కోమ‌టి రెడ్డి వ‌ర్సెస్ కోమ‌టి రెడ్డి.. యుద్ధం త‌ప్పదా..?

Update: 2022-07-25 15:30 GMT
కోమ‌టి రెడ్డి సోద‌రుల మ‌ధ్య రాజ‌కీయ పోరు త‌ప్ప‌దా..? అన్న ఎదుగుద‌ల‌కు త‌మ్ముడే ఆటంకం అవుతున్నారా..? చాలా రోజులుగా వీరి మ‌ధ్య స‌ఖ్య‌త లేదా..? త‌మ్ముడి రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్య‌మైతే అన్న ఎదురుదిర‌గ‌క త‌ప్పదా..? త‌మ్ముడిపై అన్న‌నే ఆయుధంగా వాడాల‌ని ఏఐసీసీ భావిస్తోందా..? అంటే పార్టీ వ‌ర్గాలు అవున‌నే చెబుతున్నాయి.

త‌న అన్న ద్వారానే రాజ‌కీయాల్లో ఓన‌మాలు నేర్చుకున్న రాజ‌గోపాల‌రెడ్డి ఇపుడు అన్న‌కే ఎస‌రు పెట్టేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆయ‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తే వ‌చ్చే ఉప ఎన్నిక బాధ్య‌త‌ను కోమ‌టి రెడ్డిపైనే పెట్టాల‌ని అధిష్ఠానం ఆలోచ‌న‌గా ఉంద‌ట‌. త‌న త‌మ్ముడి ప్ర‌వ‌ర్త‌న‌తో వెంక‌ట‌రెడ్డి తొలిసారి ఇర‌కాటంలో ప‌డిన‌ట్లు అయింది. అధిష్ఠానం క‌నుక అదే నిర్ణ‌యం తీసుకుంటే అన్న‌కు చావో రేవో త‌ప్ప‌దు.

ఎందుకంటే పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌విని ఆశించిన వ్య‌క్తి.. ప్ర‌స్తుతం స్టార్ క్యాంపెయిన‌ర్ హోదాలో ఉన్న వ్య‌క్తి.. కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే కీల‌క ప‌ద‌విని ఆశిస్తున్న వ్య‌క్తి ఉప ఎన్నిక‌ను ఆషామాషీగా తీసుకోవ‌డానికి వీలు లేదు. త‌మ్ముడు త‌మ్ముడే పేకాట పేకాటే మాదిరిగా క‌ద‌న రంగంలో క‌త్తి తిప్పాల్సిందే. అభ్య‌ర్థి ఎంపిక‌.. ప్ర‌చారం.. గెలుపు బాధ్య‌త‌లు త‌న నెత్తిపైనే ప‌డే అవ‌కాశం ఉంది. దీంతో కోమ‌టి రెడ్డి వెంక‌ట రెడ్డి తొలిసారి మ‌ధ‌న‌ప‌డుతున్న‌ట్లుగా తెలుస్తోంది.

త‌న‌కు పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి రాక‌పోవ‌డానికి కార‌ణం కూడా త‌మ్ముడి ప్ర‌వ‌ర్త‌న‌.. అధిష్ఠానం దూత‌ల‌పై అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌ల ఫ‌లిత‌మేన‌నే అనుమానాలు ఇప్ప‌టికీ వెంక‌ట‌రెడ్డిని వెంటాడుతున్నాయి. ఆ చికాకులో భాగంగానే రేవంతుపై కోమ‌టి రెడ్డి కూడా అస‌మ్మ‌తి గ‌ళం వినిపించారు. ఇపుడు త‌న త‌మ్ముడి రాజీనామా ఆప‌లేక‌పోతే అది త‌న మెడ‌కే చుట్టుకొనే ప్ర‌మాదం ఉంది. ఎందుకంటే న‌ల్లగొండ అంటే కాంగ్రెస్‌.. కాంగ్రెస్ అంటే న‌ల్ల‌గొండ అనే భావ‌న ఇన్నాళ్లూ పార్టీలో ఉంది.

ఇపుడు తొలిసారిగా తమ కంచుకోట‌లోకి బీజేపీ అడుగుపెడితే అది త‌మ‌కే చేటు. అదీ త‌న త‌మ్ముడి రూపంలో వ‌స్తుండ‌డం మ‌రీ ప్ర‌మాద‌క‌రం. దీనికి కోమ‌టి రెడ్డి దూరంగానూ పారిపోయే వీలు లేదు. అందుకే బీజేపీని ఆపాలంటే త‌న త‌మ్ముడినే ఎదుర్కోవాల్సి ఉంటుంది. త‌న 35 ఏళ్ల‌ రాజ‌కీయ జీవితాన్ని ఫ‌ణంగా పెట్టి బీజేపీకి, టీఆర్ఎస్ కు అడ్డుక‌ట్ట వేయాల్సిందే. లేదంటే బీజేపీ త‌మ‌ను కూడా మింగేసే అవ‌కాశం లేక‌పోలేదు.

ఒక‌వేళ మునుగోడులో క‌నుక ఉప ఎన్నిక అనివార్య‌మైతే ఏఐసీసీ న‌ల్ల‌గొండ జిల్లా కీల‌క నేత‌లంద‌రినీ స‌మాయ‌త్తం చేయాల‌ని యోచిస్తోంది. కోమ‌టి రెడ్డి వెంక‌ట రెడ్డితో పాటు మాజీ మంత్రులు ఉత్త‌మ్‌, దామోద‌ర్ రెడ్డి, జానారెడ్డి త‌దిత‌ర సీనియ‌ర్ల‌కు త‌లా ఒక మండ‌ల బాధ్య‌త‌ను క‌ట్ట‌బెట్టాల‌ని.. ఎలాగైనా త‌మ కంచుకోట‌ను తిరిగి నిల‌బెట్టుకోవాల‌ని ప‌ట్టుద‌ల‌గా ఉంద‌ట‌. టీపీసీసీ సూచ‌న మేర‌కు ఏఐసీసీ ఆ దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్లు తెలుస్తోంది. చూడాలి మ‌రి కోమ‌టి రెడ్డి వెంక‌ట రెడ్డి ఎలా స్పందిస్తారో..!
Tags:    

Similar News