నేత‌ల్ని తిట్టాలా? బాహుబ‌లి సినిమా చూస్తే స‌రి!

Update: 2019-04-02 08:43 GMT
ఒక దేశ ప్ర‌ధాని ఒక సినిమాలోని విల‌న్స్ పాత్ర‌ల్ని ప్ర‌స్తావిస్తూ విమ‌ర్శ‌లు చేస్తారా?  ఒక ప్ర‌ధాన‌మంత్రిని.. ఒక ముఖ్య‌మంత్రిని సినిమాలోని విల‌న్స్ పేర్ల‌తో విరుచుకుప‌డ‌టం విన్నామా?  చూశామా?   కానీ.. ఇవ‌న్నీ ఇప్పుడు తెర మీద‌కు వ‌చ్చాయి. ఏ ముహుర్తంలో రాజ‌మౌళి బాహుబ‌లి సినిమా తీశారో కానీ.. తెలుగు వారికి మాత్ర‌మే కాదు.. దేశ ప్ర‌జ‌ల‌కు సైతం సినిమాలోని విల‌నిజానికి నిలువెత్తు పాత్ర‌లుగా మారారు.

ఒక‌ప్పుడు రాజ‌కీయ నేత‌లు ఎవ‌రినైనా తిట్టాల‌న్నా.. విమ‌ర్శ‌లు చేయాల‌న్నా పుర‌ణాల్లోని రావ‌ణాసురుడు.. కంసుడు.. దుర్యోధ‌నుడు.. దుశ్శాస‌నుడు లాంటి పేర్ల‌ను వాడేవారు. ఇప్పుడు అవ‌న్నీ అవుట్ డేటెట్ అయ్యాయి. ఇప్పుడు బాహుబ‌లి సినిమాలోని ప్ర‌తినాయ‌కుల పాత్ర‌లైనా బిజ్జాల దేవుడు.. భ‌ల్లాల దేవుడు లాంటి పేర్లు తెర మీద‌కు వ‌చ్చాయి. విధేయ‌త‌కు క‌ట్ట‌ప్ప కేరాఫ్ అడ్ర‌స్ గా మారితే.. రాజ్య ర‌క్ష‌ణ‌కు బాహుబ‌లి పేరు అంద‌రి నోళ్ల‌ల్లో నానుతోంది. సోమ‌వారం రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వ‌హించిన భారీ స‌భ‌ల్లో పాల్గొన్న మోడీ.. చంద్ర‌బాబు.. కేసీఆర్ లు త‌మ ప్ర‌సంగాల్లో బాహుబ‌లి సినిమాలోని పాత్ర‌ల్ని ప్ర‌స్తావించ‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

అంతేనా.. లోకేశ్ ట్విట్ట‌ర్ లోనూ బాహుబ‌లిలోని విల‌నీ పాత్ర‌ల్ని ప్ర‌స్తావిస్తూ.. త‌మ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌పై విరుచుకుప‌డ్డారు. హీరోయిజానికి ప్ర‌తీక‌గా బాహుబ‌లి నిలుస్తుంటే.. కుట్ర‌ల‌కు.. కుతంత్రాల‌కు..రాజ్యాన్ని  భ్ర‌ష్టు ప‌ట్టిస్తున్నార‌న్న విమ‌ర్శ‌ల‌కు తోడుగా భ‌ళ్లాల దేవుడు.. బిజ్జుల దేవుడంటూ మండిప‌డుతున్నారు. మాట‌ల్లోనే కాదు.. ఫ్లెక్సీల‌లోనూ బాహుబ‌లి పాత్ర‌ల్ని ప్ర‌స్తావిస్తున్నారు. స్థానిక నేత‌ల త‌ల‌ల్ని జోడించి బాహుబ‌లి పోస్ట‌ర్ల‌ను ఏర్పాటు చేయ‌టం ప‌లుచోట్ల క‌నిపిస్తోంది.

నువ్వు భ‌ళ్లాల దేవుడివి అంటే.. నువ్వు బిజ్జ‌ల దేవుడివి అంటూ కౌంట‌ర్ అటాక్ చేస్తున్నారు.  రాజ‌మండ్రి స‌భ‌లో ప్ర‌ధాని మోడీ మాట్లాడుతూ.. పోల‌వ‌రం ప్రాజెక్టును ఏపీ స‌ర్కారు ఏటీఎంలా వాడుతుంద‌ని.. చంద్ర‌బాబును భ‌ళ్లాల దేవుడంటూ మండిప‌డ్డారు. దీనికి రివ‌ర్స్ అటాక్ చేసిన చంద్ర‌బాబు జ‌గ‌న్ ను భ‌ళ్లాల దేవుడిగా పోల్చ‌ట‌మే కాదు.. కుట్ర‌లు కుతంత్రాలు చేసే మోడీ బిజ్జ‌ల దేవుడంటూ రివ‌ర్స్ అటాక్ చేశారు. ఇలా ఏపీ.. తెలంగాణ‌తో పాటు దేశ రాజ‌కీయాల్లోనూ బాహుబ‌లి పాత్ర‌ల్ని పోలుస్తూ నేత‌లు తిట్టేసుకుంటున్నారు.
Tags:    

Similar News