ఏపీలో పొలిటికల్ హీట్ : ఆ సామాజిక వర్గాలు ఎటు....?

Update: 2022-08-21 01:30 GMT
ఏపీలో అధికార వైసీపీకి ఎన్నికల ఫీవర్ పట్టుకుంది. తానుగా సర్వేలు చేయించుకుంటోంది. మరో వైపు జాతీయ సర్వేలు కూడా వస్తున్నాయి. ఏ సర్వే చూసినా కొంతవరకే జనాభిప్రాయాన్ని చెబుతాయి. అవి పూర్తిగా నిజాలు కాదు, అలాగని అబద్దాలు అని కూడా భావించాల్సినది లేదు. జస్ట్ పరిస్థితి ఇలా ఉంది అని మాత్రమే సర్వేలు చెబుతాయి. వాటిని అనుసరించి దిద్దుకోవాల్సింది పార్టీలే మరి.

అధికార వైసీపీ విషయానికి వస్తే 2019 నాటి ఊపు అయితే 2024లో ఉండదు అని సొంత పార్టీ వారి విశ్లేషణలే ఉన్నాయి. జగన్ సీఎం కావాలి అని అన్ని వర్గాలు ఓటేశాయి. అలాగే ఉద్యోగ వర్గాలు, కార్మికులు, రైతులు, మహిళలు కూడా జగన్ కి ఓటెత్తారు. ఎస్సీస్, ఎస్టీస్,   బీసీలు, మైనారిటీలు, కాపుల్లో కూడా జగన్ సీఎం కావాలని నాడు చూశారు. ఇలా అన్ని వర్గాల మద్దతు బలంగా ఉండడం వల్లనే జగన్ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోగలిగారు.

అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక గత మూడేళ్ళలో  కొన్ని  సామాజికవర్గాల పరంగా దూరమే జరిగాయని చెబుతున్నారు. అలా కనుక చూస్తే ఫస్ట్ గా కమ్మలు దూరం అయ్యారనే చెప్పాలి.  అమరావతి రాజధాని ఇష్యూ తో పాటు కమ్మలను టార్గెట్ చేస్తూ వైసీపీ వారు వరసబెట్టి చేస్తూ వచ్చిన హాట్ హాట్ కామెంట్స్ వల్ల కూడా వారు దూరం జరిగారు అని అంటున్నారు.
నిజానికి 2019 గణాంకాలు తీస్తే క్రిష్ణా, గుంటూరు జిల్లాలలో కమ్మలు వైసీపీకే ఎక్కువగా ఓటేశారు అని తేలుతుంది. చంద్రబాబు సీఎం గా ఉన్నా కూడా  మొత్తం కమ్మ సామాజికవర్గానికి చేసిన మేలు పెద్దగా లేదని భావించిన వారు జగన్ ని సీఎం చేసుకోవడం ద్వారా తాము బాగుపడాలనుకున్నారు.

కానీ కమ్మలు అంటే టోటల్ టీడీపీ అన్న రాంగ్ కాన్సెప్ట్ తో వైసీపీ వారి మద్దతు చేజేతులా దూరం చేసుకుందని చెబుతారు.  దాంతో ఈసారి క్రిష్ణా గుంటూరు జిల్లాలే కాకుండా పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలలో కూడా కమ్మల దెబ్బ వైసీపీ రుచి చూడనుంది అంటున్నారు. ఇక బ్రాహ్మణులు, వైశ్యులు కూడా వైసీపీకి 2019 ఎన్నికల్లో ఓటేసారు. అయితే వారి విషయంలో కూడా ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించలేదు అని విమర్శలు ఉన్నాయి.

చంద్రబాబుని బ్రాహ్మణ ద్వేషిగా చెబుతారు. కానీ ఆయన ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు ఇవ్వకపోయినా బ్రాహ్మణ కార్పోరేషన్ పెట్టి ఆ సామాజికవర్గంలోని పేదలకు న్యాయం చేయగలిగారు. ఆర్ధికంగా వారు ఎంతో కొంత బాగుపడ్డారు. అలాంటి కార్పోరేషన్ని మరింతగా అభివృద్ధి చేసి జగన్ బ్రాహ్మణులకు మరింత ప్రాధాన్యత  అన్ని విధాలుగా ఇస్తారు అనుకుంటే కార్పోరేషన్ని నిర్వీర్యం చేశారు. అలాగే బ్రాహ్మణులకు రాజకీయంగా ప్రాముఖ్యత ఇస్తామని చెప్పి అయిదేళ్ళలో ఒక్క మంత్రి కూడా ఇవ్వలేదు, నామినేటెడ్ పదవులు కూడా ఇవ్వలేదు  అన్న బాధ ఉంది.

ఇక వైశ్యులను తీసుకుంటే వారి విషయంలో కూడా వైసీపీ సర్కార్ అనుకున్న విధంగా వ్యవహరించలేదు అన్న బాధ ఉంది. తొలి మంత్రివర్గంలో వైశ్యులకు ప్రాధాన్యత ఇచ్చారు. కానీ మలి విడతలో సున్నా చుట్టేరు. అలాగే వారికి నామినేటెడ్ పదవుల విషయంలో ప్రాధాన్యత లేదు. క్ష‌త్రియుల తీరు కూడా అలాగే ఉంది. వారికి మంత్రి పదవులు రెండవ విడతలో దక్కలేదు. ఇక క్ష‌త్రియ సామాజికవర్గంలో ఉన్న అశోక్ గజపతి రాజు లాంటి వారి మాన్సాస్ వ్యవహారంలో వైసీపీ పెద్దలు  వేలూ కాలూ పెట్టడం ద్వారా ఆ సామాజికవర్గానికి  దూరం అయ్యారని అంటున్నారు.

ఇక కాపుల విషయం తీసుకుంటే వారు 2019 ఎన్నికల వేళ  వైసీపీకి దగ్గర అయ్యారు కానీ పవన్ని అదే పనిగా విమర్శించడం ద్వరా తమ సొంత కులం వారిని విమర్శించారు అన్న ఆవేదనతో దూరం అవుతున్నారు. అలాగే కాపు కార్పోరేషన్ కి నిధులు ఇవ్వలేదన్న బాధ ఉంది. కాపుల రిజర్వేషన్ విషయంలో కూడా వైసీపీ నో చెప్పడం కూడా ఇపుడు చర్చకు వస్తోంది మరి.

ఇలా కీలకమైన సామాజికవర్గాలు వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఎంతో కొంత దూరం అవుతాయని అంటున్నారు. మరి వీరిని దగ్గరకు చేర్చుకునే మార్గాలు అయితే ఈ రోజుకీ వైసీపీకి ఉన్నాయి. ఎన్నికలకు ఇంకా రెండేళ్ళ వ్యవధి ఉన్నందువల్ల వారిలో ఉన్న అసంతృప్తిని దూరం చేసి తమ వైపునకు తిప్పుకుంటే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుందని అంటున్నారు.

 మరి వైసీపీ అయితే కమ్మలను టీడీపీ గాటకు కడుతోంది. బ్రాహ్మణ వైశ్య, క్షత్రియ వర్గాలని బీజేపీ వైపు ఉన్నఓటు బ్యాంక్
అన్నట్లుగా చూస్తోంది. కాపులు అంటే జనసేన వైపు వెళ్ళిపోతారని ముందే డిసైడ్ అయిపోతోంది. ఇలా అందరినీ వదులుకుంటే వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఫ్యాన్ గిర్రున‌ తిరిగేనా అంటే జవాబు ఆలోచించాల్సిందే మరి.
Tags:    

Similar News