`ర‌క్తం కావాలా... పోలీసుల‌కు ఫోన్ చేయండి`

Update: 2017-10-22 05:50 GMT
ఏపీ పోలీస్ డీజీపీ నండూరి సాంబ‌శివ‌రావు.. సంచ‌ల‌న విష‌యం వెల్ల‌డించారు. ఇప్ప‌టి  వ‌ర‌కు పోలీసులంటే.. ఏ ప‌నిమీద వెళ్లినా.. బాధితుల ర‌క్తాన్ని పీలుస్తార‌ని - వారిని నానా తిప్ప‌లు పెడ‌తార‌ని - అయిందానికీ - కానిదానికీ కూడా వేధిస్తార‌ని ఉన్న అప‌వాదును పోగొట్టుకునేందుకు ఏపీ పోలీస్ శాఖ తీవ్రంగా కృషి చేస్తోంద‌ని ఆయ‌న చెప్పారు. ఈ క్ర‌మంలోనే తాము ర‌క్తం పీల్చ‌డం కాదు.. అవ‌స‌ర‌మైతే.. ర‌క్తం ఇచ్చి ఆదుకునేందుకు ప్రాణాలు నిల‌బెట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నామ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. శ‌నివారం ఏపీ రాజ‌ధాని ప్రాంతం మంగ‌ళ‌గిరిలోని డీజీపీ కార్యాల‌యంలో మీడియాతో ఆయ‌న ప్ర‌త్యేకంగా మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా పోలీసుల అమ‌ర వీరుల సంస్మ‌ర‌ణ దినం ప్ర‌త్యేకత‌ను వివ‌రించారు.

అనంత‌రం, మీడియా ప్ర‌శ్న‌ల‌కు కూడా స‌మాధానం చెప్పారు.  రాష్ట్రవ్యాప్తంగా వారం రోజులపాటు నిర్వహించిన రక్తదాన శిబిరాల్లో 7వేల 291 యూనిట్ల రక్తాన్ని ఏపీ పోలీసుల నుంచి సేకరించామన్నారు.  ఎవరికైనా  అత్యవరసర ప‌రిస్థితుల్లో రక్తం  అవసరమైతే సంబంధిత జిల్లా ఎస్పీ కార్యాలయాల్లో సంప్రదిస్తే  బాధితుల‌కు ర‌క్తాన్ని వారి వారి గ్రూపుల‌ను బ‌ట్టి ఇస్తామ‌ని చెప్పారు.  రోడ్డు ప్ర‌మాదాల్లో అనేక మంది స‌మ‌యానికి ర‌క్తం దొర‌క్క‌ - చికిత్సలు ఆల‌స్య‌మై కూడా ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న‌లు వంద‌ల్లో ఉంటున్నాయ‌ని, ఇక‌పై అలాంటి ప‌రిస్థితి రాష్ట్రంలో ఏ ఒక్క‌రికీ రాకూడ‌ద‌ని తాము నిర్ణ‌యించామ‌ని వ్య‌క్తులు సామాన్యులైనా ఏ స్థాయిలో ఉన్నా అంద‌రికీ ర‌క్తం అవ‌ర‌స‌మేన‌ని - దీనిని దృష్టిలో పెట్టుకుని పోలీసుల నుంచి ర‌క్తం సేక‌రించి భ‌ద్ర‌ప‌రిచామ‌ని చెప్పారు.

అత్య‌వ‌స‌ర కేసుల‌కు - ప్రాణాపాయ స్థితిలో ఉన్న‌వారికి తొలి ప్రాధాన్యం ఉంటుంద‌ని వెల్ల‌డించారు. ముఖ్యంగా ప్ర‌మాదాలు సంభ‌వించిన స‌మ‌యంలో వారికి అందించేలా ప్ర‌త్యేక ఏర్పాటు చేసిన‌ట్టు తెలిపారు. ఇక‌, పోలీసులందరికీ ఆరోగ్య భద్రత పథకం కింద ఏటా ఉచితంగా సమగ్ర వైద్య పరీక్షలు - చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఇక‌నుంచి పోలీసు సిబ్బందికి  రూ.30 లక్షల ఉచిత  ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు వెల్ల‌డించారు.  ఈ మేరకు ఎస్‌ బీఐ ఉన్నతాధికారులతో ఒప్పందం చేసుకున్న‌ట్టు డీజీపీ వివ‌రించారు. ఈ ప్ర‌క‌ట‌నతో దేశంలో పౌరుల‌కు ర‌క్తం స‌ర‌ఫ‌రా చేస్తున్న ఏకైక పోలీసులు ఏపీ వారేన‌నే కీర్తి త‌మ‌కు ల‌భిస్తుంద‌ని సాంబ‌శివ‌రావు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. డీజీపీ నిర్ణ‌యంపై సామాజిక వాదులు కూడా హ‌ర్షం వ్య‌క్తం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News