నిజామాబాద్ పోలింగ్.. ఎన్ని వింతలో తెలుసా?

Update: 2019-04-11 05:49 GMT
దేశంలో ఎక్కడా జరగనటువంటి అతిపెద్ద పోలింగ్ తెలంగాణలోని నిజామాబాద్ లో జరుగుతోంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే ఇక్కడి పోలింగ్ ఆసక్తి రేపుతోంది. దేశంలోనే అత్యధికంగా 185 మంది నిజామాబాద్ లోక్ సభకు పోటీపడుతున్నారు. ఇందులో 178 మంది రైతులే కావడం విశేషం. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని.. తమ పంటకు మద్దతు ధర దక్కడం లేదని ఎర్రజొన్న , పసుపు రైతులు నిజామాబాద్ లోక్ సభకు పోటీచేస్తూ తమ నిరసనను దేశవ్యాప్తంగా తెలియజేయడానికి ఇలా పూనుకున్నారు. అయితే ఇంతమంది బరిలో ఉండడంతో ఎన్నికల కమిషన్ కు ఈ ఎన్నిక నిర్వహణ తలకు మించిన భారంగా మారింది.

ఇక్కడ ప్రతీ పోలింగ్ కేంద్రంలో 12 ఈవీఎంలను అనుసంధానించి పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం దాదాపు 600 ఇంజినీర్లు పనిచేస్తున్నారు.  ఇక భారీ పోలింగ్ కావడంతో దాదాపు 28000 మంది అదనపు సిబ్బందిని ఎన్నికల కమిషన్ ఇక్కడ పోలింగ్ కు వినియోగిస్తోంది. ఒక ఎంపీ సీటులో ఇంత మంది పనిచేయడం దేశంలోనే అత్యధికమట.. ఇక్కడ పోటీచేసే 185మంది అభ్యర్థుల పేర్లు - వారి గుర్తులు ఒక సింగిల్ కంట్రోల్ రూమ్ కు కనెక్ట్ చేయబడి ఉంటాయి. ఈవీఎంలను పోలింగ్ బూత్ లోపల ఒక ఎల్ పద్ధతిలో ఏర్పాటు చేస్తారు. ఇలా ఇంత పెద్దగా ఏర్పాటు చేయడం.. నిర్వహించడం భారత దేశ పార్లమెంట్ ఎన్నికల్లోనే ఒక రికార్డుగా ఈసీ తెలిపింది. దీన్నొక చాలెంజ్ గా నిర్వహిస్తోంది.

నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో 15.53 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈసీ 1788 పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేసింది. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.  భారీ పోలింగ్ కావడంతో ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద భారీగా పోలీస్ బలగాలతోపాటు ఓటర్లకు భారీ ఏర్పాట్లను ఈసీ చేసింది.
Tags:    

Similar News