ఏపీ ప్ర‌జ‌ల ఓపిక‌కు మెచ్చుకోవాలి

Update: 2016-11-07 17:30 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో ఇపుడేమీ ఎన్నిక‌లు లేవు. ఎమ్మెల్సీ, ఎంపీ ఎన్నిక‌ల‌కు ఇంకా రెండున్న‌రేళ్ల‌ స‌మ‌యం ఉంది. త్వ‌ర‌లో జ‌రుగుతాయ‌నుకుంటున్న పుర‌పాల‌క ఎన్నిక‌ల‌పై క్లారిటీ లేదు. ఇక ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ పోరు వ‌చ్చే ఏడాది ఉంది. అయితే ఏపీలో మాత్రం వెంట‌నే ఎన్నిక‌లు ఉన్న‌ట్లు అధికార‌-ప్ర‌తిప‌క్షాలు ర‌చ్చ చేస్తున్నాయి.  ప్రభుత్వం విఫలమైందంటూ ప్రధాన ప్రతిపక్షం ఐదు నెలల క్రితమే గడపగడపకూ వైకాపా పేరిట పాదయాత్రలు చేపట్టింది. ఇక అధికార తెలుగుదేశం కూడా ఈ నెల 1వ తేదీ నుంచి జనచైతన్య యాత్రలు ప్రారంభించింది. సీపీఎం నియోజక వర్గాల వారీగా పాదయాత్రలు చేపట్టింది. సీపీఐ జీపు యాత్ర ప్రారంభించింది. ఈ యాత్రలలో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తుంటే… అధికార పక్షం తన విజయాలను ఏకరవు పెడుతున్నది. ఏది నమ్మాలో తెలియక జనం సతమతమవుతున్న ప‌రిస్థితితో పాటు ఎందుకీ అత్యుత్సాహం అనే భావ‌న కూడా వినిపిస్తోంది.

రాజ‌కీయ పార్టీలుగా ప్ర‌జ‌ల‌కు చేరువ కావ‌డం త‌ప్ప‌నిస‌రి.  ఇందుకు అనేక రూపాలు ఉన్నాయి. అయితే  ఆంధ్ర‌ప్రదేశ్
రాష్ట్రంలో యాత్రలు హోరెత్తిపోతున్నాయి. అధికార - విపక్షపార్టీ లన్నీ యాత్రల్తో ప్రజల్ని సతమతం చేస్తున్నాయి. దాదా పు ఐదుమాసాల క్రితమే ప్రధాన ప్రతిపక్షం గడప గడపకు వైకాపా అంటూ పాదాయాత్రల కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఏకంగా 150రోజుల సుదీర్ఘ షెడ్యూల్‌ తో రాష్ట్రంలోని 175నియోజకవర్గాల పరిధిలోని అన్ని ఇళ్ళను ఖచ్చితంగా చుట్టి వచ్చే విధంగా ఆ పార్టీ ఈ కార్య క్రమాన్ని రూపుదిద్దింది. ఇందులోభాగంగా వైకాపా ఇన్‌చార్జిలు, నాయకులు ఇంటింటికి తిరిగి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగడుతున్నారు. ముఖ్యంగా హోదా సాధించుకోలేక పోయిన పాలకపక్ష అసమర్ధతను విడమర్చిచెబుతున్నారు. కేసుల్నుంచి బయటపడేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రం ముందు తలొంచి ప్యాకేజీకి సమ్మతించారన్న విమర్శలు గుప్పిస్తున్నారు. అన్నిరంగాల్లోనూ ప్రభుత్వ వైఫల్యాల్ని గుచ్చిగుచ్చి చెబుతున్నారు. వైఎస్‌ పాలనాకాలం నాటి పరిస్థితులపై ప్రస్తుత పాలక విధానాల్ని బేరీజు వేసి చూపిస్తున్నారు. వైకాపా ఈ యాత్రలో ప్రధానంగా హోదా అంశాన్నే లక్ష్యంగా చేసుకుంది. ప్యాకేజీ వల్లే ప్రయోజనాలంటూ ప్రజల్ని మభ్యపెట్టేందుకు కేంద్రంతో కలసి పాలకపక్షం కుట్రలకు పాల్పడుతోందంటూ వివరిస్తోంది. హోదా వల్ల ఒనగూరే ప్రయోజనాలు, ప్యాకేజీ వల్ల కలిగే పరిధికి లాభాల మధ్య వ్యత్యాసాన్ని పూసగుచ్చినట్లు బోధిస్తోంది. ఇప్పటికే వైకాపా ఈ ప్రయత్నంలో సఫలమైంది. ప్రజల్లో హోదా ఆకాంక్ష నిర్వీర్యం కాకుండా దాన్ని సజీవంగా ఉంచగలిగింది. అలాగే ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ వైకాపా నాయకులు ప్రజల మధ్యే తిరుగుతున్నారన్న ప్రచారాన్నివ్వడంలో కూడా సఫలమైంది.

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన వైసీపీ చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల‌తో పాటు స‌హ‌జంగా ఉండే రాజ‌కీయాల కోణంలో తెలుగుదేశం పార్టీ కూడా క్షేత్ర‌స్థాయిలోకి వెళ్లేందుకు సిద్ధమైంది. ఈ నెల 1వ తేదీ నుంచి నెలరోజుల పాటు జనచైతన్య యాత్రలకు అధికార పార్టీ శ్రీకారం చుట్టింది. ఎమ్మెల్యేలు - మంత్రులు - ఎంపీలు - ఎమ్మెల్సీలు - పార్టీ నాయకులు అట్టహాసంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అసలే వీటి పర్యవేక్షణ బాధ్యతను పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ కు అప్పగించడంతో ఏ ఒక్కరూ గైర్హాజరయ్యేందుకు సాహసించడంలేదు. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు - నాయకులంతా విధిగా వీధుల్లో తిరుగుతున్నారు. తమ ప్రభుత్వం సాధించిన విజయాల్ని వివరిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ యాత్రలో పాల్గొంటున్నారు. ఓ వైపు పార్టీ ప్రచారం చేస్తూనే మరోవైపు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తెలుగుదేశం నిర్వహిస్తోంది. ఇంతవరకు ఈ కార్యక్రమాలు విజయవంతంగా సాగుతున్నాయి. ఎక్కడా ఎటువంటి అలజడి లేకుండానే ముందుకెళ్తున్నారు. తమ పథకాల్ని క్షేత్రస్తాయిలో ప్రచారం చేయడం ద్వారా లబ్ధిదార్లను ఓటర్లుగా మార్చుకునే ప్రక్రియకు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే వామపక్షాలు కూడా ఇప్పుడు యాత్రలు మొదలెట్టాయి. సీపీఎం ఈ నెల 1వ తేదీ నుంచి నియోజకవర్గాల వారీగా పాదయాత్ర నిర్వహిస్తోంది. ఈ పార్టీ ప్రధానంగా ప్రభుత్వ వైఫల్యాలపైనే దృష్టిపెట్టింది. మరోపక్క అడ్డగోలు భూసేకరణపై విమర్శలు సంధిస్తోంది. పారిశ్రామికవేత్తల కోసం మూడుపంటలు పండే భూముల్ని బలవంతంగా సేకరించడాన్ని తూర్పారబడుతోంది. కాలుష్యకారక పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులిచ్చి పర్యావరణాన్ని మంటగలిపేస్తోందంటూ ఈ పార్టీ నాయకులు ఊరూరా తిరిగి ప్రచారం చేస్తున్నారు. సంక్షేమ పథకాల అమల్లో ప్రభుత్వం విధిస్తున్న కోతల్ని కూడా వివరిస్తున్నారు. సంక్షేమ రాజ్యాంగా ఉండాల్సిన ప్రజాస్వామ్యం కొన్నివర్గాలకే పరిమితమైందంటూ ప్రచారం చేస్తున్నారు. ఇక సిపిఐ అనంతపురం నుంచి ఇచ్చాపురం వరకు జీపుజాతా ప్రారంభించింది. ఎస్‌ సి - ఎస్‌ టి - బిసిల సమస్యలపై ఈ పార్టీ పోరాటం చేస్తోంది. ఈ వర్గాలకు కేటాయించిన నిధుల్ని దారిమళ్ళిస్తున్న వైనాన్ని వివరించి చెబుతోంది. అలాగే అడ్డగోలు భూసేకరణపై మండిపడుతోంది.

మొత్తంగా అధికార పక్షం తన పథకాల్ని ప్రచారం చేసుకుంటుంటే విపక్షాలు ప్రభుత్వ వైఫల్యాలపై పెద్ద ఎత్తున ప్రచారానికి ఒడిగడుతున్నాయి. రాష్ట్రంలోని పదమూడు జిల్లాల్లో ప్రతి చోటా ఈ యాత్రలు సాగుతూనే ఉన్నాయి. దీంతో ఎవరుచెప్పేది యదార్ధమో తెలీక సామాన్యుడు సతమతమౌతున్నాడు. అదే స‌మ‌యంలో త‌మ‌ చెవులు చిల్లులు ప‌డేలా ఉన్నాయ‌ని వాపోతున్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News