నాన్నా.. నేనెప్పుడు సీఎం అవుతాను?

Update: 2016-05-21 08:08 GMT
 అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో అంతా ఓట్లు సీట్లు.. అధికారం నిలబెట్టుకోవడం - కోల్పోవడంపైనే చర్చించుకుంటున్నారు. అయితే... అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితల్లో కీలక పరిణామం ఒకటి చోటుచేసుకుంది.  ఆయా రాష్ట్రాల్లో - తద్వారా జాతీయ రాజకీయాల్లోనూ భవిష్యత్ తారలు కాదలచిన వారసులకు ఈ ఫలితాలు శరాఘాతమయ్యాయనే చెప్పాలి. తమ రాజకీయ భవిష్యత్తు కీలక మెట్టుకు చేరడానికి ఈ ఎన్నికలు ఉపయోగపడతాయని భావించినా తీవ్ర నిరాశే ఎదురైంది వారికి.

తమిళనాడులో అంతా అనుకున్నట్లు జరిగి ఉంటే డీఎంకే అధినేత కరుణానిధి తన అధికార దండాన్ని కుమారుడు స్టాలిన్ కు అప్పగించేవారేమో. కానీ... దశాబ్దాల ప్రజాతీర్పు సాంప్రదాయానికి భిన్నంగా ఈసారి అమ్మ జయలలిత కు రెండోసారి పట్టం కట్టడంతో స్టాలిన్ ఆశలపై నీళ్లు చిలకరించినట్లయింది. గెలిస్తే తానే సీఎంనని కరుణ చెప్పినా కూడా అది ఎన్నికలకు వెళ్లేందుకు వ్యూహాత్మకంగా చెప్పిందేకావొచ్చు.. లేదంటే కొద్దిరోజులుగా సీఎంగా ఉండి ఆ తరువాత స్టాలిన్ కు అప్పగించాలన్న ఆలోచనా చేసి ఉండొచ్చు. కరుణ వయసు 93 ఏళ్లు... చక్రాల కుర్చీలో మాత్రమే కదలగలరు.. అలాంటి పరిస్థితుల్లో స్టాలిన్ కు అధికారం అప్పగించడం గ్యారంటీగాజరిగి ఉండేది. కానీ, డీఎంకే ఓటమి స్టాలిన్ రాజకీయ ప్రమోషన్ ను ఇంకా ఆలస్యం చేసినట్లయింది.

ఇక అస్సాం విషయానికొస్తే... అక్కడ కూడా తరుణ్ గొగోయి తన రాజకీయ వారసత్వాన్ని కుమారుడు గౌరవ్ గొగోయికి అప్పగించాలనుకున్నారు. కానీ... అక్కడ ఓటమి పాలవడంతో గౌరవ్ ఆశలు ఆవిరయ్యాయి.

అయితే... తమిళనాడు - అస్సాంలలో ఫలితాలు అక్కడి ఇద్దరు యువ నేతల భవిష్యత్తును దెబ్బతీయగా ఆ ఫలితాల ప్రభావంతో ఢిల్లీలో కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ అవకాశాలనూ దెబ్బతీశాయి. అస్సాం - కేరళలలో కాంగ్రెస్ దెబ్బతినడం.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సంఖ్య నానాటికీ తగ్గిపోతుండడంతో రాహుల్ గాంధీ భవిష్యత్తుపైనా నీలి నీడలు కమ్ముకుంటున్నాయి.
Tags:    

Similar News