కేసీఆర్‌ పై ఫేస్‌ బుక్ పోస్ట్‌..రంగంలోకి హోం శాఖ‌

Update: 2018-01-11 10:37 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ పై సోష‌ల్ మీడియా వేదిక‌గా సాగుతున్న దుష్ప్ర‌చారంపై ఇటు టీఆర్ ఎస్ వ‌ర్గాలు - అటు అధికారులు క‌న్నెర్ర చేస్తున్నారు. శృతిమించి ఆరోప‌ణ‌లు చేస్తున్న వారి విష‌యంలో కేంద్ర హోం శాఖ‌ను సైతం ఎంట్రీ చేయించారు. సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ఫేస్‌ బుక్ స‌హ‌క‌రించ‌క‌పోతే ఆ ప్ర‌ముఖ సంస్థ‌ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ‌తో దారిలో పెట్టేందుకు సిద్ధ‌మైంది.

వివ‌రాల్లోకి వెళితే...తెలంగాణ సీఎం కేసీఆర్‌ పై గత నవంబరులో రామకృష్ణ ఆకుతోట అనే ఫేస్‌ బుక్ అకౌంట్‌ తో పలు ఆరోపణలు - అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టారు. ఈ ప‌రిణామంపై టీఆర్ ఎస్ వ‌ర్గాలు మండిప‌డ్డాయి. దీంతో ఆజంపురాకు చెందిన తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్త వసీం అలీ ఆ పోస్టులపై చాదర్‌ ఘాట్‌ పోలీస్టేషన్‌ లో ఫిర్యాదు చేయ‌గా..దానిపై  నవంబర్‌ 13న కేసు నమోదైంది. స్థానిక పోలీసులు తదుపరి దర్యాప్తు నిమిత్తం ఈ కేసును సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ కు బదిలీ చేశారు. సాక్షాత్తు ముఖ్య‌మంత్రిపై వ‌చ్చిన కామెంట్ల విష‌యంలోని ఈ కేసును సీసీఎస్ అధికారులు సీరియ‌స్‌ గా తీసుకొని సీఎం కేసీఆర్‌ పై చేసిన ఆ వ్యాఖ్యలు ఏ ఐపీ అడ్రస్‌ నుంచి ఫేస్‌ బుక్‌ లో పోస్ట్‌ అయ్యాయనే వివరాలు కావాలని కోరుతూ ఫేస్‌ బుక్‌ ను ఆశ్ర‌యించారు.

అయితే ప‌లు కార‌ణాలు వెల్ల‌డిస్తూ...ఈ వివ‌రాలు ఇచ్చేందుకు నో చెప్పింది. ఐపీ అడ్రస్‌ ఇచ్చేందుకు ఫేస్‌ బుక్ నిరాక‌రించిన నేప‌థ్యంలో సీసీఎస్ అధికారులు కేంద్ర హోంశాఖ‌కు లేఖ రాశారు. నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తున్నందున ఫేస్‌ బుక్‌ సంస్థతో సంప్రదించి రాష్ట్ర సీఎంపై కామెంట్లు చేసిన  కేసు దర్యాప్తునకు అవసరమైన సమాచారం ఇప్పించాలని లేఖలో కోరారు. మ్యూచువల్‌ లీగల్‌ అసిస్టెన్స్‌ ట్రీటీ ప్రకారం ఫేస్‌ బుక్‌ సంస్థతో సంప్ర‌దించి ఈ వివ‌రాలు ఇవ్వాల‌ని సీసీఎస్ అధికారులు సూచించిన‌ట్లు స‌మాచారం.

విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం రాబోయే ప‌దిరోజుల్లో ఈ వివ‌రాలు రానున్న‌ట్లు తెలుస్తోంది. ఈ వివ‌రాలు వ‌చ్చిన త‌ర్వాత కేసు ద‌ర్యాప్తులో  వేగం పుంజుకోనుంద‌ని స‌మాచారం. కాగా, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పై అనుచిత వ్యాఖ్యల కేసులో ఏకంగా కేంద్ర హోంశాఖ‌ను ఎంట‌ర్ చేస్తుండ‌ట ఆస‌క్తిక‌రంగా మారింది.!
Tags:    

Similar News