ఆంధ్రుల ఆకాంక్ష అయిన ప్రత్యేక హోదా సత్తా చాటేందుకు విశాఖలోని ఆర్కే బీచ్ సాక్షిగా జరిగే శాంతియుత ప్రదర్శనపై ఉత్కంఠ నెలకొంటోంది. పవర్ స్టార్ - జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో పాటు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు అనేకమంది సినీ నటులు ఈ నిరసన రూపానికి మద్దతిచ్చిన సంగతి తెలిసిందే. అయితే పోలీసులు ఈ ఎపిసోడ్ లో అనూహ్య ట్విస్ట్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సు 27వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ నిరసనకు అనుమతి లేదని తేల్చిచెప్పారు.
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కేటాయించాలనే డిమాండ్ ను నెరవేర్చాలంటూ 26వ తేదీ సాయంత్రం కిర్లంపూడి లేఅవుట్ ఎదురుగా బీచ్ రోడ్డులో నిర్వహించే శాంతియుత నిరసన కార్యక్రమానికి పార్టీలకతీతంగా హాజరుకావాలని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనికి అనూహ్య మద్దతు దక్కడం ఏపీ పోలీసులను కలవరపాటుకు గురిచేస్తోంది. పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ఏర్పాటు చేసిన ఈ కీలక సమావేశానికి హాజరయ్యేందుకు నిరసన జరిగే రోజే అంటే జనవరి26నే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వస్తున్నారు. మరుసటి రోజే ప్రముఖ వ్యాపారవేత్తలతో కీలక సదస్సు జరుగుతుతోంది. ఈ నేపథ్యంలో ఆందోళనకు మద్దతు ఇస్తే ఇబ్బందులు ఎదురవుతాయని భావిస్తున్నారు. కాగా ఈ పరిణామంపై విశాఖ పోలీస్ కమిషనర్ యోగానంద్ మాట్లాడుతూ ఆర్కే బీచ్ ఆందోళనకు మద్దతివ్వాలని కోరుతూ ఇప్పటివరకు తమనెవరూ సంప్రదించలేదని స్పష్టం చేశారు. అదే సమయంలో అనుమతి ఇవ్వడం ఒకింత కష్టసాధ్యమని తెలిపారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/