బాబూ... జ‌గ‌న్ యాత్ర‌కు భ‌ద్ర‌తేదీ?

Update: 2018-03-25 12:23 GMT
ఏపీ అసెంబ్లీలో విప‌క్ష నేత‌, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర చేప‌ట్టి స‌రిగ్గా నేటికి నాలుగు నెల‌లు నిండింది. త‌న సొంత జిల్లా క‌డ‌ప‌లోని త‌న తండ్రి స‌మాధి ఉన్న ఇడుపుల‌పాయ‌ను నంచి జ‌గ‌న్ మొద‌లుపెట్టిన యాత్ర ఇప్ప‌టికే రాయ‌ల‌సీమ‌లోని నాలుగు జిల్లాలు - కోస్తాంధ్ర‌లోని ప్ర‌కాశం - నెల్లూరు జిల్లాల‌ను చుట్టేసింది. ఇప్పుడు రాష్ట్రంలోనే అత్యంత కీల‌క జిల్లాగా ప‌రిగ‌ణిస్తున్న గుంటూరు జిల్లాలో జ‌గ‌న్ యాత్ర కొన‌సాగుతోంది. నిన్న గుంటూరు జిల్లాలోని న‌ర‌స‌రావుపేట‌లో జ‌గ‌న్ భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించారు. టీడీపీ కంచుకోట‌గా ఉన్న న‌ర‌స‌రావుపేట‌లో జ‌గ‌న్ స‌భ‌కు ఇసుకేస్తే రాల‌నంతగా జ‌నం తండోప‌తండాలుగా వ‌చ్చేశారు. జ‌గ‌న్ స‌భ నిర్వ‌హించిన ద‌గ్గ‌ర అస‌లు రోడ్డు క‌నిపించ‌లేదంటే అతిశ‌యోక్తి కాదేమో. వంద‌లు, వేలు దాటేసిన జ‌గ‌న్ ప్ర‌భంజ‌నం ఎప్పుడో ల‌క్ష‌లు కూడా దాటేసింది. నిన్న న‌ర‌స‌రావుపేట‌లో కూడా జ‌గ‌న్ స‌భ‌కు ల‌క్ష‌లాది మంది హాజ‌ర‌య్యారు. ల‌క్ష‌ల మంది త‌ర‌లివ‌చ్చిన ఈ స‌భ‌కు ప్ర‌భుత్వప‌రంగా భ‌ద్ర‌త చూస్తే మాత్రం అస‌లు పోలీసులు ఉన్నారా? అన్న అనుమానాలు కూడా క‌లిగాయ‌నే చెప్పాలి.

జ‌గ‌న్ న‌ర‌స‌రావుపేటలో నిర్వ‌హించ‌నున్న భారీ స‌భ‌కు ల‌క్ష‌లాదిగా జ‌నం రానున్నార‌ని, స‌భ‌లో ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటుచేసుకోకుండా భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని వైసీపీ నేత‌లు గుంటూరు జిల్లా ఎస్పీకి విన్న‌వించారు. అయినా కూడా ఆశించిన మేర భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌ను పంపని జిల్లా ఎస్పీ... అర‌కొర‌గానే పోలీసుల‌ను అక్క‌డికి పంపార‌ట‌. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన పార్టీ శ్రేణులు కాస్త ముందుగానే అప్ర‌మ‌త్త‌మై.. అందుబాటులో ఉన్న అర‌కొర పోలీసుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకుని ల‌క్ష‌ల మంది జ‌నం హాజ‌రైన జ‌గ‌న్ స‌భ‌లో ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటుచేసుకోకుండా చూసుకున్నారు. పార్టీ శ్రేణులు అప్ర‌మ‌త్తంగా లేక‌పోతే... ప‌రిస్థితీ ఏమిటి? అస‌లు అక్క‌డ ఏదేనీ అవాంఛ‌నీయ ఘ‌ట‌గ‌న జ‌రిగితే బాధ్య‌త ఎవ‌రిది? అస‌లు విజ్ఞ‌ప్తి అందినా గుంటూరు జిల్లా ఎస్పీ ఎందుకు స్పందించ‌లేదు? ఈ ప్ర‌శ్న‌ల‌న్నింటి వెనుకా చాలా పెద్ద కుట్ర న‌డుస్తోంద‌నే వాద‌న వినిపిస్తోంది. జ‌గ‌న్ ఎక్క‌డికెళ్లినా ఆయ‌న స‌భ‌ల‌కు జ‌నం తండోప‌తండాలుగా త‌ర‌లివ‌స్తార‌ని చంద్ర‌బాబు సర్కారుకు తెలియ‌నిదేమీ కాదు.

మ‌రి అలాంట‌ప్పుడు ఓ బాధ్య‌త క‌లిగిన ప్ర‌భుత్వంగా అధికార యంత్రాంగాన్ని అప్ర‌మ‌త్తం చేయాల్సిన అవ‌స‌రం బాబు స‌ర్కారుకు లేదా? అంటే.. అస‌లు మొత్తం కుట్ర‌కు బాబు స‌ర్కారే కుట్ర చేస్తుంటే... ఇక అధికార యంత్రాంగాన్ని ఎలా అప్ర‌మ‌త్తం చేస్తుంద‌ని కొత్త ప్ర‌శ్న‌లు తెర‌పైకి వ‌స్తున్నాయి. జ‌గ‌న్‌కు వ‌స్తున్న జ‌నాద‌ర‌ణ‌న‌ను చూసి జ‌డిసిపోతున్న బాబు సర్కారు... ఎలాగైనా జ‌గ‌న్ యాత్ర‌కు బ్రేకులేయాల‌నే దిశ‌గా కుట్ర‌ను అమ‌లు చేస్తున్న‌ట్లుగా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. ఇందులో భాగంగానే జ‌గ‌న్ స‌భ‌ల‌కు అర‌కొర భ‌ద్ర‌త‌నే క‌ల్పించాల‌ని అధికార యంత్రాంగానికి బాబు స‌ర్కారు ఆదేశాలు జారీ చేసింద‌న్న కోణంలో వైసీపీ శ్రేణులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నాయి. జ‌గ‌న్ స‌భ‌లో ఒక‌వేళ‌ ఏదైనా చిన్న అపశృతి దొర్లితే దానికి బాధ్యత ఎవరిది? అరకొరగా భద్రత కల్పించిన ప్రభుత్వం ఏం ఆశిస్తోంది..? జగన్ కు ఏమైనా జరగాలని బాబు సర్కార్ కోరుకుంటోందా..? లేక లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలకు ఏమైనా నష్టం జరిగితే జగన్ పై ఆరోపణలు చేయడానికి దాన్ని వాడుకోవాలని చూస్తోందా..? అన్న దిశ‌గానూ ఇప్పుడు కొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి.
Tags:    

Similar News