దొరికేస్తారా : వదల అయ్యన్నా... నిన్నొదలా...?

Update: 2022-06-24 03:27 GMT
ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇంటికి మరోసారి పోలీసులు వచ్చారు. సరిగ్గా నాలుగు రోజుల క్రితం గుంటూరు నుంచి పోలీసులు వచ్చి వెళ్ళాక సీన్ మారింది. నిజానికి అయ్యన్నకు 41 నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయడానికి ఇప్పటికి చాలా సార్లు గుంటూరు నుంచి పోలీసులు వచ్చి వెళ్లారు.

ఆ టైమ్ లో  అయ్యన్నపాత్రుడు లేరని సమాధానం రావడంతో రోజల్లా వేచి ఉండి మరీ తిరిగివెళ్లారు. ఇక అది అలా ఉండగానే తాజాగా అయ్యన్నపాత్రుడు ఇంటి గోడను కూల్చితే అది  స్టేట్ వైడ్ ఇష్యూ అయింది. ఒక విధంగా వైసీపీ నేతల అతి ఉత్సాహం బూమరాంగ్ అయింది అన్న మాట కూడా వినిపించింది. బీసీల మీద వైసీపీ అటాక్ అని దానికి సామాజిక కలరింగ్ ఇచ్చి టీడీపీ రివర్స్ అటాక్ చేసింది.

ఆ విషయం అలా ఉండగానే ఇపుడు లేటెస్ట్ గా మరో విషయం చోటు చేసుకుంది. అయ్యన్నపాత్రుడు ఇంటికి విశాఖ  సిటీ  పోలీసులు తాజాగా వెళ్ళడంతో మళ్ళీ అంతా అలెర్ట్ కావాల్సిన పరిస్థితి నెలకొంది. అయ్యన్నపాత్రుడుకు  41 నోటిసులు ఇవ్వడానికి ఇంటికి రాగా మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటి వద్ద లేకపోవడంతో పోలీసులతో పాటు  సిబ్బంది వెనుతిరిగారు.

ఈ మధ్యనే చోడవరం మినీ మహానాడు సభలో అయ్యన్నపాత్రుడు ప్రభుత్వంపై పలు విమర్శలు చేయడంతో విశాఖ సిటీ పోలీసులు 41 నోటిసులు తో ఇవ్వడానికి ఇంటికి వచ్చారా అన్న చర్చ సాగుతోంది. ఏది ఏమైనా ఒక దాని తరువాత మరోటి అన్నట్లుగా అయ్యన్నను  టార్గెట్ చేసినట్లే అంతా అనిపిస్తోంది అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం అయ్యన్నను అనేక రకాలుగా ఇబ్బందులు  గురిచేయడానికి చూస్తోందని తమ్ముళ్ళు  అంటున్నారు.

ఇంతకీ విశాఖ సిటీ పోలీసులు నోటీసులు ఏ విషయంపై తీసుకువచ్చారు అనేది మాత్రం తెలియడంలేదు. అయితే అయ్యన్నపాత్రుడు కనబడితే మాత్రం అరెస్ట్ చేసేందుకే రంగం సిద్ధం చేశారు అని అంటున్నారు. ఎంతో మందిని చాలా సులువుగా అరెస్ట్ చేయగలిగిన ప్రభుత్వానికి అయ్యన్న మాత్రం దొరకకుండా తప్పించుకుంటున్నారు అన్నదైతే ఉంది అంటున్నారు.

అంతే కాదు అయ్యన్నపాత్రుడు అందరి కంటే ఎక్కువగా మరీ వ్యక్తిగతంగా జగన్ని విమర్శలు చేయడం, దారుణంగా మంత్రులను విమర్శించడం వంటి వాటితో వైసీపీ నేతలు ఆయనను అరెస్ట్ చేసి తీరాలని అంటున్నారు.

కానీ అయ్యన్న మాత్రం నాటౌట్ అనేస్తున్నారు. మరి ఈ రాజకీయ చెలగాటలో ఎవరిది గెలుపు అన్నది చూడాలి. ఏది ఏమైనా వదల అయ్యన్నా అని అవతల వైపు నుంచి పిలుపు గట్టిగానే వినిపిస్తోంది. నర్శీపట్నం వేదికగా మరిన్ని కొత్త ఎపిసోడ్స్ ని త్వర‌లో చూసే చాన్స్ అయితే ఏపీ జనాలకు ఉంది మరి.  దాని కోసం వెయిట్ అండ్ సీ.
Tags:    

Similar News