అర్థరాత్రి కలకలం: చిత్తూరు మాజీ మేయర్ హేమలతపై పోలీసు జీపు

Update: 2022-06-24 04:05 GMT
ఎక్కడైనా విన్నామా? ఎప్పుడైనా చూశామా? అన్నట్లు విడ్డూరాలన్ని కలిసికట్టుగా మీద పడ్డట్లు.. ఏపీలోని వైఎస్ జగన్ ప్రభుత్వంలో తరచూ చోటు చేసుకునే వివాదాలు తరచూ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నాయి. జగన్ పాలన మీద ఆగ్రహాన్ని వెళ్లబుచ్చేలా మారుతున్నాయి. తాజాగాఅర్థరాత్రి వేళ.. చిత్తూరు పోలీసులు అనుసరించిన తీరు కొత్త వివాదానికి కారణమైందన్న మాట వినిపిస్తోంది. గురువారం అర్థరాత్రి 11 గంటల సమయంలో చిత్తూరు మాజీ మేయర్ కమ్ టీడీపీ నగర అధ్యక్షురాలు కఠారి హేమలత అనుచరుడైన పూర్ణ ఇంటి వద్ద చోటు చేసుకున్న హైడ్రామా.. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలేం జరిగిందంటే..

గురువారం అర్థరాత్రి 11 గంటల వేళలో.. చిత్తూరు మాజీ మేయర్ హేమలత అనుచరుడు పూర్ణ ఇంటికి పోలీసులు వచ్చారు. 'మీ ఇంట్లో గంజాయి ఉంది' అంటూ సోదాలు షురూ చేశారు. 'తప్పుడు కేసులు పెట్టి వేధించాలని పోలీసులు వ్యవహరిస్తున్నారు' అంటూ పూర్ణ ఆందోళనకు దిగారు. ఈ విషయం గురించి తెలిసిన హేమలత పూర్ణ ఇంటికి వచ్చి.. అతడికి మద్దతుగా ఆందోళన చేపట్టారు.

అనుచరులతో కలిసి పూర్ణ ఇంటికి వచ్చిన ఆమె.. పోలీసు జీపు వెనుక బైఠాయించారు. ఈ సందర్భంగా సీఐ.. పోలీసు జీపును వెనక్కి పోనివ్వమంటూ ఆదేశాలు జారీ చేయటం.. అందుకు తగ్గట్లే పోలీసు జీపు డ్రైవర్ వాహనాన్ని వెనక్కి తీసుకెళ్లటంతో.. వాహనం హేమలత కాళ్ల మీదుగా వెళ్లి.. గాయాలయ్యాయి. ఈ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది.

గంజాయి బస్తాలు ఉన్నట్లు పోలీసులు ఇంటికి వచ్చిన వేళలో.. అందుకు ఆధారాలు చూపాలని ప్రశ్నించారు. అయితే.. పోలీసులు అందుకు సమాధానం ఇవ్వకపోగా.. తమ దగ్గరున్న గంజాయి బస్తాల్ని ఇంట్లో పెట్టేందుకు ప్రయత్నించగా.. తాము అడ్డుకున్నట్లుగా పూర్ణ తల్లి.. వదినలు చెబుతున్నారు. దీంతో ఓబనపల్లెలో తమకు ఉన్న మరో ఇంట్లో ఒక గంజాయి బస్తాను పెట్టినట్లుగా ఆరోపిస్తున్నారు. తప్పుడు కేసుల్లో ఇరికించేందుకు వీలుగా పోలీసులు కుట్ర పన్నుతున్నట్లుగా వారు పేర్కొన్నారు.

దీంతో పూర్ణకు మద్దతుగా హేమలత ఇతర టీడీపీ నేతలు అతడి ఇంటికి వచ్చి.. పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా చెబుతున్న మూటల్లో ఏముందో చూపించాలని డిమాండ్ చేశారు. అందుకు కుదరదని చెప్పిన పోలీసులు.. పూర్ణను జీపులో ఎక్కించారు. అతడ్ని కిందకు దించాలంటూ హేమలత.. ఆమె అనుచరులు జీపు వెనుక కూర్చున్నారు. జీపును రివర్సు చేయాల్సిన వేళ.. వాహనం వెనుక కూర్చున్న హేమలతను పట్టించుకోకుండా.. విసురుగా రివర్సు తీసుకోవటంతో ఆమె కాళ్లపై నుంచి వాహనం వెళ్లిపోయింది.

దీంతో గాయపడిన ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. రెండు కాళ్ల ఎముకల్లో స్వల్పంగా పగుళ్లు వచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే.. తాము వాహనం ఎక్కించకున్నా.. ఎక్కించినట్లుగా ఆరోపిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. మొత్తంగా ఈ వ్యవహారం చిత్తూరులో పెను సంచలనంగా మారింది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విపక్ష నేతల్ని ఏదో కేసుల్లో ఇరికించి.. వారిని అరెస్టు చేసి.. వేధింపులకు గురి చేస్తున్నారన్న ఆరోపణలకు తాజా ఉదంతం మరింత బలం చేకూరేలా మారిందన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News