టీడీపీ అంటే అందరికీ అంత లోకువా?

Update: 2016-06-18 04:54 GMT
అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ పార్టీ బలం వేరుగా ఉంటుంది. దాని ధాటికి విపక్షాలు విలవిలలాడిపోతుంటాయి. మిగిలిన రాజకీయ పార్టీల తీరంతా ఇలా ఉంటే తెలుగుదేశం పార్టీ పరిస్థితే అందుకు భిన్నమని చెప్పాలి. ఏపీలో ఆ పార్టీ అధికారంలో ఉంది. కానీ.. ఆ పార్టీ అందరి చేత మాట అనిపించుకోవటమే కనిపిస్తుంది. అదే సమయంలో తమ మీద పడుతున్న నేతల మాటల్ని తెలుగు తమ్ముళ్లు తిప్పి కొడుతున్నారా? అంటే అది కనిపించదు.

ప్రతి మాటకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కానీ.. తమ మాటలతో దొరికిపోయినప్పుడు వారిని ఉపేక్షించే ధోరణి తెలుగుదేశం పార్టీ నేతల్లోనే కనిపిస్తోంది. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల్ని చూస్తే.. తెలుగుదేశం పార్టీ మరీ అంత లోకువ అయిపోయిందా? అన్న భావన కలగటం ఖాయం. ఎందుకంటే.. రెండు వేర్వేరు రాజకీయ పార్టీలు తిట్టుకుంటూ.. పరస్పరం విమర్శలు చేసుకుంటూనే.. మధ్యలో తెలుగుదేశం పార్టీని తీసుకొచ్చి చెడుగుడు ఆడుకోవటం కనిపిస్తోంది.

ఈ మధ్య తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. తెలంగాణ అధికారపక్ష నేతల మధ్య మాటల వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వారు పలు మాటలు అనుకున్నారు. విమర్శలు.. ఆరోపణలతో వాతావరణాన్ని వేడెక్కించారు. చివరకు ఢిల్లీ నుంచి వచ్చిన డిగ్గీ రాజా సైతం తెలంగాణ అధికారపక్ష వైఖరిని తీవ్ర స్థాయిలో తప్పు పట్టారు. అంతాబాగానే ఉన్నా.. ఈ రెండు పార్టీల మధ్య నడిచిన మాటల యుద్ధంలో తెలుగుదేశం ప్రస్తావన పదే పదే కనిపించటం గమనార్హం. కాంగ్రెస్.. తెలుగుదేశం పార్టీలు కలిసి తమ ప్రభుత్వాన్ని కూలదోసే కుట్ర చేశాయంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విరుచుకుపడితే.. తెలంగాణ రాష్ట్ర సమితి.. తెలుగుదేశం పార్టీలు లోగుట్టుగా వ్యవహరిస్తున్నాయంటూ డిగ్గీ రాజా వ్యాఖ్యలు చేయటం గమనార్హం.

ఇలా ఎవరికి వారు తమను టార్గెట్ చేయటాన్ని ఏ తెలుగుదేశం పార్టీ నేత ప్రశ్నించటం కనిపించదు. ప్రతి దానికి మా మీద ఎందుకు పడుతున్నారు? ఏ విషయంలోనూ తమకు సంబంధం లేదంటూ లాజిక్ గా ఫైర్ కావటం కనిపించదు. అవకాశం వచ్చినప్పుడు కూడా కామ్ గా ఉండటం.. రాజకీయ ప్రత్యర్థులు వేస్తున్న నిందలకు ధీటుగా సమాధానం చెప్పకపోవటం లాంటివే టీడీపీని తరచూ టార్గెట్ చేసేలా చేస్తున్నాయన్న మాట వినిపిస్తోంది. ఇంతకీ.. తెలుగు తమ్ముళ్ల ఎందుకంత పట్టనట్లు వ్యవహరిస్తున్నారు..?
Tags:    

Similar News