తెలంగాణలో ప‌బ్లిసిటీ ప్లానింగ్స్ ఇవే!

Update: 2018-10-08 06:59 GMT
ముందస్తుకు ముహూర్తం ఖరారై పోయింది. అధికార - ప్రతిపక్ష పార్టీలు ఓట్ల వేటకు సమాయత్తమవుతున్నాయి. ఎవరికి వారే ఓట్ల వర్షం కోసం వ్యూహాలు - ప్రతి వ్యూహాలు రచిస్తున్నారు. అంతే కాదు... ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకుందుకు ఎత్తులు - పైఎత్తులకు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించి... ప్రచారాన్ని హోరెత్తిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి తన ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయనుంది. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోంది. దసరా పండగను పురస్కరించుకుని పెద్ద ఎత్తున సభలు - సమావేశాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే మూడు సభలతో హోరెత్తించిన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు రానున్న రోజుల్లో మరింత విజృంభించనున్నారు. వచ్చే నలభై రోజుల్లో ఏకంగా వంద సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. తెలుగుదేశం - కాంగ్రెస్ - తెలంగాణ జన సమితిలను నిర్వీర్యం చేసేందుకు ఈ సభలకు ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. ఈ సభల్లో గడచిన నాలుగు సంవత్సరాల్లో తాము ఏం చేసామో చెబుతూనే.... మహాకూటమిలో ఉన్న డొల్లతనాన్ని కూడా ఎండగట్టాలన్నది కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆలోచనగా చెబుతున్నారు. ప్రతి జిల్లాలోనూ కనీసం రెండు సభలు నిర్వహించాలన్నది వ్యూహంగా చెబుతున్నారు. జిల్లాలో ఒక చోట  జరిగే సభలో కె.చంద్రశేఖర రావు పాల్గొంటే  అదే జిల్లాలో  మరోచోట హరీష్ రావ్ - తారక రామారావు - ఈటెల వంటి నాయకులు సభలు జరిపేలా చర్యలు తీసుకుంటున్నారు. 

ఇక కాంగ్రెస్ పార్టీ వచ్చే పదో తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా బహిరంగ సభలు జరపాలని తీర్మానించింది. ఈ సభలకు పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలను కూడా ఈ సభలకు ఆహ్వానించాలన్నది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆలోచనగా చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ఇవి సెమీఫైనల్ గా చెబుతున్న క్రమంలో ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలన్నది కాంగ్రెస్ శ్రేణుల లక్ష్యంగా చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ కూడా ఆ గాలిని రప్పించేలా బహిరంగ సభలు, ప్రచారం చేయాలని తీర్మానించినట్లు చెబుతున్నారు. భారతీయ జనతా పార్టీ కూడా తన ప్రచారాన్ని భారీగా చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోందని సమాచారం. ఈ నెల పదో తేదిన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను రాష్ట్రానికి రప్పిస్తున్నారు. ఆయన ఇక్కడ కనీసం పది సభల్లో పాల్గొంటారని సమాచారం. అలాగే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కూడా ప్రచారానికి తీసుకురావాలన్నది కమలనాథుల ఆలోచనగా చెబుతున్నారు. వీరితో పాటు తెలంగాణ ప్రజల్లో చిన్నమ్మగా పేరున్న సుష్మా స్వరాజ్‌ తో పాటు జాతీయ నాయకులు అద్వానీ - రాజ్‌ నాథ్‌ సింగ్ వంటి వారితో కూడా సభలు జరపాలన్నది తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకుల ఆలోచనగా చెబుతున్నారు. రానున్న 50 రోజులు తెలంగాణ రాష్ట్రం సభలు - సమావేశాలతో హోరెత్తనుంది. 
Tags:    

Similar News