి గత రెండు రోజులుగా ముంబైలోని జెజె ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు కానీ ఈ ఘటన వెనుక పలు ప్రశ్నలకు సమాధానం మాత్రం రావడం లేదు. జైలులో ఆమెకు రోజువారీ మాత్రలు ఇస్తున్నావారెవరు, జైలు అధికారుల ముందే ఆమె మాత్రలు మింగిందా అనే అంశాలపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఇప్పటి వరకు వెలుగుచూడని కుట్రలు ఏమైనా ఈ ఎపిసోడ్ లో ఉన్నాయా అనే దిశగా కూడా పోలీసులు ఆలోచిస్తున్నారు.

ఇంద్రాణిని ఉంచిన జైలుగదిలో ఎక్కడ తప్పు జరిగిందనే విషయంపై విచారించవలిసిందిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఐజీ స్థాయి కలిగిన ఐపీఎస్ ర్యాంకు అధికారిని ఆదేశించారు. శుక్రవారం ఉదయం 5 గంటలకు ఇంద్రాణి భగవద్గీతను చదువుతూ ఉన్నట్లుండి కుప్పగూలిపోయింది. జైలుకు వచ్చినప్పటినుంచి ఆమె ప్రతిరోజూ భగవద్గీతను చదివేదని జైలు అధికారులు చెబుతున్నారు. ఉదయం ఆరుగంటలకల్లా జెజె ఆసుపత్రికి చెందిన వైద్యులు ఆమెకు పరిచర్యలు చేశారు. అయితే ఆమె పరిస్థితి విషమించడంతో మద్యాహ్నం తర్వాత 1.30 గంటలకు ఆసుపత్రికి తరలించారని మహారాష్ట్ర జైళ్లశాఖ ఐజీ బిపిన్ కుమార్ సింగ్ ప్రకటించారు.

అయితే ఇంద్రాణిని ఆసుపత్రిలో చేర్చడానికి వైద్యులు ఏడు గంటల పైగా సమయాన్ని ఎందుకు తీసుకున్నారన్నది తేలటం లేదు. విషాదకరమైన విషయం ఏమిటంటే ఇంద్రాణి జైలులో స్పృహ కోల్పోయి ఉన్నప్పుడు అక్టోబర్ 1న చనిపోయిన ఆమె తల్లి అంత్యక్రియల గురించిచెప్పడానికి ఇంద్రాణి న్యాయవాదుల నుంచి జైలు సూపరింటెండ్ కు ఫోన్ కాల్ వచ్చింది. కాగా ఇంద్రాణి విషయంలో వైద్యపరంగా తీసుకున్న చర్యలు సరిగానే ఉన్నాయా అనే విషయంపై విచారణ జరిపి రెండు, మూడు రోజుల్లోనే నివేదిక తెలుపుతామని సింగ్ తెలిపారు. బ్యారక్కులలో రోజువారీ తనిఖీలు జరుపుతున్నామని అధికారులు స్పష్టం చేస్తున్నప్పటికీ ఇంద్రాణి ట్యాబ్లెట్లను ఎలా పోగుచేసుకుందనే అంశానికి ప్రాధాన్యత నిస్తున్నారు.

సెప్టెంబర్ 12నుంచి 26 వరకు ఇంద్రాణికి చికిత్స చేశారని జైలుకు వచ్చిన తొలిరోజు నుంచి ఆమె నిరాశా నిస్పృహలకు లోనై ఉండటంతో ఆమెకు వైద్యులు సంబంధిత మందులు ఇచ్చారని తెలిసింది..
Tags:    

Similar News