పాక్ లో రాజకీయ సంక్షోభం.. లంకలో ఆర్థిక సంక్షోభం.. 14 గంటల పాటే కరెంటు

Update: 2022-03-31 01:30 GMT
పర్యాటకానికి ప్రసిద్ధిగాంచిన బుల్లి శ్రీలంక ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతోంది. నిత్యవసరాలకు కటకట.. హాస్పిటళ్లలో మందులు లేవు.. పెట్రోలు నిప్పంటించకుండానే భగ్గుమంటోంది.. ఎక్కడచూసినా కిలోమీటర్ల బారులు.. ఈ ప్రభావం విద్యుత్తు రంగంపైనా పడింది రోజుకు 10 గంటల పాటు కరెంట్‌ కోత అమలవుతోంది. అంటే.. లంకేయులకు రోజులో 14 గంటలే కరెంటు అందుతోందన్న మాట.  దీంతో ప్రజలు చీకట్లో మగ్గుతున్నారు.

ఆహార, ఆర్థిక సంక్షోభంతో సింహళ దేళం అల్లాడిపోతోంది. విదేశీ మారక నిల్వలు గణనీయంగా పడిపోవడంతో కీలక దిగుమతులు నిలిచిపోయాయి. త్యవసరాలు, నిత్యావసరాలు.. ఇలా అన్నింటా కొరత ఏర్పడింది. ఇంధన కొరతతో  లంకలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో కోతల సమయాన్ని మరింత పెంచుతూ లంక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం రోజుకు 7 గంటల పాటు కరెంట్‌ సరఫరా నిలిపివేస్తుండగా.. బుధవారం నుంచి దాన్ని 10 గంటలకు పొడగిస్తున్నట్లు ప్రకటించింది. అంటే దేశవ్యాప్తంగా రోజుకు 10 గంటల పాటు కరెంట్‌ కోతలు ఉండనున్నాయి. ఇంధనం సరిపడా లేక హైడ్రో ఎలక్ట్రిసిటీ కొరత ఏర్పడింది. భారత్‌ సహకారంతో డీజిల్‌ను దిగుమతి చేసుకుంటున్నప్పటికీ అది అత్యవసర సేవలు, పవర్‌ స్టేషన్లకే సరిపోతుందని శ్రీలంక విద్యుత్‌ శాఖ మంత్రి వెల్లడించారు.

విద్యుత్‌ కోతల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో వీధి దీపాలు వెలగక అనేక నగరాలు అంధకారంగా కన్పిస్తున్నాయి. రెస్టారెంట్లు, వీధి వ్యాపారులు క్యాండిల్‌ వెలుతురులో వ్యాపారాలు సాగిస్తున్నారు.ఆస్పత్రుల్లో శస్త్రచికిత్సలు వాయిదా గుర్తుందా.. ఇటీవలి కాలంలో కొవిడ్ రోగులకు సేవలందించేందుకు జర్మనీ వంటి దేశాల్లో అత్యవసర శస్త్రచికిత్సలు మాత్రమే చేశారు. ఇప్పుడలాంటి పరిస్థితే విద్యత్తు సంక్షోభంతో లంకలో తలెత్తింది. అత్యవసర ఔషధాల నుంచి సిమెంట్‌ వరకూ అన్ని వస్తువుల కొరత ఏర్పడింది.

ఆసుపత్రుల్లో మందులు లేక సాధారణ శస్త్రచికిత్సలను వాయిదా వేయాల్సిన పరిస్థితి నెలకొంది. అటు ఇంధన కొరత కారణంగా రవాణా సదుపాయాలు నిలిచిపోయాయి. పేపర్‌ కొరతతో విద్యా సంస్థలు అన్ని రకాల పరీక్షలను వాయిదా వేశాయి. పెట్రోల్‌తో పాటు కూరగాయాల కోసం కూడా ప్రజలు బారులు తీరాల్సిన స్థితి ఎదురైంది. గంటల తరబడి క్యూలైన్‌లో నిల్చుని కొందరు స్పృహ కోల్పోతుండగా.. ఇప్పటివరకు ముగ్గురు మరణించినట్లు తెలిసింది. ఏడు దశాబ్దాల్లో ఇటువంటి సంక్షోభ పరిస్థితులను చవిచూడలేదని లంకేయులు ఆవేదన వ్యక్తం చేశారు. పలు చోట్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి.

లంకలో ఎందుకీ పరిస్థితి..పర్యాటక దేశంగా పేరొందిన శ్రీలంకలో 2019లో ఈస్టర్‌ పండగ నాడు ఓ చర్చిలో ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటన ఆ దేశ పర్యాటక రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. దీంతో విదేశీ మారక నిల్వలు పడిపోయాయి. ఆ తర్వాత కరోనా మహమ్మారి ప్రభావంతో పాటు ప్రభుత్వం తీసుకున్న కొన్ని అనాలోచిత నిర్ణయాలు ఆ దేశాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేశాయి. విదేశీ మారక నిల్వలు పడిపోవడంతో దిగుమతులపై నిషేధం విధించారు. ఫలితంగా చమురు, నిత్యావసరాల కొరత ఏర్పడి వాటి ధరలు ఆకాశాన్నంటాయి.
Tags:    

Similar News