రగులుతున్న కమ్మ...ఆనాటి పరిస్థితులే రిపీట్...?

Update: 2022-04-24 02:35 GMT
రాజకీయాలు అంటే మళ్ళీ కులాల గురించే మాట్లాడుకోవాల్సి వస్తోంది. ఇది అనివార్యం అవుతోంది. నిజానికి కుల ప్రస్థావన లేని రాజకీయం కూడా ఇపుడు లేదు. ఇవన్నీ పక్కన పెడితే ఏపీలో గత కొన్ని రోజులుగా ఒక బలమైన సామాజికవర్గం రగులుతోంది. అదే కమ్మ కులం. ఆ కులం చరిత్ర చాలా గొప్పది. రాజకీయాల్లో వారు ఎపుడూ కీలకమే. స్వాతంత్రం పూర్వం నుంచి కూడా వారు రాజకీయంగా సామాజికంగా కీలకంగా ఉన్నారు.

అలాంటి కులానికి ఏపీ రాజకీయ చరిత్రలో ఫస్ట్ టైమ్ మంత్రి పదవి లేకుండా పోయింది. అదే టైమ్ లో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులస్థూలకు కూడా మంత్రి పదవులు దక్కలేదు. అయితే ఆ కులాలు బయటకు ఇంతలా వచ్చి బాధపడడంలేదు. కానీ రాజకీయాలను శాసించే స్థాయిలో ఉన్న కమ్మలు మాత్రం దీన్ని అవమానంగా భావిస్తున్నాయి అంటున్నారు.

అందుకే తెలుగు రాష్ట్రాలలో పార్టీలు, ప్రాంతాలతో సంబంధం లేకుండా కమ్మ వారు ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు. నిన్నటికి నిన్న కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి నిజమాబాద్ లో అమరావతి రాజధాని మీద బిగ్ సౌండ్ చేసినా ఈ రోజు ఖమ్మం జిల్లాకు చెందిన కమ్మ మంత్రి పువ్వాడ అజయ్ ఏపీ గురించి ప్రస్థావించినా అంతర్లీనంగా వారిలో దాగున్న ఆవేదన, ఆగ్రహం స్పష్టంగా కనిపిస్తోంది అంటున్నారు.

ఏపీలో ఏకైక కమ్మ మంత్రి పదవి పీకేశారు. ఇపుడు తెలంగాణాలో నాకు కూడా ఏ పదవీ లేకుండా చేయాలని చూస్తున్నారు అంటూ అజయ్ చేసిన హాట్ కామెంట్స్ మామూలుగా చేసినవి కావు అనే అంటున్నారు. అన్నీ ఆలోచించి అర్ధవంతంగానే ఆయన ఈ కామెంట్స్ చేశారు అనుకోవాలి.  మరో వైపు టీడీపీ అధినేత చంద్రబాబు అయితే నా మీద కోపంతో కమ్మలను వైసీపీ టార్గెట్ చేస్తోంది అని డైరెక్ట్ గానే ఆరోపణలు చేస్తున్నారు.

ఒకనాడు అంటే ఉమ్మడి ఏపీని దశాబ్దాల పాటు ఏలిన కమ్మలు మిగిలిన సామాజిక వర్గాలకు మంత్రి పదవులు ఇచ్చే స్థాయిలో ఉండేవారు ఇపుడు విభజన తరువాత ఏపీలో తొలి ప్రభుత్వం టీడీపీదే అయింది. అలా కమ్మలకు కొంత రాజకీయ ఊతం దొరికింది. కానీ అయిదేళ్లకే ఆ ముచ్చట కాస్తా ముగిసింది. జగన్ ప్రభుత్వంలో ఒక మంత్రి పదవి కమ్మలకు వచ్చినపుడే కొంత అసంతృప్తి కనిపించింది.

ఇపుడు విస్తరణలో ఆ పదవి కూడా పోవడంతో కమ్మలలో పెద్ద చర్చ సాగుతోంది అంటున్నారు. రాజకీయంగా చురుకైన సామాజికవర్గంగా ఉన్న వారికి రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ రోజు చూసుకుంటే ఎక్కడా అవకాశాలు ఉండడంలేదన్న బాధ కనిపిస్తోంది. దాని నుంచే అజయ్ లాంటి వారి కామెంట్స్ చూడాలి అని అంటున్నారు.

మరో వైపు చూస్తే కమ్మల కులస్థులు అంతా పోలరైజ్ అవుతున్నారు అన్న ప్రచారం కూడా సాగుతోంది. తమకు రాజకీయంగా ఒక ఉనికి గుర్తింపు ఉండాలని బలంగా కోరుకునే ఈ సామాజికవర్గం తగ్గేదే లే అంటోంది. మంత్రి పదవి ఏపీలో ఇవ్వకపోవడాన్ని వారు తీరని అవమానంగానే భావిస్తున్నారు. ఇక తెలంగాణాలో మంత్రి పువ్వాడ మీద ఆరోపణలు వచ్చాయి. బీజేపీ అయితే ఆయనను తప్పించాలని డిమాండ్ చేస్తోంది.

అయితే ఏపీలో కమ్మలకు ప్రాతినిధ్యం లేకపోవడంతో పువ్వాడను పదవి నుంచి తప్పించే సాహసం తెలంగాణా సర్కార్ చేస్తుందా అనన్ చర్చ కూడా ఉంది. అదే సమయంలో ఆయన్ని తప్పించినా అక్కడ కమ్మలకు బెర్త్ కేటాయించి అకామిడేట్ చేస్తారు అని కూడా అంటున్నారు. ఏది ఏమైనా గతంలో కొన్ని దశాబ్దాలుగా వెలుగొందుతూ రాజకీయంగా రాణిస్తున్న కమ్మలకు ఎన్నడూ లేని విధంగా తెలుగు రాష్ట్రాలలో రాజకీయ అవకాశాలు అయితే తగ్గిపోతున్నాయి. దాంతో వారు రగులుతున్నారు.

బహుశా దీన్ని 1983 కి పూర్వం ఉన్న పరిస్థితిగా కూడా భావించాలేమో. నాడు కమ్మలు రగిలితే టీడీపీ అన్న కొత్త పార్టీ వచ్చింది. ఏకంగా రాజకీయాలనే సమూలంగా మార్చేసింది. ఇపుడు కూడా తెలుగు నాట జరుగుతున్న పరిణామాల పట్ల వారు మండుతున్నారు. దీని ఫలితాలూ పర్యవశానాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.
Tags:    

Similar News