కొవ్వొత్తుల ప్ర‌ద‌ర్శ‌న‌కు వెళ్తే స‌మ‌స్య‌ల త‌ప్ప‌వ‌ట‌!

Update: 2017-01-26 11:07 GMT
ప్ర‌త్యేక హోదాపై శాంతియుతంగా నిర‌స‌న తెలిపేందుకు ఆంధ్రా యువ‌త‌రం విశాఖ‌లో కార్యక్ర‌మాన్ని త‌ల‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఈ కార్య‌క్ర‌మానికి అడుగ‌డుగునా ఆంక్ష‌లు పెడుతున్నారు. ఇప్ప‌టికే విశాఖ సాగ‌ర తీర‌మంతా పోలీసుల కంట్రోల్ లోకి వ‌చ్చేసింది. బీచ్ రోడ్డులో వెళ్లేందుకు ఎవ్వ‌రికీ అనుమ‌తులు ఇవ్వ‌డం లేదు. అయితే, ఇంకోప‌క్క కొవ్వొత్తుల ప్ర‌ద‌ర్శ‌న కోసం త‌ర‌లి వ‌స్తున్న యువ‌త‌ను ఎక్క‌డిక‌క్క‌డ పోలీసులు నిర్బంధిస్తున్నారు. ఇప్ప‌టికే, కొంత‌మందిని అదుపులోకి తీసుకున్న‌ట్టు స‌మాచారం! ఈ కార్య‌క్ర‌మంలోకి సంఘ విద్రోహ శ‌క్తులు చొర‌బ‌డే ఆస్కారం ఉందంటూ విద్యార్థుల‌ను చెద‌ర‌గొట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

పోలీసుల ఆంక్ష‌లు ఇలా ఉంటే... విశాఖ‌లోని ప‌లు విద్యాసంస్థ‌లు కూడా త‌మ విద్యార్థుల‌కు ఆదేశాల‌ను జారీ చేశాయి. బీచ్ రోడ్డులో జ‌రుగుతున్న కొవ్వొత్తుల ప్ర‌ద‌ర్శ‌న‌కు ఎవ్వ‌రూ వెళ్ల‌కూడ‌దంటూ ఆదేశించాయి. అంతేకాదు, విద్యార్థుల త‌ల్లిదండ్రుల‌కు కూడా సందేశాలు పంపాయి. ఈ కార్య‌క్ర‌మాల్లో ఎవ‌రైనా పాల్గొన్న‌ట్టు త‌మ దృష్టికి వ‌స్తే త‌దుప‌రి చ‌ర్య‌లు ఉంటాయంటూ హెచ్చ‌రిక‌లు జారీ చేయ‌డం విశేషం! విశాఖ‌లోని గీత‌మ్ యూనివ‌ర్శిటీ త‌మ స్టూడెంట్స్ కి ఈ త‌ర‌హా సందేశాలే ఇచ్చింది. సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న పిలుపుల‌కు స్పందించవ‌ద్ద‌నీ, ఈ నిర‌స‌న‌లో సంఘ విద్రోహ శ‌క్తులు ఉన్నాయంటూ చెబుతున్నారు. గీత‌మ్ విద్యార్థులు ఆర్కే బీచ్ వైపు వెళ్లొదంటూ యూనివ‌ర్శిటీ రిజిస్ట్రార్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

గీత‌మ్స్ బాట‌లోనే ఇత‌ర విద్యా సంస్థ‌లు కూడా పోలీసుల ఆదేశాల‌ను పాటించాలంటూ త‌మ స్టూడెంట్స్ కి చెబుతున్నాయి. సంఘ విద్రోహ శ‌క్తుల‌ను అణ‌చివేసేందుకు తెలుగుదేశం ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంద‌నీ, వారికి స‌హ‌క‌రించాల‌ని కోరుతున్నారు! ఇంకోప‌క్క ఆంధ్రా యూనివ‌ర్శిటీకి చెందిన కొన్ని విద్యార్థి సంస్థ‌ల నాయ‌కుల్ని పోలీసులు ఇప్ప‌టికే అదుపులోకి తీసుకున్న‌ట్టు స‌మాచారం. విశాఖ‌తోపాటు రాష్ట్రంలోని ఇత‌ర ప్రాంతాల్లో ఉన్న విద్యార్థి సంస్థ‌లన్నింటిపైనా పోలీసు శాఖ నిఘా నేత్రం పెట్టింద‌నీ, త‌దుప‌రి చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌నే సంకేతాలు ఇస్తున్న‌ట్టు తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News